ఫేక్ న్యూస్‌పై స్పందించిన మెగాస్టార్‌

మెగాస్టార్ చిరంజీవి త‌ల్లి అంజ‌నా దేవి క‌రోనా వైర‌స్ పోరాటంలో భాగంగా త‌న వంతు సాయం చేస్తున్నార‌ని, అందులోభాగంగా త‌న స్నేహితుల‌తో క‌లిసి 700 మాస్కుల‌ను త‌యారు చేసి అవ‌స‌ర‌మైన వారికి అందిస్తున్నార‌ని సోష‌ల్ మీడియాలో వార్త‌లు వినిపించాయి. అయితే ఈ వార్త‌లపై మెగాస్టార్ చిరంజీవి ట్విట్ట‌ర్ వేదిక‌గా స్పందించారు. ‘‘మా అమ్మగారు మాస్కులు తయారు చేయడం లేదు. పలు మీడియాల్లో వస్తున్న వార్తల్లో ఉన్న వ్య‌క్తి మా అమ్మ‌గారు కారు. కానీ ఎవ‌రైతే ఈ వార్త‌ల్లో ఉన్నారో ఆ త‌ల్లికి నా హృద‌య‌పూర్వ‌క‌మైన కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేస్తున్నాను. క‌మ్మ‌నైన మ‌న‌సున్న ప్ర‌తి త‌ల్లి అమ్మే’’ అని చిరంజీవి తెలిపారు.

క‌రోనా వైరస్ నివారణలో మెగా ఫ్యామిలీ చురుకుగా వ్యవహరిస్తోంది. భారీ విరాళాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు కేటాయించారు. అంతే కాకుండా సినీ కార్మికుల కోసం కరోనా క్రైసిస్ చారిటీ మనకోసం అనే సంస్థను చిరంజీవి అధ్యక్షతనే ఏర్పాటు చేశారు. దాదాపు 7-8 కోట్ల రూపాయలను వసూలు చేసి సినీ కార్మికులను ఆదుకుంటున్నారు. అంతే కాకుండా చిరంజీవి సోషల్ మీడియాలో చురుకుగా ఉంటూ ప్రజల్లో కరోనా వైరస్‌పై అవ‌గాహ‌న‌న‌ను పెంచుతున్నారు.