సమ్మక్క- సారక్కలపై వ్యాఖ్యలు ... స్పందించిన చిన్నజీయర్
- IndiaGlitz, [Friday,March 18 2022]
ఆదివాసి దేవతలైన సమ్కక్క- సారక్కలను కించపరిచేలా వ్యాఖ్యలు చేశారంటూ జరుగుతున్న ప్రచారంపై చినజీయర్ స్వామి స్పందించారు. ఆదివాసీ ప్రజలకు, ముఖ్యంగా మహిళలకు అగ్రాసనం ఉండాలనే సంప్రదాయం నుంచి తాము వచ్చామని ఆయన చెప్పారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఆదివాసీ ప్రజలను చిన్నచూపు చూసేలా మాట్లాడే అలవాటు తమకు లేదని చినజీయర్ స్వామి పేర్కొన్నారు. ఇవాళ లక్ష్మీదేవి పుట్టినరోజని.. పాలసముద్రంలో పుట్టి భగవంతుడి దగ్గరకు చేరిన రోజని ఆయన గుర్తుచేశారు. ఇవాళ అంతర్జాతీయ వైదిక మహిళా దినోత్సవం అని చిన్న జీయర్ అన్నారు.
మన సంస్కృతిలో మొదట చెప్పేది.. మాతృదేవోభవ అనే . జ్ఞానం చూసి ఆరాధించాలని రామానుజాచార్యులు చెప్పారని... జ్ఞానం చూసి దళితులకూ ఆరాధ్య స్థానం కల్పించారని చిన్నజీయర్ తెలిపారు. లోకానికి ఉపకరించే జ్ఞానం, భక్తి ఉన్నవారందరూ ఆరాధనీయులేనని ఆయన పేర్కొన్నారు. రామానుజల కాలంలోనే తిరుప్పాణ్ అనే హరిజనుడి బోధనల వల్ల ఎంతో మంది ప్రేరణ పొందారని చిన్నజీయర్ స్వామి గుర్తుచేశారు. ఆదివాసీలు, హరిజనులు అన్న తేడా లేకుండా బడుగు వర్గాలు సామాజిక ప్రగతిలో భాగస్వాములు కావాలని ఆశించిన ఆచార్యుడు రామానుజాచార్యులన్నారు. ఒకప్పుడు సమాజంలో మహిళలకు మంత్రం అందకూడదని చెప్పేవారని.. కానీ రామానుజ పరంపరలో మహిళలు కూడా మంత్ర పఠనానికి అర్హులే అని వాళ్లకు రామానుజులు సమానతను కల్పించారని చిన్నజీయర్ గుర్తుచేశారు.
ఒకరిని లేదా, కొంతమంది దేవతలను చిన్న చూపు చూసేలా మాట్లాడానని అనుకోవడం పొరపాటన్నారు. ఎప్పుడైనా, ఎక్కడైనా ఏదైనా మాట విన్నప్పుడు, ఒక నిర్ణయం చేసేటప్పుడు దానికి పూర్వాపరాలు చూడటం చాలా అవసరమని చిన్నజీయర్ వ్యాఖ్యానించారు. అది లేకుండా మధ్యలో కొంత భాగాన్ని తీసుకుని.. ‘ఈ వ్యక్తి ఇలా అన్నాడు’ అని అనడం హాస్యాస్పదంగా ఉంటుందన్నారు. చెట్టు, గుట్ట అన్నీ పూజనీయమైనవేనని.. మన సంప్రదాయం చాలా గొప్పదని చిన్నజీయర్ పేర్కొన్నారు. ప్రకృతిని.. ప్రాణకోటిని గౌరవించడం మన బాధ్యతని.. 20 ఏళ్లకు పూర్వం మాట్లాడిన దాన్ని కట్ చేసి వేశారని చిన్నజీయర్ ఆరోపించారు.
మాకూ అందరూ సమానమేనన్న ఆయన.. తమ పేరు మీద బ్యాంక్ అకౌంట్ ఉండదన్నారు. రాజకీయాల్లోకి వెళ్లాలనే కోరిక ఉండదు.. రాదని పేర్కొన్నారు. సంప్రదాయ దీక్ష తీసుకోవాలని భావించే వాళ్లు మాంసాహారం తీసుకోవద్దని సూచించామన్నారు. సామాన్యుల గురించి మేం మాట్లాడలేదని.. మాకు ఎవ్వరితోనూ గ్యాప్ లేదని ఆయన పేర్కొన్నారు. ఎవ్వరికీ భయపడే ప్రసక్తే లేదని.. తాము సమాజానికి కళ్లలాంటి వాళ్లమని చెప్పారు. మేం సమాజంలో జరుగుతున్న తప్పులను చెబుతూ హెచ్చరించడం మా బాధ్యతని పేర్కొన్నారు. ఎవరైనా సలహా అడిగితే చెబుదామని.. బాధ్యత తీసుకుంటే దాన్ని 100 శాతం నెరవేరుస్తామని చిన్నజీయర్ తెలిపారు.
ఆదివాసుల సంక్షేమం కోసం వికాస తరంగిణి ద్వారా అనేక సేవలు అందించామన్నారు. ప్రజలను ప్రభావితం చేసేటువంటి దేవతలను చిన్నచూపు చూసే పద్ధతిని ఎట్టిపరిస్థితుల్లో ప్రోత్సహించమని పేర్కొన్నారు. ఆ పేరుతో అరాచకాలను సృష్టించే వాళ్లను అరికట్టాల్సిన అవసరం ఉందని చిన్నజీయర్ అన్నారు. పనికట్టుకొని పెద్ద వివాదాన్ని సృష్టిస్తున్నారని... నిజంగా సామాజిక హితం కోరే వ్యక్తులైతే వచ్చి మాట్లాడాలని ఆయన హితవు పలికారు.