32 ఏళ్లు పూర్తిచేసుకున్న చిరంజీవి 'అడవిదొంగ'
- IndiaGlitz, [Tuesday,September 19 2017]
మహానటుడు ఎన్టీఆర్‌ని తొలి సారిగా డైరెక్ట్ చేస్తూ 'అడవి రాముడు'ని తెరకెక్కించారు దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు. ఆ సినిమా బ్లాక్‌బస్టర్ అయ్యింది. అదేవిధంగా కథానాయకుడిగా మెగాస్టార్ చిరంజీవిని తొలిసారి డైరెక్ట్ చేస్తూ 'అడవి దొంగ' రూపొందించారాయన. రిజల్ట్.. మరో బ్లాక్‌బస్టర్. అంటే.. రెండు తరాల నెం.1 హీరోలను 'అడవి'తో ముడిపెట్టి సినిమా తీస్తే.. దర్శకేంద్రుడు కి బ్లాక్‌బస్టర్ విజయాలు దక్కాయన్నమాట.
ఇక, 'అడవి దొంగ' విషయంలోకి వస్తే.. చిరంజీవి ఇదివరకు కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో మోసగాడు (శోభన్ బాబు కథానాయకుడు), తిరుగులేని మనిషి (ఎన్టీఆర్ హీరో) చిత్రాల్లో నటించారు. అయితే అవి నెగటివ్ టచ్ ఉన్న పాత్రలు. కథానాయకుడిగా దర్శకేంద్రుడి డైరెక్షన్‌లో చేసిన తొలి సినిమా మాత్రం 'అడవి దొంగ'నే.
ఈ చిత్రం ఫస్టాఫ్ మొత్తం టార్జాన్‌గానే కనిపించి మెప్పించాడు చిరంజీవి. ఇక సెకండాఫ్ మొత్తం ప్రతీకారం నేపథ్యంలో వినోదాత్మకంగా సాగుతుంది. రాధ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాకి చక్రవర్తి అందించిన సంగీతం ఓ ఎస్సెట్‌గా నిలిచింది. 'వీర విక్రమ ధీర దిగ్గజా నీకే స్వాగతాలు' పాటలో పలు గెటప్స్‌లో చిరు కనిపించే విధానం అభిమానుల్ని అలరించింది. 1985లో ఇదే తేదిన విడుదలైన 'అడవిదొంగ'.. ఇవాళ్టికి 32 సంవత్సరాలు పూర్తిచేసుకుంటోంది.