చిరు, జేపీని తొక్కేశారు.. నేను భయపడను!
- IndiaGlitz, [Monday,February 25 2019]
ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు దగ్గరపడుతుండటంతో జనసేన అధినేత పవన్ కల్యాణ్ జిల్లాల బాట పట్టి ప్రజలకు దగ్గరవుతున్నారు. ఇప్పటికే కోస్తాంధ్రలో పర్యటన ముగించిన పవన్.. ప్రస్తుతం రాయలసీమ బాటపట్టారు. కర్నూలు పర్యటనలో పవన్ బిజీబిజీగా గడుపుతున్నారు. రెండో రోజు పర్యటనలో భాగంగా కర్నూలు యు.బి.ఆర్ కన్వెన్షన్ హాల్లో విద్యార్ధులతో ఇష్టాగోష్టిలో పాల్గొన్నారు. వివిధ కళాశాలల నుంచి వచ్చిన విద్యార్ధులు చెప్పిన సమస్యలన్నింటినీ పవన్ విన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. జనసేన పార్టీ ప్రభుత్వాన్ని స్థాపిస్తే కర్నూలు నగరానికి పూర్వ వైభవం తీసుకువస్తామన్నారు. రాజధాని అమరావతిని మించిన నగరంగా నిర్మిస్తామని ఆయన హామీ ఇచ్చారు. పేరుకి అమరావతి రాజధాని అయినా, నా మనసుకి మాత్రం కర్నూలు నగరమే రాజధాని అన్నారు. రాయలసీమకి ఎవరు ఎంత చేశారో తెలియదు కానీ.. నేను మాత్రం బాధ్యతతో పని చేసి.. ఈ సీమలోని ప్రతి చెట్టు, పుట్ట, గట్టుని కాపాడుతానని చెప్పారు.
చిరు, జేపీని తొక్కేశారు...
విలువలతో కూడిన రాజకీయాలు చేద్దామని వస్తే జేపీ గారిని తొక్కేశారు. చిరంజీవి గారిని తొక్కేశారు. మరి మీరు నిలబడగలరా? అని కొందరు అంటున్నారు. నేను ఎవరో అండగా ఉంటారని రాజకీయాల్లోకి రాలేదు. ఇష్టంతో వచ్చా. దేశం మీద ప్రేమతో వచ్చా. ఎవరు అండగా నిలబడినా నిలబడకున్నా నా పని నేను చూసుకుంటూ వెళ్లిపోతా.. సలహాలు ఇస్తూ మాత్రం కూర్చోను. నేను ఎవర్నీ నమ్మించడానికి ప్రయత్నం చేయను. నా గ్రామానికి బాట కోసం ఒంటరిగా కొండని పగులగొట్టిన మాంజీ లాంటి వాడిని నేను. పేరు, డబ్బు కోసం రాజకీయాల్లోకి రాలేదు. అందుకే ఎవరి గురించి మాట్లాడేందుకయినా నేను భయపడను అని ఈ సందర్బంగా పవన్ చెప్పుకొచ్చారు. పవన్ వ్యాఖ్యలతో ఒక్కసారిగా విద్యార్థులంతా ఈలలు కేకలతో హోరెత్తించారు. దీంతో కన్వెన్షన్ హాల్లో పండుగ వాతావరణం నెలకొంది.
టీజీ నాకు పరిచయస్తులే.. నేను మాట్లాడతా..!
టీజీ వెంకటేష్ నాకు వ్యక్తిగతంగా పరిచయస్తులే. అయితే తప్పు చేస్తే మాత్రం ఎవర్నీ వదిలిపెట్టను. తుంగభద్ర జలాలని ఆయన పాడుచేస్తుంటే మాట్లాడతా. మీ బిడ్డలకి వేల కోట్లు సంపాదించి ఇచ్చినా తాగేందుకు మంచినీరు ఇవ్వలేరన్న విషయాన్ని వారికి వివరిస్తా. ముఠా కక్షలు, ఫ్యాక్షనిజం మీద చాలా కోపం ఉంది. వేల కోట్లు, కిరాయి మూకలు ఉన్నా, ప్రయివేటు సైన్యం ఉన్నా అన్నింటికీ తెగించి వచ్చా.. ఎవరి జీవితాలు రిస్క్‌లో పెట్టను.. నేనొక్కడినే పోరాడుతా.. మిమ్మల్ని రచ్చబండలకి తీసుకెళ్లను. మేం పని చేస్తాం మీరు చదువుకునే పరిస్థితులు కల్పిస్తాం. డబ్బు సంపాదించుకునే పరిస్థితులు కల్పిస్తాం. డబ్బు కట్టనవసరం లేని వ్యవస్థ తెస్తాం.. జ్ఞానం, మేధస్సు ఉన్న వారిని ప్రభుత్వం ముందుకి తీసుకువెళ్లాలి. ప్రభుత్వం చదువుకునే అవకాశం కల్పించాలి అని పవన్ కల్యాణ్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా పవన్ దృష్టికి పలు సమస్యలు వచ్చాయి.