Balaji Temple Chief Priest:శేషవస్త్రం ధరించి పాడు పనులా : కృతి , ఓం రౌత్ 'ముద్దు' పై చిలుకూరు ఆలయ ప్రధాన అర్చకుడి ఆగ్రహం
- IndiaGlitz, [Thursday,June 08 2023]
కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవారి ఆలయం ఆవరణలో ఆదిపురుష్ దర్శకుడు ఓం రౌత్, హీరోయిన్ కృతి సనన్‌లు ముద్దు పెట్టుకోవడం, కౌగిలించుకున్న ఘటన తెలుగు రాష్ట్రాలతో పాటు జాతీయ స్థాయిలో వివాదాస్పదమైంది. దీనిపై శ్రీవారి భక్తులు, సాంప్రదాయ వాదులు భగ్గుమంటున్నారు. సినీ పరిశ్రమకు చెందిన వ్యక్తులకు పెక్, హగ్‌లు కామనే అయినా మనం ఎక్కడ నిలబడి వున్నామన్న సంగతిని మైండ్‌లో పెట్టుకుని ప్రవర్తించాలని చురకలంటిస్తున్నారు. తక్షణం ఇద్దరు క్షమాపణలు చెప్పాలని సాంప్రదాయవాదులు డిమాండ్ చేస్తున్నారు.
భార్యాభర్తలు కూడా జాగ్రత్త పడతారు :
తాజాగా కృతి, ఓం రౌత్ ముద్దు ఘటనపై చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ స్పందించారు. ఈ మేరకు ఆయన ఓ వీడియో రిలీజ్ చేశారు. తిరుమల గిరుల్లో ఎవరైనా నిబంధనలను ఖచ్చితంగా పాటించాల్సిందేనని స్పష్టం చేశారు. పవిత్రమైన శ్రీవారి శేష వస్త్రాన్ని ధరించి కౌగిలించుకోవడం, ముద్దు పెట్టుకోవడం తనను తీవ్రంగా బాధించిందని రంగరాజన్ ఆవేదన వ్యక్తం చేశారు. తిరుమలలో ఇలాంటి చేష్టలు చేయరాదని హితవు పలికారు. స్వయంగా భార్యాభర్తలు శ్రీవారి దర్శనానికి వచ్చినా.. కళ్యాణోత్సవంలో పాల్గొన్నా చెడ్డ ఆలోచనలు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటారని రంగరాజన్ గుర్తుచేశారు.
సీత పాత్రకు కృతి సెట్ కాలేదు :
ఇలాంటి విషయాల గురించి మాట్లాడాల్సి వచ్చినప్పుడు తాను టీవీ ఛానెల్స్ ముందుకు రానని ఆయన స్పష్టం చేశారు. ఎన్టీఆర్, ఏఎన్ఆర్ వంటి మహానటులు శ్రీరాముడి పాత్రను పోషించినప్పుడు ప్రజలు వారిని దైవ సమానులుగా చూసేవారని... వాళ్లు కూడా భక్తి శ్రద్దలతో వుండేవారని రంగరాజన్ గుర్తుచేశారు. సీత పాత్రకు కృతి సనన్ సెట్ అవ్వలేదని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. తిరుమలను కోట్లాది మంది భక్తులు భూలోక వైకుంఠంగా భావిస్తారని.. అలాంటి చోట పాడు పనులు చేయడమంటే సీతారాములను అవమానించినట్లేనని రంగరాజన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.