Mohith Reddy: దొంగ ఓట్లతో గెలవాల్సిన ఖర్మ పట్టలేదు.. చంద్రబాబు ఆరోపణలపై మోహిత్ రెడ్డి ఫైర్..
Send us your feedback to audioarticles@vaarta.com
చంద్రగిరి నియోజకవర్గంలో లక్ష దొంగ ఓట్లు చేర్పించినట్లు టీడీపీ అధినేత చంద్రబాబు నిరూపిస్తే నామినేషన్ కూడా వేయనని తుడా చైర్మన్, చంద్రగిరి వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త చెవిరెడ్డి మోహిత్ రెడ్డి సవాల్ విసిరారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో చంద్రగిరి అసెంబ్లీ పరిధిలో 2.90 లక్షల ఓట్లు ఉంటే ఇప్పుడు 3.08 ఓట్లు ఉన్నాయని.. అంటే ఐదేళ్లలో పెరిగిన ఓట్లు 16వేలు మాత్రమే అని వివరించారు. కానీ లక్ష దొంగ ఓట్లు అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు ఈసీకి చేసిన ఫిర్యాదుపై న్యాయపోరాటం చేస్తామని.. అవసరమైతే ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని హెచ్చరించారు.
తనకు తాత సమానులు, 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు దొంగ ఓట్లపై ఇటువంటి ఆరోపణలు చేయడం తగదని తెలిపారు. అయినా దొంగ ఓట్లతో గెలవాల్సిన ఖర్మ తమకు ఎప్పుడూ లేదని.. ఈ ఐదేళ్లలో సీఎం జగన్ చేసిన సంక్షేమం, అభివృద్దే తమను గెలిపిస్తాయని తెలిపారు. ఈ సందర్భంగా చంద్రబాబు మోహిత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు.
లేఖలో ఏం పేర్కొన్నారంటే..
"పెద్దలైన చంద్రబాబు తాత మీరు, మా తాత ఇద్దరు కలిసి చదువుకున్నారు, కావున మీరు నాకు తాత లాంటి వారు, నా వయసు 25 సంవత్సరాలు, చంద్రబాబు తాత మీరు రాజకీయాల్లోకి వచ్చి 45 ఏళ్ళయింది, మీరు రాజకీయాల్లోకి వచ్చిన 20 ఏళ్ళకు నేను పుట్టాను. ఈ రోజు చంద్రబాబు తాత మీరు పెట్టిన ప్రెస్మీట్. ఎన్నికల కమీషన్కు చేసిన ఫిర్యాదు చూసి ఆశ్చర్యపోయాను. ఇంత అపార అనుభవం ఉన్న రాజకీయ నాయకుడైన మీరు కనీసం నిజానిజాలు తెలుసుకోకుండా, ఈ రోజు ఎన్నికల కమీషన్కు చంద్రగిరిలో లక్ష దొంగ ఓట్లు నమోదు చేశారని ఫిర్యాదు చేయడం, ప్రెస్ మీట్ పెట్టి ఆవాస్తవాలు మాట్లాడడం చాలా బాధాకరం.
ఇంత అపార రాజకీయ అనుభవమున్న రాజకీయ నాయకుడైన మీరు వాస్తవాలు తెలుసుకోకుండా మాట్లాడుతారని నేను నా కలలో కూడా ఊహించలేదు.2019 ఎన్నికల్లో చంద్రబాబు తాత మీరు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో చంద్రగిరిలో మొత్తం ఓట్లు 2,91,734. ఈ రోజు చంద్రగిరి నియోజకవర్గంలో మొత్తం ఓట్లు 3,08,672 మాత్రమే. కేవలం ఈ ఐదు సంవత్సరాలలో పెరిగింది. కేవలం 16 వేలు మాత్రమే. ఈ ఐదు సంవత్సరాలలో చంద్రగిరి నియోజకవర్గంలో సహజంగా కట్టుకునే కొత్త ఇళ్ళే కాకుండా, మా చంద్రగిరి నియోజకవర్గంలోని ఒక్క తిరుపతి రూరల్ మండలంలోనే ఈ ఐదేళ్ళలో కొత్తగా నిర్మించిన అపార్ట్మెంట్లు మొత్తం 160, అందులో ఉన్న ప్లాట్లు 5,200. ఇన్ని కొత్త ఇళ్ళ నిర్మాణం జరిగినప్పుడు 16,000 ఓట్లు కూడా కొత్తగా నమోదు కాకుండా ఎలా ఉంటాయి. ఒక్కసారి ఆలోచించమని చంద్రబాబు తాతను విజ్ఞప్తి చేస్తున్నాను.
నిజంగా లక్ష దొంగ ఓట్లు చేరిస్తే 3,91,000 కావాలి కానీ 3,08,672 మాత్రమే ఎందుకుంటాయి చంద్రబాబు తాతా ఒక్కసారి ఆలోచించు.మా తాత వయసున్న మిమ్మల్ని విమర్శించేంత స్థాయి నాది కాదు, కానీ నిజాలు తెలుసుకోకుండా ఏదంటే అది మాట్లాడడం మీ వయసుకు కూడా తగదని మీ మనవడిగా మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. 2023 నవంబర్ నెలలో కేవలం 4 రోజుల్లో టీడీపీ వారు 14,200 దొంగ ఫారం 7 లు నింపి దరఖాస్తు చేశారు. ఎన్నికల కమీషన్ విచారణ చేస్తే చాలామంది టీడీపీ వారు అరెస్ట్ అవుతారు. ఆ విషయం కూడా మీ దృష్టికి తీసుకొస్తున్నాను తాతా…అసత్య ఆరోపణలు చేసిన అందరిపైనా పరువు నష్టం దావా వేస్తున్నాను. న్యాయస్థానం ముందు దోషులుగా నిలబెడతాను, చంద్రగిరి ప్రజల ముందు కూడా దోషులుగా నిలబెడతాను. అప్పటివరకు న్యాయపోరాటం కొనసాగిస్తానని తెలియజేసుకుంటున్నాను.
వాస్తవాలు తెలుసుకోకుండా ఇలాంటి అసత్యాలే ఇంకా కూడా మీరు కొనసాగిస్తే… నేను మా నియోజకవర్గ ప్రజలతో కలిసి పోరాటాలు చేసేందుకు సిద్ధంగా ఉన్నాను, అవసరమైతే ఆమరణ నిరాహార దీక్షకు సైతం వెనకాడనని మీ దృష్టికి తీసుకొస్తున్నాను. మీరు సీఎంగా ఉన్నప్పుడే మా నాన్న 43 వేల మెజార్టీతో గెలిచారు. అలాంటి మాకు దొంగ ఓట్లతో గెలవాల్సిన అవసరం లేదు. మా చంద్రగిరి నియోజకవర్గ ప్రజలు మమ్మల్ని రాజకీయ నాయకులుగా ఎప్పుడూ చూడరు. తమ కుటుంబ సభ్యులుగా చూస్తారు.చివరిగా చంద్రబాబు తాతా…మిమ్మల్ని మనసారా విజ్ఞప్తి చేసేది ఏంటంటే… మీరు ఎప్పుడూ కూడా మీ వయసుకు, మీ అనుభవానికి తగ్గకుండా ఉండాలని కోరుకుంటున్నాను"అని లేఖలో మోహిత్ రెడ్డి పేర్కొన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments