దలైలామా ను కలవొద్దు... చైనా ఘాటు హెచ్చరిక

  • IndiaGlitz, [Saturday,October 21 2017]

గతం లో విదేశీ నాయకులు ఎవరైనా బౌద్ధ ఆధ్యాత్మిక గురువు దలైలామా ను కలిస్తే చైనా నిరసన తెలుపుతూ వచ్చేది. కానీ ఇప్పుడు దలైలామాపై చైనా తన వైఖరిని కఠినతరం చేసినట్టు తెలుస్తోంది. దలైలామా ను ఇకపై విదేశీ నాయకులు ఎవరూ కలవకూడదంటూ చైనా ఈరోజు ఘాటు హెచ్చరికలు జారీ చేసింది. కాదని ఎవరైనా దానిని తీవ్ర నేరంగా పరిగణిస్తామంటూ ఆ హెచ్చరికల్లో పేర్కొంది. అంతేకాకుండా ఆయనకు ఏ దేశమైనా ఆతిథ్యమిచ్చినా సహించబోమంటూ ఘాటు వ్యాఖ్యలు చేసింది. విదేశీ నేతలు ఎవరైనా వ్యక్తిగతంగా దలైలామాను కలుసుకోవచ్చునని భావిస్తూ ఉండవచ్చని, కానీ, తమ ప్రభుత్వాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న వారు అలా చేయరాదని చెప్పుకొచ్చింది.

నోబెల్‌ శాంతిపురస్కారాన్ని గెలుచుకున్న దలైలామాను చైనా ప్రమాదకర వేర్పాటువాదిగా అభివర్ణిస్తూ వస్తోంది.

దలైలామా తన మాతృభూమి అయిన టిబేట్‌కు స్వతంత్ర ప్రతిపత్తి కావాలని ఎప్పటినుండో డిమాండ్ చేస్తూ వస్తున్నారు .

గతంలో చైనా పాలనకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసేందుకు ప్రయత్నించి విఫలమైన దలైలామా, ప్రస్తుతం భారత్‌లో ప్రవాసముంటున్న సంగతి తెలిసిందే.