Chinna Babu Review
తెలుగు, తమిళ సినిమాల్లో తమదైన మార్కెట్‌ను క్రియేట్ చేసుకుంటున్న హీరోల్లో సూర్య, అతని తమ్ముడు కార్తి ముందంజలో ఉంటున్నారు. వారి సినిమాలను ఇద్దరూ తమిళంలో ఎలా ప్రమోషన్స్ చేసుకుంటున్నారో.. తెలుగులో కూడా అలాగే ప్రమోషన్స్ చేసుకుంటూ వస్తున్నారు. అయితే ఈ మధ్య వారి సినిమాలు వారు ఆశించిన మేర సక్సెస్ కావడం లేదు. అయినా కూడా వారు ప్రయత్నాలు మాత్రం మానడం లేదు. రైతు, కుటుంబం, విలువలు అంటూ హీరో కార్తి చేసిన చిత్రం చినబాబు. నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ పాండిరాజ్ దర్శకత్వంలో సినిమా రూపొందింది. పల్లెటూర్లు, కుటుంబాలు అంటే ఎలా ఉంటాయనే సంగతి మనకు ఓ ఆలోచన ఉంది. అయితే పాండిరాజ్ ఈ చిత్రం ద్వారా ఎలాంటి ఎమోషన్స్‌ను తెరపై చూపెట్టాడో తెలియాలంటే సినిమా కథేంటో చూద్దాం...
కథ:
రుద్రరాజు(సత్యరాజ్)కి ఐదుగురు ఆడపిల్లలు తర్వాత పుట్టిన కొడుకే కృష్ణంరాజు(కార్తి). ఐదుగురు అక్కల ముద్దుల తమ్ముడిగా గారాబంగా పెరిగిన కృష్ణంరాజుకి అక్కలంటే ప్రాణం. ఇంట్లో అందరూ కృష్ణంరాజుని చినబాబు అంటుంటాడు. చినబాబు అక్కలు, బావలు ఆనందంగా ఉండాలని తాపత్రయ పడుతుంటాడు. ఏ ఫంక్షన్ జరిగినా వారికి ఘనంగా లాంఛనాలు చేస్తుంటాడు. ఐదుగురు అక్కల్లో ఇద్దరికీ కూతుళ్లుంటారు. వారిలో ఎవరినో ఒకరిని తమ తమ్ముడు చినబాబుకి ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటారు. కానీ చినబాబు మరో అమ్మాయి నీల నీరద(సయేషా సైగల్)ను ప్రేమిస్తాడు. ఆమెను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నట్లు ఇంట్లో చెబుతాడు. తండ్రి ఒప్పుకున్నా.. అక్కలు తమ్ముడిపై కోపాన్ని ప్రదర్శిస్తారు. అతనితో మాట్లాడటం మానేస్తారు. అదే అదనుగా భావించిన చినబాబు శత్రువు సురేంద్ర రాజు(శత్రు) వారి మధ్య దూరాన్ని ఇంకా పెంచాలని ప్రయత్నం చేస్తాడు. అయితే చివరకు కృష్ణంరాజు తన కటుంబ సభ్యులను ఒక్కటిగా ఎలా కలిపాడు? తను కోరుకున్న అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడా? లేదా? అనే విషయాలు తెలుసుకోవాలంటే కథేంటో చూద్దాం...
ప్లస్ పాయింట్స్:
నటీనటులు సినిమాకు మెయిన్ ఎసెట్ అయ్యారు. కార్తి రైతుగా.. కోరుకున్న అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకున్న ప్రేమికుడిగా.. అక్కల ముద్దుల తమ్ముడిగా వేరిషయన్స్ చూపుతూ చక్కగా నటించాడు. సయేషా లవ్ ట్రాక్‌కే పరిమితమైంది. ఆమె పాత్రలో పెర్‌ఫార్‌మెన్స్‌కు స్కోప్ లేదు. హీరోల అక్కలు.. బావల పాత్రల్లో నటించిన వారందరూ పరిధుల మేర చక్కగా నటించారు. ఇక సూరి కామెడీ ట్రాక్ మెప్పిస్తుంది. హీరో కుటుంబ సభ్యుల మధ్య.. సూరి, కార్తి .. వీరి మధ్య వచ్చే కామెడీ సన్నివేశాలు అకట్టుకుంటాయి. సాంకేతికంగా చూస్తే.. దర్శకుడు పాండిరాజ్‌ను అభినందించాల్సిందే. ఎందుకంటే ఓ పెద్ద కుటుంబం.. వారి మధ్య బంధాలు, అనుబంధాలు, ఎమోషన్స్ అన్నింటినీ ఎలాంటి కన్‌ఫ్యూజన్ లేకుండా చక్కగా తెరకెక్కించాడు. ఇమాన్ బ్యాగ్రౌండ్ స్కోర్ బావుంది. వేల్‌రాజ్ కెమెరావర్క్ బావుంది. డైలాగ్స్ బావున్నాయి. సూర్య స్పెషల్ అప్పియరెన్స్ బావుంది.
మైనస్ పాయింట్స్:
తెలుగు నెటివిటీకి సన్నివేశాలు దూరంగా ఉండటం.. సత్యరాజ్‌కి, సూర్యకి డబ్బింగ్ చెప్పిన వారి గొంతు బాలేదు. రెండు, మూడు సన్నివేశాలు కథకు లింక్ కాకుండా ఉన్నాయి.
సమీక్ష:
ఫస్టాఫ్ అంతా కుటుంబం వారి మధ్య అనుబంధంతో .. హీరో విలన్ మధ్య గొడవలు.. హీరోయిన్‌తో హీరో ప్రేమలో పడటం.. ఆమెకు ప్రేమను చెప్పడం అంతా కూల్‌గా సాగుతుంది. సెకండాఫ్ విషయానికి వచ్చేసరికి ఫ్యామిలీ సెంటిమెంట్స్ కారణంగా విడిపోవడం, వారిని కలపడానికి హీరో ప్రయత్నం చేయడం.. అలా సన్నివేశాల పరంగా సూరి, ఇతర కుటుంబ సభ్యుల మధ్య వచ్చే కామెడీ ప్రేక్షకులను అలరిస్తుంది. ముఖ్యంగా క్లైమాక్స్‌లో గుడిలో ఎమోషనల్ సన్నివేశాలు.. ప్రీ క్లైమాక్స్‌లో ఆస్థి పంపకాలు.. కుటుంబ తగాదాలు వచ్చే సన్నివేశాలు ఎక్కడా పరిధి దాటినట్లు లేవు. రైతు గొప్పతనం గురించి హీరో సూర్య చెప్పే సన్నివేశాలు బావున్నాయి. రైతు సమస్యలను హీరో సినిమా ఆసాంతం సునిశితంగా టచ్ చేయడం బావుంది.
బోటమ్ లైన్: కుటుంబ బాంధవ్యాలను, ఎమోషన్స్‌ను టచ్ చేస్తూ.. రైతు సమస్యలను అందంగా స్పృశించిన 'చినబాబు'
Chinna Babu Movie Review in English
- Read in English