చిరు, చరణ్ కాంబినేషన్లో మలయాళ రీమేక్
- IndiaGlitz, [Tuesday,October 01 2019]
మెగాస్టార్ చిరంజీవి, ఆయన తనయుడు మెగాపవర్‌స్టార్ రామ్‌చరణ్ కాంబినేషన్లో ఇప్పటి వరకు మూడు చిత్రాలు వచ్చాయి. 'మగధీర', 'బ్రూస్లీ', 'ఖైదీ నంబర్ 150' చిత్రాల్లో ఇద్దరూ ప్రేక్షకులను మెప్పించారు. తాజాగా మరోసారి వీరిద్దరూ వెండితెరపై సందడి చేయబోతున్నారని సినీ వర్గాల సమాచారం. వివరాల ప్రకారం మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్ నటించిన చిత్రం 'లూసిఫర్'ని తెలుగులో రీమేక్ చేయబోతున్నారట. హీరో పృథ్వీరాజ్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కి ఘన విజయాన్ని సాధించింది. ఈ సినిమా రీమేక్ హక్కులను రామ్‌చరణ్ దక్కించుకున్నారట. ఈ విషయాన్ని పృథ్వీరాజ్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. వినపడుతున్న సమాచారం మేరకు ఈ పొలిటికల్ చిత్రం రీమేక్‌లో మోహన్‌లాల్ పాత్రలో చిరంజీవి.. పృథ్వీరాజ్ పాత్రలో చరణ్ నటిస్తారని టాక్.
ప్రస్తుతం చిరంజీవి 151వ చిత్రం 'సైరా నరసింహారెడ్డి'విడుదలవున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత చిరు, కొరటాల కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ సినిమా తర్వాతే 'లూసిఫర్' రీమేక్ తెరకెక్కుతుందని సమాచారం. దాదాపు ఈ సినిమాను వచ్చే ఏడాదే సెట్స్‌కు వెళ్లేలా కనపడుతుంది. అలాగే రామ్‌చరణే ఈ సినిమాను నిర్మించనున్నారని కూడా అర్థమవుతుంది.