గుండె జబ్బుతో బాధపడుతున్న మహిళకు అండగా చిరు
- IndiaGlitz, [Thursday,April 09 2020]
మెగాస్టార్ చిరంజీవి రీల్‌లోనే కాదు.. రియల్‌గా కూడా హీరో అనిపించుకున్న సందర్భాలున్నాయి. ఇందుకు కారణం ఆయనకున్న పెద్ద మనసే. తమకు కష్టం వచ్చింది ఆదుకోండి సార్ అని అడిగితే అభిమాని మొదలుకుని ఎవరైనా సాయం చేయడానికి చిరు ముందుకొస్తుంటారు. ఇలా చాలా మందికి తన బ్లడ్ బ్యాంక్ ద్వారా.. చిరు యూత్ ద్వారా ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయ్.. సాయం చేయడంలో మెగాస్టార్ ముందుంటారు. అయితే తాజాగా.. గుండె జబ్బుతో బాధపడుతున్న గుంటూరు జిల్లాకు చెందిన నాగలక్ష్మి అనే మహిళకు చిరు అండగా నిలిచారు.
పూర్తి వివరాల్లోకెళితే.. గుటూరు జిల్లా ‘చిరంజీవి అంజనా మహిళా సేవా సంస్ధ’ అధ్యక్షురాలు కుమారి రాజనాల వెంకట నాగలక్ష్మి గుండె జబ్బుతో బాధపడుతున్నారు. ఆ విషయాన్ని మెగాస్టార్ చిరు తెలుసుకుని.. ఇది వరకు ఆస్పత్రుల్లో చూపించుకున్న మెడికల్ రిపోర్ట్స్ తెప్పించుకున్నారు. అనంతరం హైదరాబాద్ స్టార్ హాస్పిటల్స్ చైర్మన్ & ఎండీ, ఫేమస్ హార్ట్ సర్జన్ డా. గోపీచంద్ ద్వారా జబ్బు తీవ్రతను అడిగి తెలుసుకున్నారు. వెంటనే హుటాహుటిన నాగలక్ష్మిని హైదరాబాద్‌కి రప్పించే ఏర్పాట్లు చేశారు. అవసరమైన ఆపరేషన్‌కి సంబంధించి అన్ని చర్యలనూ చిరు దగ్గరుండి చూసుకుంటున్నారు. రేపు అనగా శుక్రవారం నాడు ఆమెకి వైద్యులు ఆపరేషన్ చేయనున్నారు.
కాగా.. తనను అమితంగా ప్రేమిస్తున్న అభిమానులు ఆరోగ్యం పట్ల వ్యక్తిగత శ్రద్ధ తీసుకుంటున్న చిరంజీవి మంచి మనసుకి ఫ్యాన్స్, నాగలక్ష్మి కుటుంబీకులు, బంధువులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఇందుకు సంబంధించి ‘అఖిల భారత చిరంజీవి యువత’ అధ్యక్షుడు రవణం స్వామినాయుడు ప్రకటనను మీడియాకు పంపారు.