68 ఏళ్ల వయసులోనూ జిమ్‌లో చెమటలు చిందిస్తున్న మెగాస్టార్

  • IndiaGlitz, [Thursday,February 01 2024]

పద్మవిభూషణ్, మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) వయసు పెరుగుతున్నా కానీ ఆయన ఎనర్జీ మాత్రం తగ్గడం లేదు. ఈ వయసులో కూడా డ్యాన్స్‌లు, ఫైట్స్‌తో అభిమానులను అలరిస్తూనే ఉన్నారు. తాజాగా 'బింబిసార' దర్శకుడు వశిష్ట దర్శత్వంలో ‘విశ్వంభర’ మూవీ చేస్తున్నారు. పాన్ ఇండియా రేంజ్‌లో ఈ మూవీ తెరకెక్కుతోంది. సోషియో ఫాంటసీ బ్యాక్‌డ్రాప్‌లో ఈ మూవీని యువీ క్రియేషన్స్ సంస్థ సుమారు రూ. 200 కోట్ల భారీ బ‌డ్జెట్‌తో నిర్మిస్తుంది. ఆస్కార్ అవార్డు గ్రహీత ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా చిత్రాన్ని థియేటర్లలో విడుదల చేస్తామని మూవీ యూనిట్ ఇప్పటికే ప్రకటించింది. దీంతో ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరగుతోంది. ప్రస్తుతం చిరంజీవి లేని సన్నివేశాలను తీస్తున్నారు. త్వరలోనే చిరు కూడా షూటింగ్‌లో జాయిన్ కానున్నారు. ఇందుకోసం కసరత్తులు మొదలుపెట్టారు. బాడీ మెయింటైన్‌ చేయడం కోసం జిమ్‌లో తెగ కష్టపడుతున్నారు. అన్ని రకాల వర్క్‌వుట్స్ చేస్తూ చెమటోడుస్తున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు అన్నయ్య కమిటెమెంట్‌ను మెచ్చుకుంటున్నారు. 68 ఏళ్ల వయసులో కూడా మెగాస్టార్ స్టామినా ఏమాత్రం తగ్గలేదని కామెంట్స్ చేస్తున్నారు.

ఇటీవల చిరంజీవికి కేంద్ర ప్రభుత్వం దేశంలోనే అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో సినీ, రాజకీయ ప్రముఖుల నుంచి చిరుకి శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. కొంతమంది నేరుగా ఆయనను కలిసి అభినందనలు తెలియజేశారు. అన్నయ్యకు పద్మవిభూషణ్ అవార్డు రావడంపై తమ సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా త్వరలోనే చిరంజీవిని అభినందిస్తూ ఓ సన్మాన సభ టాలీవుడ్ ఇండస్ట్రీ తరపున చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

ఇదిలా ఉంటే గతేడాది రెండు సినిమాలతో అభిమానులను పలకరించాడు. బాబీ దర్శకత్వంలో వచ్చిన 'వాల్తేరు వీరయ్య' మూవీతో బ్లాక్‌బాస్టర్ హిట్ అందుకోగా.. మెహర్ రమేశ్‌ డైరెక్ట్ చేసిన 'భోళాశంకర్' మాత్రం భారీ డిజాస్టర్‌గా నిలిచింది. దీంతో 'విశ్వంభర' మూవీతో మళ్లీ ఇండస్ట్రీ హిట్ కొట్టాలని తీవ్రంగా శ్రమిస్తున్నారు.