China:'విద్యార్ధులూ.. ప్రేమించుకోండి' : వారం పాటు సెలవులు.. చైనా కాలేజీల వింత నిర్ణయం, ఎందుకిలా ..?
- IndiaGlitz, [Monday,April 03 2023]
ప్రపంచంలోని పలు దేశాలు జనాభా పరంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. కొన్ని దేశాల్లో విపరీతంగా జనాభా పెరిగిపోతుంటే.. మరికొన్ని చోట్ల మాత్రం జననాల రేటు భారీగా పడిపోతోంది. యూరప్‌లోని కొన్ని దేశాలు, జపాన్, దక్షిణ కొరియాతో పాటు మన పొరుగునే వున్న చైనాలో జనాభా సంఖ్య తగ్గుతూ వస్తోంది. దీనికి కారణాలు అనేకం. దీంతో డ్రాగన్ అలర్ట్ అయ్యింది. జననాల రేటు పెంచేందుకు ఆ దేశం అనేక చర్యలు తీసుకుంటోంది.
ఈ తొమ్మిది కాలేజీల అరుదైన నిర్ణయం :
తాజాగా చైనాకి చెందిన కాలేజీలు వినూత్న నిర్ణయం తీసుకున్నాయి. ఎక్కడైనా కాలేజీలు విద్యార్ధుల్ని బాగా చదివి తల్లిదండ్రులకు, దేశానికి పేరు తీసుకురమ్మని ప్రోత్సహిస్తాయి. కానీ ఇప్పుడు చైనాలోని కొన్ని కాలేజీలు మాత్రం విద్యార్ధుల్ని ప్రేమించుకోమని చెబుతున్నాయి. అంతేకాదు.. ఇందుకోసం ఏకంగా సెలవుల్ని కూడా ప్రకటించేశాయి. దీనికి కారణం పడిపోతున్న జననాల రేటే. ఈ ఇబ్బందిని ఎదుర్కొనేందుకు ఆ దేశంలోని తొమ్మిది కళాశాలలు ఒక ప్రత్యేక ప్రణాళికతో ముందుకొచ్చాయి. తమ విద్యార్ధులు ప్రేమలో పడటానికి వారం సమయం ఇచ్చాయి.
సెలవులతో పాటు హోంవర్క్ కూడా :
ఎన్బీసీ న్యూస్ నివేదిక ప్రకారం.. తొమ్మిది కళాశాలల్లో ఒకటైన మియాన్యాంగ్ ఫ్లయింగ్ వొకేషనల్ కాలేజ్ తొలుత మార్చి 21న స్ప్రింగ్ బ్రేక్‌ను ప్రకటించింది. ప్రకృతిని ఆస్వాదిస్తూ.. జీవితపు సారాన్ని అనుభవించండని విద్యార్ధులకు చెప్పాయి. నీరు, పచ్చని పర్వతాలను చూస్తూ వసంతకాలాన్ని ఆస్వాదించాలని కాలేజీలు సూచించాయి. ఈ నిర్ణయం వల్ల విద్యార్ధుల పరిధులు విస్తృతం చేయడమే కాకుండా , వారి మనోభావాలను కూడా పెంపొందిస్తుందన్నారు మియాన్యాంగ్ ఫ్లయింగ్ ఒకేషనల్ కాలేజ్ డిప్యూటీ డీన్ లియాంగ్ గుయోహుయ్. ఈ సెలవుల కాలంలో విద్యార్ధులకు డైరీలు రాయడం, వ్యక్తిగత వృద్ధిని రికార్డ్ చేయడం, ప్రయాణాల వీడియోలను చిత్రీకరించడం వంటి హోంవర్క్ ఇచ్చినట్లు ఆయన తెలిపారు.
30 ఏళ్లుగా క్షీణిస్తోన్న జననాల రేటు :
జననాల రేటును పెంచేందుకు చైనా ప్రభుత్వం 20కి పైగా సిఫార్సులతో ముందుకు రావాలని కోరింది. 1980 నుంచి 2015 మధ్యకాలంలో అమలు చేసిన వన్ చైల్డ్ పాలసీ ఇప్పుడు ఆ దేశానికి తిప్పలు తెచ్చిపెట్టింది. దీని ప్రకారం ఏ జంట అయినా ఒక్కరిని మించి పిల్లల్ని కనడానికి వీల్లేదు. ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువమంది పిల్లలు వుంటే వారికి ప్రభుత్వ పథకాలు, ఇతర ప్రయోజనాలు అందవు. దీంతో దేశంలోని వివాహితులంతా ఒక్కరినే కంటూ వచ్చారు. కాలక్రమేణా దేశంలో జనాభా తగ్గిపోయింది. మరోవైపు చైనాలో పిల్లలను పెంచాలన్నా విపరీతంగా ఖర్చు పెట్టాల్సిందే. విద్య, వైద్యం, ఇతర వ్యయాలు భారీగా పెరిగిపోయాయి. ఇలాంటి పరిస్థితుల్లో పిల్లలను కనేందుకు దేశ ప్రజలు ఇష్టపడలేదు. ఇలా చైనాలో జననాల రేటు తగ్గేందుకు ఎన్నో కారణాలు వున్నాయి.
చైనాలో ప్రతి వెయ్యికి 6.77 జననాలే:
60 ఏళ్ల తర్వాత చైనాలో 2021లో జననాల రేటు బాగా తగ్గింది. గతేడాది ప్రతి వెయ్యి మందికి 6.77 జననాలు మాత్రమే నమోదయ్యాయి. అంతక్రితం ఏడాది ఇది 7.52గా వుంది. కరోనా, లాక్డౌన్ సమయంలో జంటలు ఇంట్లోనే వున్నప్పటికీ పిల్లలను కనడానికి ఆసక్తి చూపలేదని నివేదికలు చెబుతున్నాయి. దీనికి తోడు పెళ్లయిన వారే పిల్లలను కనేందుకు ప్రభుత్వం గుర్తింపు ఇవ్వడం కూడా చైనాను ఇబ్బందులకు గురిచేసింది.
కార్యాచరణ సిద్ధం చేస్తోన్న సర్కార్ :
చైనా పీపుల్స్ పొలిటికల్ కన్సల్టేటివ్ కాన్ఫరెన్స్ (సీపీపీసీసీ) ప్రకారం.. యాజమాన్యం కంటే ప్రభుత్వం ఇచ్చే ప్రసూతి సెలవులు మహిళలపై వివక్షను తగ్గించడంలో సహాయపడతాయి. పితృత్వ సెలవులను పెంచడం వల్ల తండ్రులు సంతాన బాధ్యతలను తీసుకోవడానికి వీలు కలుగుతుందని రాయిటర్స్ నివేదించింది. ఈ నెలలో సీపీపీసీసీ కొన్ని ముఖ్యమైన సిఫారసులు చేసింది. మొదటి బిడ్డకే కాకుండా రెండవ, మూడవ బిడ్డకు కూడా రాయితీలు ఇవ్వాలని సూచించింది. ఇందులో ఉచితంగా ప్రభుత్వ విద్య, సంతానోత్పత్తి చికిత్సలు వంటివి వున్నాయి.