పాలిటిక్స్‌లోకి రీ ఎంట్రీపై పెదవి విప్పిన చిరు.. ఆనందంలో ఫ్యాన్స్
Send us your feedback to audioarticles@vaarta.com
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం టాలీవుడ్ సీనియర్ హీరో, కేంద్ర మాజీ మంత్రి మెగాస్టార్ చిరంజీవి స్వయంగా సీఎం ఆఫీస్‌కు వెళ్లి కలిసిన విషయం విదితమే. ఈ వ్యవహారం గల్లీ మొదలుకుని ఢిల్లీ వరకు చర్చనీయాంశమైంది. అంతేకాదు.. ప్రాంతీయం మొదలుకుని జాతీయ మీడియాల్లో ప్రత్యేక కథనాలు వెలువడ్డాయి. అయితే ఈ కలయిక అనంతరం ఎన్నో ఎన్నెన్నో పుకార్లు షికార్లు చేశాయి. కొందరేమో ఇద్దరు ఒక్కటయ్యారని.. ఇంకొందరేమో వైసీపీలోకి వచ్చేస్తారని.. మరికొందరేమో ఏకంగా రాజ్యసభకే పంపుతున్నట్లు తెగ ఊహించేసుకున్నారు. అయితే.. జగన్‌ను చిరు ఎందుకు కలిశారు..? భేటీలో ఏం జరిగింది..? ఏమేం చర్చించారు..? చిరు నిజంగానే వైసీపీలో చేరతారా లేదా తమ్ముడికే సపోర్ట్ చేస్తారా ..? అసలు చిరు రాజకీయాల్లోకి రీ ఎంట్రీ ఇస్తారా..? అనే విషయాలను తాజాగా ఓ ఇంటర్వ్యూ వేదికగా ఫుల్ క్లారిటీ ఇచ్చేశారు.
మళ్లీ రాజకీయాలా..!?
వైఎస్ జగన్‌ను కలిసినప్పుడు మా మధ్య రాజకీయపరమైన చర్చ జరగలేదు. జగన్ కూడా నా వద్ద రాజకీయాల ప్రస్తావన తీసుకురాలేదు. ఆ గౌరవాన్ని ఆయన అలాగే ఉంచారు. వైసీపీలోకి నన్ను ఆహ్వానిస్తారని కూడా నేను భావించడం లేదు. తమ్ముడు పవన్ కల్యాణ్ రాజకీయాల్లో ఉన్నాడు.. తమ్ముడి మాటే మా అందరి మాట. ఇదే విషయాన్ని ఇంతకు ముందే నేను చెప్పాను. 64 ఏళ్ల వయసులో మళ్లీ రాజకీయాల వైపు వెళ్లాలనే ఆలోచన నాకు లేదు’ అని చిరు క్లారిటీ ఇచ్చారు. రాజ్యసభ సభ్యుడిగా పదవీ కాలం ముగిసిన తర్వాత చిరు.. ఇక రాజకీయాలకు రాం రాం చెప్పేసి ప్రస్తుతం సినిమాల్లో బిజిబిజీగా గడుపుతున్నారు. అంటే చిరు రీ ఎంట్రీ ఇవ్వడానికి రెడీగా లేరన్న మాట.
ప్రమాణ స్వీకారానికే వెళ్లాల్సింది కానీ..
‘వైఎస్ కుటుంబంతో ముందు నుంచే నాకు సన్నిహిత సంబంధం ఉంది. ఆ సాన్నిహిత్యంతోనే జగన్‌ను కలిశాను. వాస్తవానికి జగన్ ప్రమాణస్వీకారానికే వెళ్లాల్సి ఉందని.. కానీ ఆ సమయంలో కాలు బాగోలేకపోవడంతో వెళ్లలేకపోయాను. సీఎంగా జగన్ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఫోన్ ద్వారా శుభాకాంక్షలు తెలిపాను’ అని చిరు చెప్పుకొచ్చారు.
ఎవరైనా సరే అభినందిస్తా!
‘జగన్‌ని కలవడం.. వారి ఆతిథ్యాన్ని స్వీకరించడం మరచిపోలేని అనుభూతి. మూడు రాజధానుల నిర్ణయం నచ్చింది కాబట్టే అభినందించాను. ఎవరు మంచి చేసినా అభినందిస్తాను.. దీన్ని రాజకీయం చేయకూడదు’ అని చిరంజీవి చెప్పుకొచ్చారు. కాగా.. మూడు రాజధానుల నిర్ణయాన్ని చిరంజీవి మెచ్చుకున్న సంగతి తెలిసిందే. అంతేకాదు.. బహిరంగ ప్రకటన కూడా చేశారు. అయితే అదే ఇంట్లోని పవన్ మాత్రం వ్యతిరేకించడం అప్పట్లో పెద్ద హాట్ టాపిక్ అయిన విషయం విదితమే.
జనసేనకే నా మద్దతు..
తమ్ముడు పవన్ కల్యాణ్ స్థాపించిన జనసేన పార్టీకే నా మద్దతు. నేనొక పార్టీలో, తమ్ముడు మరొక పార్టీలో ఉంటే మమ్మల్ని గుండెల్లో పెట్టుకుని ఆరాధించే అభిమానులు అయోమయానికి గురవుతారు. అందుకే అలాంటి పరిస్థితి తలెత్తకుండా ఉండేందుకే జనసేనకు మద్దతు పలుకుతున్నానను. పవన్ కల్యాణ్ గురించి నాకు పూర్తిగా తెలుసు.. చాలా పట్టుదల ఉన్న వ్యక్తి. ఈరోజు కాకపోయినా... రేపటి రోజైనా పవన్ అనుకున్నది సాధిస్తాడు. ఒక అన్నగా పవన్‌పై నాకు నమ్మకం ఉంది. మా కుటుంబం మొత్తం పవన్ వెంటే ఉంటుంది’ అని చిరు స్పష్టం చేశారు.
తమ్ముడు గుణపాఠం నేర్చుకున్నాడు..!
‘మా దారులు వేరైనా... గమ్యం మాత్రం ఒకటే. పవన్ కు రాజకీయ సలహాలు ఇవ్వాల్సిన అవసరం లేదు. ప్రజారాజ్యం పార్టీలో యువరాజ్యం అధ్యక్షుడిగా పని చేసిన అనుభవం పవన్‌కు ఉంది. అప్పట్లో పార్టీలో జరిగిన పరిణామాలను పవన్ దగ్గరుండి చూశాడు. నేను చేరదీసిన వాళ్లు నన్ను దెబ్బతీశారనే భావన పవన్ లో ఉంది.. నాకు తగిలిన ఎదురు దెబ్బల నుంచి పవన్ గుణపాఠం నేర్చుకున్నాడు. అందుకే అలాంటి తప్పులు మళ్లీ జరగకుండా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాడు. అయితే.. మేం కలుసుకున్నప్పుడు మా మధ్య రాజకీయపరమైన చర్చలు రావు’ అని చిరంజీవి నిశితంగా వివరించారు.
మొత్తానికి చూస్తే.. గత కొన్నిరోజులుగా జనసేన కార్యకర్తలు, మెగాభిమానుల్లో నెలకొన్న అనుమానాలను చిరు నివృతి చేశారు. మరి 2019 ఎన్నికల్లో అట్టర్ ప్లాప్ అయిన జనసేన 2020లో.. అంతకుమునుపే జరిగే సార్వత్రిక ఎన్నికల్లో ఏ మాత్రం గెలుస్తుందో.. ముఖ్యంగా చిరు సపోర్ట్ ఏ మాత్రం పని చేస్తుందో..? తమ్ముడు తరఫున అన్నయ్య ప్రచారం చేస్తారా..? అనే విషయాలపై క్లారిటీ రావాలంటే మరికొన్ని రోజులు వేచి చూడక తప్పదు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com