దాస‌రి గురించి చిరు, మోహ‌న్‌బాబు ఏమ‌న్నారంటే..?

ఈరోజు ద‌ర్శ‌క‌ర‌త్న డా.దాస‌రి నారాయ‌ణ‌రావు 73వ జ‌యంతి. ఈ రోజు తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మంతా క‌లిసి డైరెక్ట‌ర్స్ డే కూడా ప్ర‌క‌టించుకున్నారు. ఈరోజు ఉద‌యం ఫిలించాంబ‌ర్‌లో ఆయ‌న విగ్ర‌హానికి పూల‌మాల వేసి ఆయ‌న త‌న‌యుడు దాసరి అరుణ్ కుమార్‌, సి.క‌ల్యాణ్ స‌హా ప‌లువురు నివాళులు అర్పించారు. మెగాస్టార్ చిరంజీవి, క‌లెక్ష‌న్ కింగ్ మోహ‌న్‌బాబు దాస‌రికి సోష‌ల్ మీడియా ద్వారా నివాళులు అర్పించారు. మెగాస్టార్ చిరు స్పందిస్తూ ‘‘దా..దానంలో కర్ణుడు మీరు. స.. సమర్ధతలో అర్జునుడు మీరు. రి..రిపు వర్గమే లేని ధర్మరాజు మీరు. మీరు మా మధ్య లేకపోయినా మీ స్ఫూర్తి ఎప్పుడూ సజీవంగానే ఉంటుంది. ప్రతి దర్శకుడి జీవితానికి మార్గదర్శకమవుతుంది. ఈ ఫొటో గురువుగారితో నా చివరి జ్ఞాప‌కం మిస్ యు స‌ర్‌’’ అని ట్వీట్ చేశారు.

మంచు మోహన్‌బాబు స్పందిస్తూ ‘‘నాకు తల్లిదండ్రులు పెట్టిన పేరు భక్తవత్సలం. నటుడిగా నాకు జన్మను ప్రసాదించారు గురువుగారు దాసరి నారాయణరావుగారు. ఒక విలన్‌గా, కమెడియ‌న్‌గా, క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌గా, హీరోగా అన్నీ ర‌కాల పాత్ర‌లు నాకు ఇచ్చిన‌న్ను ఇంత‌టి వ్య‌క్తిని చేసిన ఆ మ‌హానీయుడు. తండ్రి లాంటి తండ్రి దాసరి నారాయణరావు గారి పుట్టిన రోజు మే 4న అంటే ఈరోజు. ఆయన ఏ లోకంలో ఉన్నా ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, గురువుగారి ఆశీస్సులు మా కుటుంబానికి ఉంటాయని నేను కోరుకుంటున్నాను’’ అన్నారు.