కేసీఆర్‌తో నాకు గొడవలేంటీ.. అంతా మీడియా వల్లే: చినజీయర్ ఘాటు వ్యాఖ్యలు
- IndiaGlitz, [Friday,February 18 2022]
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కి చిన్నజీయర్ స్వామికి మధ్య విభేదాలు చోటు చేసుకున్నాయంటూ గత కొన్ని రోజులుగా మీడియాలో వార్తలు వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ గ్యాప్ కారణంగానే కేసీఆర్ .. ముచ్చింతల్‌లో సమతామూర్తి విగ్రహావిష్కరణ కార్యక్రమానికి హాజరుకాలేదంటూ కథనాలు చక్కర్లు కొట్టాయి. ఈ నేపథ్యంలో ఊహాగానాలకు చెక్ పెట్టారు చినజీయర్ స్వామి.. ముఖ్యమంత్రితో తమకేం విభేదాలు ఉంటాయని ప్రశ్నించారు. సీఎం సహకారంతోనే ఇంత పెద్ద కార్యక్రమం విజయవంతంగా జరిగిందని చినజీయర్ వివరించారు. తెలంగాణ సీఎం కేసీఆర్ మొదటి రోజు ఇక్కడికి వచ్చినప్పుడు తానే మొదటి వాలంటీర్ అని చెప్పారని స్వామిజీ గుర్తు చేశారు.
తర్వాత ఆయనకున్న కార్యక్రమాల దృష్ట్యా సీఎం రాలేకపోయారని చినజీయర్ పేర్కొన్నారు. విభేదాలు అనే మాట సృష్టించడమే తప్పని... శనివారం జరగనున్న శాంతి కల్యాణం కార్యక్రమానికి సీఎంను కూడా ఆహ్వానించామని వస్తారని ఆశిస్తున్నట్లు చినజీయర్ తెలిపారు.. అధికారంలో ఉన్న వారిని మాత్రమే ఆహ్వానించడంపైనా ఆయన స్పందించారు. తమకు విపక్షాలు, స్వపక్షాలు లేవని.. ప్రజాసేవలో ఉన్న వారంతా దీనికి ఆహ్వానితులేనని చినజీయర్ ప్రకటించారు.
దేవుడి సన్నిధిలో రాజకీయాలతో సంబంధం లేకుండా అందరూ ఆహ్వానితులేనని చివరికి ముస్లిం నాయకులను కూడా ఆహ్వానించామని ఆయన గుర్తుచేశారు.. ఆహ్వాన పత్రిను అరబిక్ భాషలో కూడా ప్రింట్ చేశామని చినజీయర్ వెల్లడించారు. అటు సమతామూర్తి విగ్రహాల దర్శనానికి టిక్కెట్ ధరలను ఖరారు చేయడాన్ని చినజీయర్ సమర్థించుకున్నారు. అది టికెట్ కాదు.. ఎంట్రీ ఫీజని స్పష్టం చేశారు. ఇక్కడ నియమాలు పాటించాలని గుర్తు చేసేందకు ఫీజు పెట్టామన్నారు.
అలాగే శిలాఫలకం మీద ముఖ్యమంత్రి కేసీఆర్ పేరు లేకపోవడంపైనా చినజీయర్ క్లారిటీ ఇచ్చారు. మీడియా వాళ్లు కొన్ని కలిపి రాయడం వల్ల కోతులా ఉండాల్సింది ఏనుగై కూర్చుంటుందన్నారు. ప్రధాని రావాలని నాలుగేళ్ల క్రితమే నిర్ణయమైందని ఆయన వెల్లడించారు. ఈ విషయం కేసీఆర్‌కు కూడా తెలుసునని చినజీయర్ చెప్పారు. అంతకుమించి కేసీఆర్ పేరును ఉద్దేశపూర్వకంగా శిలాఫలకంపై తొలగించడం ఏమీ లేదన్నారు.