'క‌రోనా' లేని భార‌తావనిని సాధిద్దాం: చిరంజీవి

మహమ్మారి కరోనా అంతకంతకూ వ్యాప్తి చెందుతుండడంతో అప్రమత్తం కావాల్సిన అవసరం ఉందని ప్రధాని మోదీ దేశ ప్రజలను సున్నితంగా హెచ్చరించిన సంగతి తెలిసిందే. రేపు అనగా ఆదివారం దేశ వ్యాప్తంగా జనతా కర్వ్యూ ఉంటుందని.. ఉదయం 7గం నుంచి రాత్రి 9గం వరకూ ఎవరు కుడా బయటకి రాకూడదని సూచించిన విషయం విదితమే. కరోనా వైరస్ మొదటి ప్రపంచం యుద్ధాన్ని గుర్తు తెస్తోందని.. అంతకంటే ఇది ప్రమాదమని హెచ్చరించారు. ఈ మేరకు మోదీ సూచనలు పాటిద్దామని.. సినీ ఇండస్ట్రీకి చెందిన నటీనటులు సోషల్ మీడియా ద్వారా తమ అభిమానులు, దేశ ప్రజలకు సూచిస్తున్నారు. ఇప్పటికే పలువురు ప్రముఖ నటీనటులు స్పందించగా.. తాజాగా టాలీవుడ్ మోగాస్టార్ చిరంజీవి వీడియో రూపంలో స్పందించారు. ఇప్పటికే కరోనా జాగ్రత్తలపై స్పందించిన మెగాస్టార్ తాజాగా మరో వీడియోను విడుదల చేశారు.

క‌రోనా లేని భార‌తావనిని సాధిద్దాం!

‘రేపు జనతా కర్ఫ్యూను ప్రజలందరూ పాటించాలి. క‌రోనా వ్యాప్తిని అరికట్టడానికి 24 గంట‌లు ప‌నిచేస్తున్న వైద్యులు, న‌ర్సులు, ఇత‌ర బృందాలు, పారిశుద్ధ్య కార్మికుల‌ు, పోలీసు శాఖ‌, వివిధ విభాగాల ప్రభుత్వ అధికారుల‌ను ప్రశంసించాల్సిన స‌మ‌య‌మిది. ప్రధాని మోదీ పిలుపు మేరకు ఆదివారం ఉద‌యం 7 గంట‌ల నుంచి రాత్రి 9 గంట‌ల వ‌ర‌కు స్వచ్ఛందంగా జ‌న‌తా క‌ర్ఫ్యూని పాటిద్దాం. రేపు ఇళ్లకే ప‌రిమిత‌మ‌వుదాం. రేపు సాయంత్రం 5 గంట‌ల‌కు ప్రతి ఒక్కరూ వారి వారి ఇంటి గుమ్మాల్లోకి వ‌చ్చి సేవలందిస్తున్న వారికి చప్పట్లతో ధ‌న్యవాదాలు తెల‌పాల్సిన స‌మ‌య‌మిది. అది మ‌న ధ‌ర్మం.. భార‌తీయులుగా మ‌నం అందరం ఐక‌మ‌త్యంతో ఒక‌టిగా నిల‌బ‌డ‌దాం. క‌రోనా లేని భార‌తావనిని సాధిద్దాం’ అని మెగాస్టార్ పిలుపునిచ్చారు.