సినీరంగంలో ఆయనో మహారథి : నారాయణ్ దాస్ నారంగ్ మరణంపై చిరు, మహేశ్ సంతాపం

ప్రముఖ నిర్మాత, తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు, ఏషియన్‌ మల్టీప్లెక్స్‌, థియేటర్స్‌ అధినేత నారాయణదాస్‌ నారంగ్‌ (78) కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఆయన మరణంతో టాలీవుడ్‌లో విషాదం చోటు చేసుకుంది. నారాయణ్ దాస్ మరణంపట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు.

‘‘ప్రదర్శనారంగంలో నిష్ణాతుడు, మాట మీద నిలబడే నిఖార్సైన మనిషి,నిబద్ధత కలిగిన వ్యక్తి,అపార అనుభవజ్ఞుడు, సినీరంగంలో ఒక మహారథి, ఫిలిం ఛాంబర్ అఫ్ కామర్స్ అధ్యక్షులు శ్రీ నారాయణదాస్ నారంగ్ గారికి శ్రద్ధాంజలి’’ అంటూ మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ చేశారు.

‘‘ నారాయణదాస్ నారంగ్ మరణంతో దిగ్భ్రాంతి , విచారం. చిత్ర పరిశ్రమలో ఒక గొప్ప వ్యక్తి.. ఆయన లేని లోటును భర్తీ చేయలేం. నారాయణ్ దాస్‌తో కలిసి పనిచేయడం తనకు దక్కిన గౌరవం’’ అని సూపర్‌స్టార్ మహేశ్ బాబు తన సంతాప సందేశంలో తెలిపారు.

గత కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న నారాయణ్ దాస్ నారంగ్ ఇటీవల హైదరాబాద్ స్టార్‌ ఆస్పత్రిలో చేరారు. అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం 9.04 నిమిషాలకు తుదిశ్వాస విడిచారు. 1946 జులై 27న జ‌న్మించిన. ఆయ‌న‌కు ఇద్ద‌రు కుమారులు, ఒక కుమార్తె వున్నారు. నారంగ్ కుమారులు సునీల్ నారంగ్‌, భ‌ర‌త్ నారంగ్ కూడా నిర్మాత‌లే కావడం విశేషం. మంగళవారం సాయంత్రం 4 గంట‌ల‌కు హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లోని మ‌హాప్ర‌స్తానంలో నారాయణ్ దాస్ అంత్య‌క్రియ‌లు జ‌రుగుతాయని కుటుంబ‌స‌భ్యులు వెల్లడించారు.