Adavi Donga Movie : మత్తు ఇవ్వకుండా.. ‘‘అడవి దొంగ’’ సినిమా చూపిస్తూ, గాంధీలో అరుదైన సర్జరీ
Send us your feedback to audioarticles@vaarta.com
ప్రజల ప్రాణాలను కాపాడటం వైద్యుల కర్తవ్యం. ఈ క్రమంలో కొందరికి ఆపరేషన్ చేయాల్సి వస్తుంది. అయితే వీటిలో సింపుల్‌గా చేసే సర్జరీలే కాకుండా అప్పుడప్పుడూ క్లిష్టమైన ఆపరేషన్‌లు కూడా వుంటాయి. ఈ క్రమంలో సికింద్రాబాద్‌లోని గాంధీ ఆసుపత్రి వైద్యులు కూడా అత్యంత క్లిష్టమైన ఆపరేషన్‌ను నిర్వహించారు. అయితే రోగికి మత్తు మందు ఇవ్వకుండా స్పృహలో వుంచే ఆపరేషన్ చేయాలి. ఇది ఆషామాషీ వ్యవహారం కాదు. రోగి ఏమాత్రం ఆందోళనకు గురికాకుండా పనిపూర్తి చేయాల్సి వుంటుంది. ఇక్కడే వైద్యులు తెలివిగా వ్యవహారించారు. మెగాస్టార్ చిరంజీవి సినిమా ‘‘అడవి దొంగ’’ చూపించి ఆమెకు విజయవంతంగా సర్జరీ నిర్వహించారు.
మాట కలుపుతూ.. అడవి దొంగ సినిమా చూపిస్తూ సర్జరీ పూర్తి:
వివరాల్లోకి వెళితే.. యాదాద్రి జిల్లాకు చెందిన 60 ఏళ్ల వృద్ధురాలు అనారోగ్యంతో బాధపడుతూ గాంధీ ఆసుపత్రిలో చేరింది. ఈ క్రమంలో ఆమెకు పరీక్షలు చేసిన వైద్యులు.. మెదడులో కణితి ఏర్పడిందని గుర్తించారు. దీంతో దానిని తొలగించేందుకు ఆగస్ట్ 25న ఆపరేషన్ నిర్వహించారు. అది స్పృహలో వుంచి చేయాల్సిన సర్జరీ కావడంతో , ఆ సమయంలో రోగి ఎలాంటి ఒత్తిడికి గురికాకుండా వుండేందుకు గాను మెగాస్టార్ చిరంజీవి నటించిన అడవి దొంగ పెట్టి వీక్షించమని చెప్పారు. మధ్యమధ్యలో ఆమెతో వైద్యులు, సిబ్బంది మాట కలుపుతూ.. ఆపరేషన్‌ను విజయవంతంగా పూర్తి చేశారు.
అడవి దొంగ వల్లే పేషెంట్ కోమాలోకి పోలేదు:
అనంతరం గాంధీ ఆసుపత్రి వైద్యుల బృందం మాట్లాడుతూ.. ఇక్కడ ఇలాంటి ఆపరేషన్‌ను తొలిసారిగా నిర్వహించినట్లు తెలిపారు. రోగికి ఎంతో ఇష్టమైన అడవి దొంగ సినిమా చూపించడం వల్ల ఆపరేషన్‌కు పూర్తిగా సహకరించడమే కాకుండా.. కోమాలోకి వెళ్లకుండా అడ్డుకోగలిగామని డాక్టర్లు పేర్కొన్నారు. ప్రస్తుతం రోగి పూర్తి ఆరోగ్యంగా వున్నారని .. కోలుకున్న తర్వాత డిశ్చార్జ్ చేస్తామని వారు తెలిపారు. ఈ సంఘటన ద్వారా మెగాస్టార్ చిరంజీవి పట్ల చిన్నారుల నుంచి పెద్దల వరకు వుండే అభిమానం మరోసారి రుజువైంది. ఈ విషయం తెలుసుకున్న మెగా అభిమానులు.. సదరు రోగి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout