కమర్షియల్ తో కూడిన అందమైన ప్రయోగాత్మక చిత్రం కంచె : చిరంజీవి
- IndiaGlitz, [Sunday,October 25 2015]
మెగా బ్రదర్ నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ హీరోగా క్రిష్ తెరకెక్కించిన చిత్రం కంచె. రెండవ ప్రపంచ యుద్ధం నేపథ్యంతో రూపొందిన కంచె సినిమా దసరా రోజు రిలీజై విజయవంతంగా ప్రదర్శింపబడుతోంది. కంచె సినిమా మెగాస్టార్ చిరంజీవిని ఎంతగానో ఆకట్టుకుంది.
ఈ సందర్భంగా చిరంజీవి కంచె సినిమా గురించి మాట్లాడుతూ...కంచె సినిమా చూసాను. నన్ను ఎంతగానో ఆకట్టుకుంది. సినిమా చూసిన తర్వాత అభినందించకుండా ఉండలేకపోయాను. మంచి సినిమా అందించిన క్రిష్ ను మనస్పూర్తిగా అభినందిస్తున్నాను. ఇది కమర్షియల్ తో కూడిన అందమైన ప్రయోగాత్మక చిత్రం. ఇటువంటి చిత్రం వచ్చినప్పుడు అందరం ఆదరించాలి. పల్లెటూరి వాతావరణాన్ని, రెండవ ప్రపంచ యుద్ధం నాటి వాతావరణాన్ని అద్భుతంగా తీసారు. హాలీవుడ్ మూవీ రేంజ్ లో ఈ సినిమాను తీసారు. ఈ సినిమాను 55 రోజుల్లో తీయడం నిజంగా ఆశ్చర్యం. ఇక మా వరుణ్ తేజ్ విషయానికి వస్తే...అప్పటి కాలం కుర్రాడుగా ఆ పాత్రలో ఒదిగిపోయాడు. వాడి నటన చూసి నాకే ఆశ్చర్యంగా అనిపించింది. ఇక డైలాగ్స్ విషయానికి వస్తే...ఆలోచింప చేసే విధంగా అద్భుతమైన సంభాషణలు అందించిన సాయి మాధవ్ బుర్రాను అభినందిస్తున్నాను. సినిమా నిర్మాణం బాగా పెరిగిపోయి...హద్దులు లేకుండా తీస్తున్న ఈరోజుల్లో క్రిష్ 55రోజుల్లో ఈ సినిమా తీయడం ఇండస్ర్టీకి ఒక ఎడ్యుకేషన్ లాంటిది. దర్శకుడి ప్రతిభకి గీటురాయి. ఇది చక్కటి కమర్షియల్ సినిమానే. ప్రయోగాత్మక సినిమా అనుకోకూడదు.ఇలాంటి సినిమాలు మరిన్ని రావాలిని కోరుకుంటున్నాను అన్నారు.
డైరెక్టర్ క్రిష్ మాట్లాడుతూ...ఈ సినిమాలో ప్రతి డైలాగ్ గురించి చిరంజీవి గారు చెబుతుంటే చాలా ఆనందంగా ఉంది. ఈరోజు మా నాన్నగారి పుట్టినరోజు. చిరంజీవి గారు పిలిచారు వెళుతున్నాను అంటే నాన్నగారు నన్ను కౌగిలించుకుని అభినందించారు. ఈరోజు కలిగిన గొప్ప అనుభూతిని ఎప్పటికీ మరచిపోలేను. నా సినిమా ప్రారంభానికి ముందు అమ్మ, నాన్న, దైవం, గురువు, పుస్తకం కి అంకితం అనే వేసాను. ఇక నుంచి తెలుగు ప్రేక్షకులకు నా సినిమా అంకితం అంటాను అన్నారు. ఈ కార్యక్రమంలో నాగబాబు, వరుణ్ తేజ్, రచయిత సాయి మాధవ్ పాల్గొన్నారు.