మళ్లీ మొదలైన చిరు-బాలయ్య వార్..
- IndiaGlitz, [Friday,April 29 2016]
మెగాస్టార్ చిరంజీవి 150వ చిత్రం ఈరోజు ప్రారంభమైంది. ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని వి.వి.వినాయక్ దర్శకత్వంలో కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ పై రామ్ చరణ్ నిర్మిస్తున్నారు. తమిళ్ లో సంచలన విజయం సాధించిన కత్తి చిత్రానికి రీమేక్ గా ఈ సినిమాని రూపొందిస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి పై చిత్రీకరించిన ముహుర్తపు సన్నివేశానికి రచయిత పరుచూరి వెంకటేశ్వరరావు క్లాప్ ఇవ్వగా, అల్లు అరవింద్ స్విఛ్చాన్ చేసారు. మెగా బ్రదర్ నాగబాబు గౌరవ దర్శకత్వం వహించారు. జూన్ నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించే ఈ భారీ ప్రతిష్టాత్మక చిత్రాన్ని సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.
బాలయ్య నటిస్తున్న 100వ చిత్రం గౌతమిపుత్ర శాతకర్ణి. ఈ చిత్రాన్ని క్రిష్ తెరకెక్కిస్తున్నారు. ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై వై.రాజీవ్ రెడ్డి, జాగర్లమూడి సాయిబాబు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటీవల తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.సి.ఆర్ సమక్షంలో గౌతమిపుత్ర శాతకర్ణి ప్రారంభమైన విషయం తెలిసిందే. బాలకృష్ణ పై చిత్రీకరించిన ముహుర్తపు సన్నివేశానికి సి.ఎం కె.సి.ఆర్ క్లాప్ ఇవ్వగా..మెగాస్టార్ చిరంజీవి స్విఛాన్ చేసారు. విక్టరీ వెంకటేష్ కెమెరా ఆపరేట్ చేయగా దర్శకరత్న దాసరి తొలి సన్నివేశానికి గౌరవ దర్శకత్వం వహించారు. మే నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించే ఈ భారీ చిత్రాన్ని కూడా సంక్రాంతి కానుకగా జనవరి 12 రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం.
ఒక్కసారి ఫ్లాష్ బ్యాక్ లోకి వెళితే.... చిరంజీవి నటించిన మృగరాజు 2001లో జనవరి 11న రిలీజైంది. ఈ చిత్రానికి గుణ శేఖర్ దర్శకత్వం వహించారు. మణిశర్మ సంగీతం అందించారు. బాలకృష్ణ నటించిన నరసింహ నాయుడు చిత్రం కూడా 2001లో జనవరి 11న రిలీజైంది. ఈ చిత్రానికి బి.గోపాల్ దర్శకత్వం వహించారు. మణిశర్మ సంగీతం అందించారు. ఇప్పుడు చిరంజీవి 150 వ చిత్రం, బాలకృష్ణ 100వ చిత్రం కూడా సంక్రాంతికి పోటీపడే అవకాశం ఉంది. గతంలో సంక్రాంతికి పోటీపడిన మృగరాజు - నరసింహనాయుడు ఈ రెండు చిత్రాలకు మణిశర్మ సంగీతం అందించారు. ఇప్పుడు మళ్లీ సంక్రాంతికి పోటీపడుతున్న చిరు 150 - బాలయ్య 100 ఈ రెండు చిత్రాలకు దేవిశ్రీప్రసాదే సంగీత అందిస్తుండడం విశేషం. మెగాస్టార్ రీ ఎంట్రీ తో మళ్లీ చిరు - బాలయ్య వార్ స్టార్ట్ అయ్యింది. మరి...ఈ వార్ లో విన్నర్ ఎవరో తెలియాలంటే సంక్రాంతి వరకు ఆగాల్సిందే.