చిరంజీవి 'జేబుదొంగ'కి 30 ఏళ్లు
- IndiaGlitz, [Monday,December 25 2017]
స్టీల్ ప్లాంట్ బాబాయ్ అంటూ మెగాస్టార్ చిరంజీవి సందడి చేసిన చిత్రం 'జేబుదొంగ'. కామెడీ టైమింగ్‌లో తనకు తానే సాటి అనిపించుకున్న చిరు.. ఈ సినిమా ప్రథమార్థంలో జేబుదొంగగా తన కామెడీ టైమింగ్‌తో మరోసారి అదరగొట్టారు. అంతేకాకుండా.. చిరుకి తోడుగా మంగళగిరి పిన్ని అంటూ మరో జేబుదొంగ పాత్రలో భానుప్రియ చేసిన సందడి కూడా సినిమాకి కలిసొచ్చింది.
వీరిద్దరి కెమిస్ట్రీ సినిమాకి హైలైట్‌గా నిలిచింది. రాధ మరో హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రానికి చిరుకి అచ్చొచ్చిన డైరెక్టర్స్‌లో ఒకరైన ఎ.కోదండరామిరెడ్డి దర్శకత్వం వహించారు. మాస్ చిత్రాల స్పెషలిస్ట్ చక్రవర్తి సంగీతమందించిన ఈ చిత్రంలోని పాటలు మాస్ ఆడియన్స్‌ని ఉర్రూతలూగించాయి. రోజా మూవీస్ పతాకంపై అర్జున రాజు నిర్మించిన ఈ చిత్రం క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25, 1987న విడుదలైంది.
అంటే.. ఈ సినిమా విడుదలై నేటికి 30 వసంతాలు పూర్తవుతోందన్నమాట. కొసమెరుపు ఏమిటంటే.. ఈ చిత్రంలో చిరంజీవి పాత్ర పేరు చిట్టిబాబు. ఇప్పుడు ఇదే పేరుతో ఆయన తనయుడు ఓ పాత్రని చేస్తున్నారు. ఆ చిత్రమే రంగస్థలం. 30 ఏళ్ల క్రితం చిరుకి వర్కవుట్ అయిన ఆ పేరు.. ఇప్పుడు చరణ్‌కి కూడా వర్కవుట్ అవుతుందని మెగాభిమానులు భావిస్తున్నారు.