చిరుకి ఫ్రెండ్.. రజనీకి శత్రువు..
- IndiaGlitz, [Friday,March 02 2018]
మెగాస్టార్ చిరంజీవికి ఫ్రెండ్ అంటే.. సూపర్ స్టార్ రజనీకాంత్‌కు కూడా ఫ్రెండ్ కావాలి కదా. అయితే.. ఆ లెక్క ఒకరి విషయంలో తప్పుతోంది. ఇంతకీ ఆ ఒక్కరు ఎవరంటే.. 'పిజ్జా' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచితుడైన విజయ్ సేతుపతి. పిజ్జా తమిళ వెర్షన్‌తో తమిళనాట మంచి క్రేజ్ తెచ్చుకున్న ఈ యువ కథానాయకుడు.. సినిమా సినిమాకి తన స్థాయిని పెంచుకుంటూ ముందుకెళుతున్నాడు. వైవిధ్యమైన చిత్రాలకు చిరునామాలా ఉంటున్నాడు.
అలాంటి విజయ్ సేతుపతి.. ప్రస్తుతం చిరంజీవి కథానాయకుడిగా నటిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం 'సైరా నరసింహారెడ్డి' చిత్రంలో అతనికి సహకారం అందించే స్నేహితుడి తరహా పాత్రలో కనిపించనున్న సంగతి తెలిసిందే. కట్ చేస్తే.. ఇదే విజయ్ సేతుపతి తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమాలో విలన్‌గా నటించనున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. 'పిజ్జా' దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ సూపర్ స్టార్‌తో ఓ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. ఇందులో విలన్‌గా విజయ్ సేతుపతి నటించనున్నాడని కోలీవుడ్ వర్గాలు పేర్కొంటున్నాయి. అంటే చిరుకి ఫ్రెండ్‌గా ఓ సినిమాలో నటిస్తున్న విజయ్ .. మరో సినిమాలో రజనీకి శత్రువులా కనిపించనున్నాడన్నమాట.