ఓటు వేసిన చిరంజీవి, అల్లు అర్జున్, ఎన్టీఆర్
- IndiaGlitz, [Thursday,November 30 2023]
తెలంగాణలో ఓట్ల జాతర మొదలైంది. ఉదయం 7 గంటల నుంచే ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు బారులు తీరారు. సామాన్యులతో పాటు సినీ, రాజకీయ ప్రముఖులు క్యూ లైన్‌లో నిలబడి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. కొందరు ప్రముఖులు ఇప్పటికే ఓటు హక్కు వినియోగించుకున్నారు. వీరిలో మెగాస్టార్ చిరంజీవి, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, వెంకటేశ్, సుమంత్, సంగీత దర్శకుడు కీరవాణి తదితరులు తమ పోలింగ్ కేంద్రాల్లో ఓటు వేశారు.
హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ క్లబ్‌లో చిరంజీవి, ఆయన సతీమణి సురేఖ, కూతరు శ్రీజ ఓటు వేశారు. జూబ్లీహిల్స్‌లోని ఓబుల్ రెడ్డి పబ్లిక్ స్కూలులో కుటుంబ సభ్యులతో కలిసి జూనియర్ ఎన్టీఆర్ ఓటు వినియోగించుకున్నారు. సామాన్యులతో క్యూలో నిలబడి మరీ ఓటు వేసిన ఎన్టీఆర్..ప్రతి ఒక్క ఓటరూ తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు.
అలాగే జూబ్లీహిల్స్‌లోని బీఎస్‌ఎన్‌ఎల్ పోలింగ్ బూత్‌లో ఓటు హక్కు వినియోగించుకున్నారు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. ఉదయం 7గంటలకే క్యూలో నిలబడి పోలింగ్ కేంద్రానికి రాగా… ఈవీఎం మొరాయించింది. కాసేపు వెయిట్ చేసిన అనంతరం ఓటు వేశారు బన్నీ. షేక్ పేట ఇంటర్నేషనల్ స్కూల్‌లో వెంకటేశ్, రాజమౌళి దంపతులు.. ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి జూబ్లీ హిల్స్ పబ్లిక్ స్కూల్‌లో తమ ఓటు హక్కును వినియోగించారు.
అనంతరం వీరందరూ మీడియాతో మాట్లాడుతూ ప్రజాస్వామ్య పరిరక్షణకు ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు.