Pawan Kalyan:పీఆర్పీ విలీనం .. పవన్ పొలిటికల్ ఫెయిల్యూర్‌కు సాకు దొరికిందిగా, ఇక్కడా ‘‘అన్న’’ను వాడాల్సిందేనా..?
Send us your feedback to audioarticles@vaarta.com
తన కష్టంతో , ఒక్కో మెట్టు పేర్చుకుంటూ , తను ఎదిగి, తెలుగు సినిమాను అగ్రస్థానంలో నిలబెట్టారు మెగాస్టార్ చిరంజీవి. ఆయన వేసిన బాటలో పుట్టుకొచ్చిన చాలామంది స్టార్స్‌లో పవన్ కల్యాణ్ కూడా ఒకరు . పవర్‌స్టార్‌గా అన్నయ్యను మించిన ఇమేజ్ తెచ్చుకున్నా.. రోజుకు రెండు కోట్లు పారితోషికం తీసుకుంటున్నా.. ఆ అన్నకు తమ్ముడేనంటూ జనం మాట్లాడుకుంటారు. ఇందులో మరో మాటకు తావు లేదు. దీంతో అన్ని విషయాల్లో అన్నదమ్ములిద్దరిని పోల్చి చూడటం సహజం. సినిమాలు, రాజకీయాల్లోనూ ఆ అన్నకు తమ్ముడేనంటూ కొందరు మెచ్చుకుంటుంటే .. ఇంకొందరు విమర్శలు చేస్తున్నారు.
చిరంజీవి కెరీర్‌లో మచ్చలా పీఆర్పీ :
మెగాస్టార్ చిరంజీవి జీవితంలో పొలిటికల్ ఎంట్రీ, ప్రజారాజ్యం పార్టీ పెద్ద ఫెయిల్యూర్‌గా నిలిచింది. మూడు దశాబ్ధాల పాటు సినీ సామాజ్రాన్ని రారాజుగా ఏలిన చిరంజీవి.. తనను ఈస్థాయిలో నిలబెట్టిన ప్రజల కోసం రాజకీయాల్లోకి అడుగుపెట్టి ప్రజారాజ్యం పార్టీని ప్రకటించారు. రాష్ట్రమంతా సుడిగాలి పర్యటన చేసి 2009 ఎన్నికల్లో హేమాహేమీలైన వైఎస్ రాజశేఖర్ రెడ్డి, చంద్రబాబు నాయుడు, కేసీఆర్‌లను ఢీకొట్టారు. అయినప్పటికీ 18 అసెంబ్లీ సీట్లు సాధించి మంచి ఓట్ షేర్ కూడా పొందారు. కానీ అనివార్య కారణాలతో తన పీఆర్పీని కాంగ్రెస్‌లో విలీనం చేశారు. ఆ తర్వాత అనేక తర్జన భర్జనల అనంతరం తిరిగి సినీ పరిశ్రమ వైపు ఫేస్ టర్నింగ్ ఇచ్చారు. ఆపై సినిమాలు చేసుకుంటూ , ఇప్పుడు మనవరాలు పుట్టడంతో జీవితాన్ని ఏంజాయ్ చేస్తున్నారు.
చిరంజీవి వల్లే పవన్‌ను నమ్మడం లేదట:
కానీ కరడుగట్టిన పవన్ ఫ్యాన్స్ మాత్రం .. పవర్‌స్టార్ ముందు మెగాస్టార్ ఎంత అన్నట్లుగా బిహేవ్ చేస్తున్నారు. సేమ్ చిత్ర పరిశ్రమలో మాదిరిగానే.. అన్నయ్య వేసిన బాటలో రాజకీయ రంగ ప్రవేశం చేశారు పవన్ కల్యాణ్. 2014లో జనసేన పార్టీని స్థాపించిన ఆయన.. ఆ ఎన్నికల్లో దూరంగా వుండి టీడీపీ, బీజేపీలకు మద్ధతిచ్చారు. 2019లో కూటమి నుంచి బయటకు వచ్చి పోటీ చేసిన ఆయన కేవలం ఒకే ఒక్క ఎమ్మెల్యే సీటును సంపాదించారు. అంతేకాదు.. పవన్ స్వయంగా రెండు స్థానాల్లోనూ ఓడిపోయారు. అయినప్పటికీ కృంగిపోకుండా పోరాటాన్ని కొనసాగించడం మెచ్చుకోతగ్గదే. కానీ పవన్ కల్యాణ్‌ను జనం అంతగా విశ్వసించడం లేదు. నిలకడలేని తనం, దూకుడు కారణంగా పవన్‌ను నాయకుడిగా గుర్తించలేకపోతున్నారు. దీన్ని జీర్ణించుకోలేని . అంగీకరించలేని పవన్ అభిమానులు, ఇప్పుడు ఏకంగా చిరంజీవిని నిందిస్తున్నారు.
పీఆర్‌పీ విలీనం పేరుతో దెప్పిపొడుపులు :
పవన్ కళ్యాణ్‌ను ప్రజలు నమ్మకపోవడానికి, ఆయనలో సీరియస్ పొలిటీషియన్‌ను చూడకపోవడానికి ఆనాడు చిరంజీవి ప్రజారాజ్యాన్ని కాంగ్రెస్‌లో విలీనం చేయడమే కారణం అని రాయపాటి అరుణ అనే వీర మహిళ చేసిన కామెంట్ ఇప్పుడు వివాదాస్పదం అయింది. అప్పటి చిరంజీవి నిర్ణయంతో ఇప్పుడు తమ అధినేతను ఎవరూ నమ్మడం లేదని ఆమె ఫైర్ అయ్యారు. చిరు పీఆర్పీని విలీనం చేసి హాయిగా సినిమాలు చేసుకుంటూ ఉంటే తాము ఇప్పుడు బాధ పడుతున్నాం అన్నట్లుగా అరుణ చేసిన కామెంట్స్ వివాదానికి తెర లేపాయి.
చిరంజీవిని పల్లెత్తు మాట అనని టీడీపీ, వైసీపీ :
కానీ పవన్ వీరాభిమానులు ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఎవరు ఔనన్నా కాదన్నా చిరంజీవి అనే చెట్టు నీడన ఎదిగాడు పవన్. పీఆర్పీ విషయంలో చిరంజీవిని పవన్ కూడా పదే పదే తప్పుపడుతున్నారు. ఇక ఆయన అభిమానుల సంగతి చెప్పనక్కర్లేదు. చిరంజీవి కొందరి వెన్నుపోటుకు గురై ప్రజారాజ్యాన్ని కాంగ్రెస్‌లో కలిపేశారని పవన్ వాదన. మరి అన్నయ్యకు చేతకాలేదు.. మరి తమ్ముడు ఏం సాధించనట్లు. మొండివైఖరి, దూకుడు మనస్తత్వం , నిలకడలేమి ఇత్యాధి కారణాలతో పవన్‌ను జనం తిరస్కరించారు. టీడీపీ కావొచ్చు, వైసీపీ కావొచ్చు.. ఇతర రాజకీయ పార్టీలేవి పీఆర్పీని కానీ.. చిరంజీవిని కాని ఈ స్థాయిలో విమర్శించలేదు.
ఆవిడ ఏదో ఫ్లో లో అనేసిందన్న నాగబాబు :
నిజానికి ప్రజారాజ్యం పార్టీ 18 అసెంబ్లీ సీట్లు , చెప్పుకోదగ్గ స్థాయిలో ఓటు బ్యాంక్ కూడా సాధించింది. కానీ పవన్ సాధించి ఏమిటీ.. ఒకే ఎమ్మెల్యే (అతను కూడా వైసీపీలోకి జంప్ చేశాడు). చిరంజీవి రెండు చోట్ల పోటీ చేసి ఓ చోట గెలవగా.. పవన్ రెండు చోట్లా ఓడిపోయారు. ఏం చేసినా, ఎలా చూసినా అన్నయ్య సాధించిన దానిలో సగం కూడా తమ్ముడు సాధించలేదన్నది కాదనలేని వాస్తవం. గెలుపోటములు రాజకీయాల్లో సహజం కానీ. అన్నయ్యని పదే పదే విమర్శించడం లేదా తన వారితో తిట్టించి రాజకీయ లబ్ధి పొందాలనుకోవడం పవన్ స్థాయికి తగదు. ఇప్పటికే పవన్ అభిమానులు, మెగా అభిమానులు అనే చీలిక మొదలైంది. అసలు చిరంజీవి అనే వ్యక్తి లేకుంటే పవన్ జూనియర్ ఆర్టిస్ట్ గా కూడా పనికిరాడన్న విషయాన్ని మరిచిన జనసైనికులు ఇప్పుడు పెట్టిన చేతిని కరుస్తున్న కుక్కల మాదిరి తయారయ్యారు. మెగా ఫ్యాన్స్‌కు ఎప్పుడూ అండగా నిలిచే నాగబాబు సైతం ఎటు వైపు మాట్లాడాలో తెలియక.. అరుణ ఏదో ఫ్లోలో అలా అనేసింది అంటూ పవన్, చిరు ఫ్యాన్స్‌ని చల్లబరిచే ప్రయత్నం చేస్తున్నారు. అయితే అప్పటికే జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout