పవన్‌కు చిన్నికృష్ణ వార్నింగ్.. నేను నోరు తెరిస్తే..!
- IndiaGlitz, [Sunday,March 24 2019]
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచారంలో తెలంగాణలో ఆంధ్రోళ్లను కొడుతున్నారు.. తెలంగాణ ఏమైనా పాకిస్థానా..? అని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. అయితే ఈ వ్యాఖ్యలపై ఇప్పటికే రాజకీయ ప్రముఖులు, నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తున్నారు. అయితే తాజాగా ఈ వ్యవహారంపై ప్రముఖ సినీ రచయిత చిన్నికృష్ణ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్ చేసిన వ్యాఖ్యలపై ఆయన ఆదివారం నాడు ప్రెస్‌మీట్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పవన్‌తో పాటు మెగాస్టార్ చిరంజీవిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
మేం హ్యాపీగా ఉన్నాం..
మీ రాజకీయ లబ్ధి కోసం రెండు తెలుగు రాష్ట్రాల మధ్య చిచ్చు పెట్టొద్దు. రాష్ట్రం విడిపోయేప్పుడు కేసీఆర్ ఏదైతే హామీ ఇచ్చారో అదే చేస్తున్నారు. తెలంగాణాలో ఏపీ ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేదు. నేను, నా కుటుంబం, నా పిల్లలు తెలంగాణలో సంతోషంగా ఉన్నాం. నా కూతురును కూడా తెలంగాణకు చెందిన ఉన్నతమైన కుటుంబానికి ఇచ్చాను. మేం అంతా ఇప్పుడు ఎంతో సంతోషంగా ఉన్నాం. అంత మిక్స్ అయిపోయాం. 70 సంవత్సరాలుగా ఇక్కడ ఆంధ్రావాళ్లు, కేరళ వాళ్లు, ఇతర రాష్ట్రాల ప్రజలు వచ్చి హైదరాబాద్‌లో సెటిల్ అయిన హ్యాపీగా బతుకుతున్నారు. అందరూ ఎంతో సంతోషంగా ఇక్కడ బతుకుతున్నారు. ఇప్పుడు మీవల్ల ఆంధ్రప్రదేశ్ అంటేనే ఇబ్బందిగా ఫీల్ అవుతున్నాం. మీ వల్లనే ఇది అని పవన్ చేసిన వ్యాఖ్యలపై ఘాటు విమర్శలు గుప్పించారు.
మా పరిస్థితేంటి.. చిచ్చుపెట్టకు పవన్!
రెండు రాష్ట్రాల మధ్య చిచ్చు పెట్టె విధంగా పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు ఉన్నాయి. పవన్ వ్యాఖ్యలతో మా మీద దాడులు జరిగితే మా పరిస్థితులు ఏంటి? మీరు చేస్తున్న రెచ్చగొట్టే వ్యాఖ్యల వల్ల ఇక్కడి వ్యవస్థ మమ్మల్ని పట్టించుకోకపోతే నువ్వొచ్చి కాపాడతావా.? లేక మీ అన్నలు నాగబాబు, చిరంజీవిలు వచ్చి కాపాడతారా.? మా జీవితాలతో ఆడుకునే వ్యాఖ్యలు చేయోద్దు. రాజకీయ స్వలాభం కోసం ప్రజలు మధ్య విద్వేశాలు పవన్ మానుకోవాలి. ఎగువ రాష్ట్రలకు దిగువ రాష్ట్రాలు తలోగ్గి ఉండాలి. చంద్రబాబుతో పవన్ చేతులు కలిపాడు. అని చిన్నికృష్ణ హితవు పలికారు.
ఇండస్ట్రీకి మీ ఫ్యామిలీ చేసిందేంటి..?
మెగా ఫ్యామిలీ మొత్తం సినిమా పరిశ్రమకు ఏం చేసిందీ లేదు. ఇప్పుడు కాపు వర్గాన్ని అడ్డుపెట్టుకుని ఏదో చేయాలని చూస్తున్నారు. నేను కూడా కాపు కులస్తుడినే. ఎన్నికల తర్వాత నేను అసలు విషయాలను బయట పెడతాను. నేను నోరు తెరిస్తే మీ నవరంధ్రాలు మూసుకుంటారు. కాపుల సొమ్ముతో ఎదిగిన మీ కుటుంబం వారికి తిరిగి ఏం చేసింది..? సినీ రంగం నుంచి ఇంత పొందిన మెగా ఫ్యామిలీ సినీరంగం కోసం ఒక్క కార్యక్రమమైనా చేసిందా? అని మెగా ఫ్యామిలీకి సూపర్ హిట్ కథలను అందించిన చిన్నికృష్ణ వ్యాఖ్యానించడం గమనార్హం. కాగా ఈయన వ్యాఖ్యలకు మెగా ఫ్యామిలీ ఎలా స్పందిస్తుందో.. ముఖ్యంగా పవన్, నాగబాబు ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సిందే మరి.