పద్మవిభూషణ్ అవార్డు ప్రకటనపై చిరంజీవి భావోద్వేగం

  • IndiaGlitz, [Friday,January 26 2024]

దేశంలోనే రెండో అత్యున్నత పురస్కారం 'పద్మవిభూషణ్‌' తనకు దక్కడంపై మెగాస్టార్ చిరంజీవి ఎమోషనల్ అయ్యారు. అభిమానులకు ధన్యావాదాలు చెబుతూ ఓ వీడియో విడుదల చేశారు ఒక తల్లి కడుపున పుట్టకపోయినా.. నన్ను మీ అన్నయ్యలా, బిడ్డలా భావించే కోట్లాదిమంది ప్రజల ఆశీస్సులు, సినీ కుటుంబం అండదండల వల్లే నేను ఈరోజు ఈ స్థితిలో ఉన్నాను. నాపై చూపిస్తున్న ప్రేమ, ఆప్యాయతలకు ఏమిచ్చినా రుణం తీర్చుకోలేను. 45 సంవత్సరాల సినీ ప్రస్ధానంలో వైవిధ్యమైన పాత్రల ద్వారా వినోదం పంచడానికి నా శక్తి మేరకు ప్రయత్నిస్తూనే ఉన్నాను అని పేర్కొన్నారు.

నిజ జీవితంలో నా చుట్టూ ఉన్న సమాజంలో అవసరమైనపుడు కూడా చేతనైనా సాయం చేస్తున్నాను. నాపై ప్రజలంతా చూపిస్తున్న అభిమానానికి ప్రతిగా నేను ఇచ్చేది గోరంతే అని అదే బాధ్యతగా నన్ను ముందు నడిపిస్తుంది. పద్మవిభూషణ్ వంటి ప్రతిష్టాత్మకమైన అవార్డుకు నన్ను ఎంపిక చేసిన భారత ప్రభుత్వానికి, ప్రధాని నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అంటూ చిరు భావోద్వేగానికి గురయ్యారు.

కాగా గత 45 సంవత్సరాలుగా వెండితెరపై తన నటనతో చిరంజీవి అలరిస్తున్నారు. ఎన్నో వైవిధ్యమైన పాత్రలు చేస్తూ కోట్లాది మంది మనసులు గెలుచుకున్నారు. ఇప్పటి వరకు 154 సినిమాల్లో నటించారు. 2006లోనే భారత ప్రభుత్వం తరపున అప్పటి రాష్ట్రపతి అబ్దుల్ కలామ్ చేతుల మీదుగా ‘పద్మభూషణ్’ అవార్డు అందుకున్నారు. ఇప్పుడు 75వ గణతంత్ర దినోత్సవ వేళ దేశంలోనే రెండో అత్యున్నత పౌర పురస్కారం 'పద్మవిభూషణ్' దక్కించుకున్నారు. దీంతో చిరంజీవికి సినీ, రాజకీయ ప్రముఖులు అభినందనలు తెలియజేస్తున్నారు.