Chi La Sow Review
కాళిదాసుతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన సుశాంత్ ఆటాడుకుందాం రా వరకు ప్రేక్షకుల మెప్పు పొందడానికి చేసిన ప్రయత్నాలు పెద్దగా సక్సెస్ కాలేదు. ఎదో చేద్దామనే కంటే .. ట్రెండ్‌కు తగిన విధంగా కొత్త కథతో సినిమా చేద్దామని అనుకుంటున్న సుశాంత్ ఒక వైపు.. దర్శకుడు కావాలని హీరో అయ్యి.. తన కలను నేరవేర్చుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్న రాహుల్ రవీంద్రన్ మరోవైపు.. వీరిద్దరి కలయికలో వచ్చిన సినిమాయే `చి.ల.సౌ`.
సినిమా విడుదలకు ముందు మంచి బజ్‌ను క్రియేట్ చేసుకుంది. సినిమాను విడుదల చేయడానికి అన్నపూర్ణ స్టూడియోస్ సంస్థ ముందుకు రావడంతో సినిబా బావుండబట్టే అన్నపూర్ణ స్టూడియోస్ ముందుకు వచ్చిందని .. సినిమాను చూసిన చైతన్య, సమంత కూడా సినిమా గురించి కాన్ఫిడెంట్‌గా కనపడటంతో పాటు అన్నపూర్ణ సంస్థ రాహుల్‌కి తమ సంస్థలో మరో సినిమాను డైరెక్ట్ చేస్తే అవకాశం ఇవ్వడం ఇత్యాది విషయాలు సినిమాపై అంచనాలను పెంచాయి. మరి ఈ అంచనాలను సినిమా అందుకుందా? ఏమో తెలియాలంటే కథలోకి వెళదాం...
కథ:
మంచి ఉద్యోగం చేసే అర్జున్(సుశాంత్)ని పెళ్లి చేసుకుని సెటిలవమని తల్లిదండ్రులు(సంజయ్ స్వరూప్, అను హాసన్).. ఫ్రెండ్ (వెన్నెలకిశోర్) పోరు పెడుతుంటారు. అర్జున్ ఐదేళ్ల వరకు పెళ్లి చేసుకోనని భీష్మించుకుని ఉంటాడు. అతని తల్లి రొటీన్‌కు భిన్నంగా తమ ఇంట్లోనే ఎవరూ లేని సమయంలో పెళ్లిచూపులు ఏర్పాటు చేస్తుంది. ఇంటికి వచ్చిన అంజలి(రుహానీ శర్మ)తో తనకు పెళ్లంటే ఇష్టం లేదని.. ఐదేళ్ల వరకు పెళ్లి చేసుకోకూడదని అనుకుంటున్నానని చెప్పేస్తాడు అర్జున్. అదే క్రమంలో అంజలి మధ్య తరగతి అమ్మాయిగా ఎలా ఉన్నతంగా ఎదిగింది? తన తల్లి కోసం అంజలి పడే తాపత్రయం అన్నీ చూసి అర్జున్‌కి అంజలి అంటే ఓ ఎమోషన్ కనెక్ట్ అవుతుంది. దాంతో ఆమెకు ఇబ్బందులు వస్తే.. సపోర్ట్‌గా వెళతాడు. చివరకు ఇద్దరి మధ్య అనుబంధం ఏర్పడుతుందా? ఇద్దరి మధ్య అభిప్రాయాలు కలుస్తాయా? అనేవి తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే...
ప్లస్ పాయింట్స్:
సినిమాలో కొత్త కథ కనపడదు కానీ.. సినిమాలోని ఎమోషన్స్.. కథనం సినిమాకు ప్రధానబలంగామారాయి. సినిమా ఫస్టాఫ్ సాదాసీదాగా సాగినా.. హీరో సుశాంత్.. హీరోయిన్ రుహానీ శర్మలు వారి వారి పాత్రల్లో చక్కగా నటించారు. సినిమా అంతా లీడ్ పెయిర్ చుట్టూనే తిరుగుతుంది. ఇద్దరూ అల్ట్రా గ్లామర్ స్టైల్లో కాకుండా మన పక్కింటి అబ్బాయి.. అమ్మాయి పాత్రల్లో కనపడతారు. సినిమాలో లొకేషన్స్ కూడా పెద్దగా లేవు. అయినా దర్శకుడు రాహుల్ రవీంద్ర సినిమాను సింపుల్‌గా నడింపించాడు. కథలో ఓవర్ కాంప్లికేషన్స్ లేకుండా సినిమాను తెరకెక్కించాడు రాహుల్. ప్రశాంత్ విహారి పాటలు కథలో భాగంగానే ఉన్నాయి. నేపథ్య సంగీతం బావుంది. సుకుమార్ సినిమాటోగ్రఫీ బావుంది.
మైనస్ పాయింట్స్:
సినిమా స్లో నెరేషన్‌తో బోర్ అనిపిస్తుంది. ముఖ్యంగా ఫస్టాఫ్. కథలో ఏలాంటి కొత్తదనం లేదు. పెళ్లిచూపులు అనే కాన్సెప్ట్‌తో సినిమాను నడిపించడంతో సినిమా అంతా దాని చుట్టూనే తిరుగుతుంది. కొన్ని సీన్స్‌లో కెమెరావర్క్ పెద్ద ఎఫెక్టివ్‌గా అనిపించలేదు. ఎడిటింగ్‌లో మరో పది నిమిషాల సినిమాను తగ్గించి ఉండొచ్చు.
సమీక్ష:
పాతికేళ్లు దాటినా.. ఇంకా పెళ్లి వద్దనుకునే యువకుడు.. ఇరవై మూడేళ్ల అమ్మాయి నలబై ఏళ్ల వ్యక్తిలా ఆలోచిస్తుంటుంది. ఇలాంటి రెండు భిన్నమైన మనస్తత్వాలు ఉన్న వ్యక్తులు పెళ్లిచూపులకు కూర్చుంటే.. ఎలా ఉంటుందనే కాన్సెప్ట్‌తో పాటు పది నిమిషాల పాటు జరిగే పెళ్లిచూపులు కార్యక్రమంలో నేటి తరం అమ్మాయిలకు ఇబ్బందిగా మారిందనే విషయాన్ని చెప్పడం.. అంత తక్కువ సమయంలో జీవిత భాగస్వామిని ఎంచుకునే ప్రక్రియ.. కట్నకానుకలు మాట్లాడుకోవడం ఇలాంటి చాలా విషయాలను దర్శకడు రాహుల్ రవీంద్ర ఈ సినిమాలో కథలో భాగంగా చర్చించాడు. అలాగే కమర్షియల్ హీరోగా కాకుండా పక్కింటి అబ్బాయి పాత్రలో సుశాంత్ నటించాలనే నిర్ణయం వర్కవుట్ అయినట్టే కనపడింది. హీరో హీరోయిన్‌కు పెద్దగా మేకప్ కూడా లేదు. అమ్మాయిలేమైనా వస్తువులా ఫీచర్స్ చూసి కొనడానికి అనే సంభాషణలు.. హీరో హీరోయిన్ మధ్య వచ్చే చిన్న చిన్న గొడవలు.. ఇద్దరి మధ్య వచ్చే రొమాంటిక్ సన్నివేశాలు.. వెన్నెలకిశోర్ కామెడీ.. అన్నీ ప్రేక్షకులను మెప్పిస్తాయి.
చివరగా.. చి.ల.సౌ.. అహ్లాదమైన ప్రేమకథ
'Chi La Sow' Movie Review in English
- Read in English