Chiranjeevi : మృగాళ్లకు కఠిన శిక్షపడాల్సిందే... డీఏవీ స్కూల్ ఘటనపై చిరు స్పందన
- IndiaGlitz, [Wednesday,October 26 2022]
హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని డీఏవీ పాఠశాలలో నాలుగేళ్ల చిన్నారిపై జరిగిన దారుణం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. సదరు స్కూల్ ప్రిన్సిపాల్ మాధవి వద్ద కారు డ్రైవర్‌గా పనిచేస్తోన్న రజనీకుమార్ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై మహిళా సంఘాలు భగ్గుమన్నాయి. అటు పలువురు ప్రముఖులు కూడా సోషల్ మీడియా ద్వారా ఈ ఘటనపై స్పందిస్తున్నారు. నిందితుడైన డ్రైవర్‌ను, ఈ దారుణం గురించి తెలిసినా సరైన చర్యలు తీసుకోని ప్రిన్సిపాల్‌పై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. తాజాగా ఈ లిస్ట్‌లోకి మెగాస్టార్ చిరంజీవి కూడా చేరారు. ఈ మేరకు మంగళవారం ఆయన ట్వీట్ చేశారు.
Let such Horrors not recur ever again! pic.twitter.com/s1tzujCevh
— Chiranjeevi Konidela (@KChiruTweets) October 25, 2022
మృగాళ్లకు కఠిన శిక్షలు విధించాల్సిందే :
‘‘ఆటవిక సంస్కృతి నుండి ఆనవాళ్లు మోసుకొస్తున్న కొందరు మృగాళ్ల వికృత చేష్టలకు కఠినాతి కఠినమైన శిక్షలు వేగవంతంగా విధించడమే కాకుండా, ప్రభుత్వాలు అన్ని విద్యాసంస్థల్లో సి.సి. టీవీ కెమెరాల ఏర్పాట్లకు యుద్ధప్రాతిపదికన తక్షణ చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను. భావితరాలకు భరోసా కల్పించడం మనందరి సమిష్టి బాధ్యతగా భావిస్తున్నాను ’’ అంటూ చిరు ట్వీట్‌లో పేర్కొన్నారు.
నా హృదయం ముక్కలైంది : శేఖర్ కమ్ముల
అంతకుముందు రెండు రోజుల క్రితం ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల కూడా డీఏవీ కాలేజీ ఘటనపై స్పందించారు. ఈ ఘటనతో హృదయం ముక్కలైందని... కానీ ఆ చిన్నారి తల్లిదండ్రులు చేస్తున్న పోరాటానికి న్యాయం జరగాలని కోరుకుంటున్నానని శేఖర్ కమ్ముల అన్నారు. నాగరిక సమాజంలో ఇలాంటి ఘటనలు జరగకూడదని... చిన్నారుల భద్రత విషయంలో రాజీపడకూడదని ఆయన అభిప్రాయపడ్డారు.
డీఏవీ పబ్లిక్ స్కూల్ గుర్తింపు రద్దు వద్దు : పేరెంట్స్
మరోవైపు... డీఏవీ పబ్లిక్ స్కూల్ గుర్తింపును రద్దు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై విద్యార్ధుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చిన్నారుల భవిష్యత్తు దృష్ట్యా గుర్తింపు రద్దు నిర్ణయం వెనక్కి తీసుకోవాలని ప్రభుత్వాన్ని పేరెంట్స్ కోరుతున్నారు. ఈ మేరకు సంతకాల సేకరణకు శ్రీకారం చుట్టారు. అధికారిక గణాంకాల ప్రకారం.. డీఏవీ పబ్లిక్ స్కూల్‌లో 700 మంది విద్యార్ధులు చదువుతున్నారు.