లక్షల మంది ప్రాణాలను నిలబెట్టింది.. ఒక్కసారి ఆలోచించండి: చిరు

విశాఖ ఉక్కు కర్మాగారంపై మెగాస్టార్ చిరంజీవి మరోసారి స్పందించారు. గతంలో ఇండస్ట్రీ నుంచి విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను వ్యతిరేకించిన సినీ ప్రముఖుల్లో చిరంజీవి ఒకరు. తాజాగా ఆయన మరోమారు దీనిపై స్పందించారు. దేశమంతా ఆక్సిజన్ దొరక్క పేషెంట్లు అల్లాడుతున్నారని.. ఈ క్రమంలోనే ఒక ప్రత్యేక రైలు విశాఖ ఉక్కు కర్మాగారానికి చేరుకున్నదంటూ ఆయన ట్వీట్ చేశారు. అత్యవసర పరిస్థితుల్లో రాష్ట్రాలకు ఆక్సిజన్‌ను అందించి లక్షల మంది ప్రాణాలను నిలబెట్టిందని అలాంటి విశాఖ ఉక్కు కర్మాగారం నష్టాల్లో ఉందని ప్రైవేటు పరం చేయటం ఎంత వరకు సమంజసమని చిరు ప్రశ్నించారు. ‘ఒక్కసారి ఆలోచించండి(లెట్ అజ్ థింక్)’ పేరుతో చిరు చేసిన ట్వీట్ ఆకట్టుకుంటోంది.

‘‘దేశమంతా ఆక్సిజన్‌ దొరకక కరోనా పేషెంట్స్‌ అల్లాడిపోతున్నారు. గురువారం ఓ ప్రత్యేక రైలు విశాఖపట్నం ఉక్కు కర్మాగారానికి చేరుకుంది. అక్కడి నుంచి 150 టన్నుల ఆక్సిజన్‌ను మహారాష్ట్రకు తీసుకెళ్తుంది. విశాఖ ఉక్కు కర్మాగారం రోజుకి సుమారు 100 టన్నుల ఆక్సిజన్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఇప్పుడున్న అత్యవసర పరిస్థితుల్లో ఎన్నో రాష్ట్రాలకు ఆక్సిజన్‌ అందించి లక్షల మంది ప్రాణాలను నిలబెట్టింది. అలాంటి విశాఖ ఉక్కు కర్మాగారం నష్టాల్లో ఉందని ప్రైవేట్‌ పరం చేయడం ఎంత వరకూ సమంజనం? మీరే ఆలోచించండి’’ అని చిరంజీవి ట్వీట్‌లో పేర్కొన్నారు. ఈ ట్వీట్ నిజంగానే సామాన్యులను సైతం ఆలోచింపజేసేదిలా ఉండటం విశేషం.