Chiranjeevi:మాట నిలబెట్టుకున్న చిరంజీవి.. రోజుకు 1000 మందికి క్యాన్సర్ టెస్ట్‌లు, ఏ వూరిలో ఎప్పుడంటే..?

  • IndiaGlitz, [Saturday,June 24 2023]

మెగాస్టార్ చిరంజీవి ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. అభిమానులు, సినీ కార్మికులకు ఉచితంగా క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్టులు చేయిస్తానని ప్రకటించారు. శుక్రవారం హైదరాబాద్‌లో స్టార్ క్యాన్సర్ సెంటర్‌ వైద్యులతో కలిసి ఆయన మీడియా ముందుకు వచ్చారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ.. స్టార్ క్యాన్సర్ సెంటర్, చిరంజీవి ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ క్యాన్సర్ పరీక్షలు నిర్వహిస్తామని ఆయన వెల్లడించారు. క్యాన్సర్‌ను ముందుగా గుర్తిస్తే .. చికిత్స చేయడం సులభమవుతుందని చిరు అన్నారు. జూలై 9న హైదరాబాద్, జూలై 16న విశాఖపట్నం, జూలై 23న కరీంనగర్‌లలో రోజు 1000 మంది చొప్పున వివిధ రకాల క్యాన్సర్లకు పరీక్షలు నిర్వహిస్తామని మెగాస్టార్ వెల్లడించారు.

టెస్ట్‌లు, చికిత్సకయ్యే ఖర్చులో కొంత భరిస్తా :

అభిమానులు, సినీ కార్మికులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని తెలిపారు. ఈ పరీక్షలకే కాకుండా.. చికిత్సకు అయ్యే ఖర్చులోనూ తాను కొంత భరిస్తానని , అది ఎంత అనేది తర్వాత వెల్లడిస్తానని చిరంజీవి స్పష్టం చేశారు. సినీ కార్మికులకు ప్రత్యేక గుర్తింపు కార్డు ఇస్తామని.. దీని ద్వారా వారు భవిష్యత్తులోనూ వైద్య పరీక్షలు చేయించుకోవచ్చని మెగాస్టార్ తెలిపారు. క్యాన్సర్‌పై అవగాహన కల్పించేలా సినీ పరిశ్రమ తరపున షార్ట్ ఫిల్మ్స్‌కు రూపకల్పన చేయనున్నట్లు చిరంజీవి వెల్లడించారు.

క్యాన్సర్ టెస్టుల గురించి ఎప్పుడో చెప్పిన చిరంజీవి :

కొద్దిరోజుల క్రితం హైదరాబాద్ నానక్‌రామ్ గూడలో నూతనంగా నిర్మించిన స్టార్ క్యాన్సర్ ఆసుపత్రిని చిరంజీవి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. క్యాన్సర్‌పై అవగాహనకు తనవంతు సాయం చేస్తానని తెలిపారు. అలాగే తన తోటి కళాకారులు, సినీ కార్మికులు, అభిమానులకు ఎన్ని కోట్లు ఖర్చయినా క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్టులు చేయిస్తానని చిరు పేర్కొన్నారు. ప్రజలెవ్వరూ క్యాన్సర్ బారినపడకూడదన్నదే తన ఉద్దేశమన్నారు. ఎప్పటికప్పుడు హెల్త్ చెకప్‌లు చేయించుకోవాలని సూచించారు.

ఆ అమ్మాయి క్యాన్సర్‌ను జయించింది :

అలాగే ఇటీవల తనను కలిసిన విజయవాడకు చెందిన రేణుక అనే అమ్మాయి కథను కూడా చిరంజీవి పంచుకున్నారు. ఆ అమ్మాయి క్యాన్సర్‌తో బాధపడుతోందని.. చిరంజీవిని చూడాలన్నదే తన చివరి కోరిక అని చెప్పిందని గుర్తుచేశారు. అయితే తాను ఆ అమ్మాయిని కలిసి.. ఇదే నీ చివరి కోరిక కాదమ్మా, మొదటి కోరిక అనుకోవాలని ఆత్మవిశ్వాసం కలిగించానని చిరంజీవి వెల్లడించారు. ఇప్పుడు రేణుక ఆరోగ్యం బాగానే వుందని చెప్పారు. చిరంజీవి వ్యాఖ్యలపై స్పందించిన స్టార్ క్యాన్సర్ సెంటర్ యాజమాన్యం.. ఆయన చెప్పినట్లుగానే చేస్తామన్నారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన మొబైల్ వాహనాలు, డాక్టర్లు అందుబాటులో వున్నారని.. జిల్లాల్లో క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్‌లు చేస్తామని వెల్లడించింది.