సినీ కార్మికుల ఆ పని చేయ‌డానికి కూడా సిద్ధ‌మేనంటున్న మెగాస్టార్‌

కరోనా వైరస్ ప్రభావంతో దేశమంతటా లాక్ క్ డౌన్ కొనసాగుతోంది. మే 3 వరకు ఈ పరిస్థితి ఇలాగే ఉంటుంది. తరువాత పరిస్థితులు ఎలా ఉంటాయో ఇప్పుడే చెప్పలేమంటున్నారు ప్ర‌ముఖులు. దేశంలో కరోనా ప్రభావంతో చాలా రంగాలు దెబ్బతిన్నాయి. అందులో సినీరంగం కూడా ఉంది. కరోనా దెబ్బకు షూటింగ్స్ అన్నీ ఆగిపోయాయి. ఈ స‌మ‌యంలో స్టార్స్ పరిస్థితి బాగానే ఉన్నా.. సినిమానే నమ్ముకున్న కార్మికులు చాలా ఇబ్బందికరమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. తెలుగు సినిమా విషయానికి వస్తే సినీ కార్మికుల కోసం చిరంజీవి ఆధ్వ‌ర్యంలో ‘కరోనా క్రైసిస్ చారిటీ మనకోసం’ అనే సంస్థను ఏర్పాటు చేశారు.

సినీ కార్మికుల కోసం సినీ ప్రముఖులందరూ విరాళాలను అందిస్తున్నారు. ఇప్పటివరకు దాదాపు ఎనిమిది కోట్ల రూపాయలు విరాళాలుగా అందాయి. దీంతో 12000 సినీ కార్మికుల కుటుంబాలకు నిత్యావసర వస్తువులను అందజేస్తున్నారు. ఒకవేళ అనుకోని పరిస్థితుల కారణంగా లాక్‌డౌన్‌ కొనసాగితే అప్పుడు కూడా సినీ కార్మికుల కోసం నిత్యవసర వస్తువులను సీసీసీ మ‌న‌కోసం ద్వారా అందజేయడానికి తాము సిద్ధంగా ఉన్నామని చిరంజీవి రీసెంట్ ఇంట‌ర్వ్యూలో తెలిపారు ఒకవేళ నిధులు త‌గ్గితే ఇప్పటివరకు ఎవరి ముందు చేయి చాచి అడ‌గ‌ని త‌ను.. సినీ కార్మికుల కోసం చేయి చాచి విరాళాలను సేకరిస్తారని తెలిపారు. సినీ కార్మికుల సంక్షేమం కోసం పాటుపడటం తనకెంతో ఆనందంగా ఉందని, కళామతల్లి రుణం తీర్చుకునే అవకాశంలో ఇదొక చిన్న భాగమని ఆయన ఇంటర్వ్యూలో చెప్పారు.