లేడీస్ హాస్టల్స్ చేస్తున్న పనులపై రెచ్చిపోయిన చిన్మయి...
- IndiaGlitz, [Tuesday,December 01 2020]
మీటూ ఉద్యమం ఉధృతంగా జరుగుతున్న సమయంలో సినీ పరిశ్రమలో మహిళలు ఎదుర్కొంటున్న లైంగిక పరమైన ఇబ్బందులను పేర్కొంటూ దక్షిణాదిన గాయని చిన్మయి గళమెత్తారు. ఆ సందర్భంలో ఆమె ప్రముఖ రచయిత వైరముత్తు, సీనియర్ నటుడు రాధారవి, సింగర్ కార్తీక్, గాయకుడు మనోలపై ఆరోపణలు కూడా చేశారు. రాధారవిపై చిన్మయి చేసిన ఆరోపణల కారణంగా ఆమెను డబ్బింగ్ యూనియన్ నుండి కూడా తొలగించారు. అయితే ఎన్ని ఇబ్బందులు పెట్టినా చిన్మయి తన పంథాను మార్చుకోలేదు. మీ టూ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లే పనిలోనే ఉంది. వీలుకుదిరినప్పుడల్లా చిన్మయి అమ్మాయిలకు ఎదురవుతున్న లైంగిక వేధింపులపై గళమెత్తుతూనే ఉంది. తాజాగా లేడీస్ హాస్టల్స్‌లో అమ్మాయిలపై జరుగుతున్న అకృత్యాలకై తనదైన శైలిలో విమర్శలు చేశారు.
ఓ అమ్మాయి లేడీస్ హాస్టల్‌లో ఎదుర్కొన్న ఇబ్బందికరమైన పరిస్థితిని వివరిస్తూ చిన్మయి పోస్ట్ పెట్టింది. ‘‘2015.. హైదరాబాద్‌లోని ఓ స్కూల్ హాస్టల్‌లో చేరి పదవ తరగతి చదువుతున్నాను. అక్కడి వార్డెన్ మాపట్ల దారుణంగా ప్రవర్తించేది. మేం పీరియడ్స్ అని చెప్పిన వినకుండా విప్పి చూపించమని చెప్పేది. నాకు కూడా అలాంటి పరిస్థితే ఎదురైంది. క్లాస్‌లో ఉండగా పీరియడ్ వచ్చింది. ఉండలేక హాస్టల్‌కు వెళ్లాను. కానీ వార్డెన్ నన్ను రూమ్‌లోకి వెళ్లనివ్వలేదు. విప్పి చూపమని ఆర్డర్ వేసింది. నేను చూపించిన తర్వాత నన్ను లోపలికి అనుమతించింది’’ అంటూ ఓ అమ్మాయి చెప్పిన విషయాన్ని చిన్మయి షేర్ చేసింది.