ఎమ్మెల్యే రోజా భర్త సెల్వమణికి షాక్.. అరెస్ట్ వారెంట్ జారీ చేసిన చెన్నై కోర్ట్
Send us your feedback to audioarticles@vaarta.com
వైసీపీ సీనియర్ నేత, నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా భర్త , ప్రముఖ దర్శకుడు ఆర్కే సెల్వమణిపై అరెస్ట్ వారెంట్ జారీ అయ్యింది. ఈ మేరకు చెన్నైలోని జార్జి టౌన్ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. వివరాల్లోకి వెళితే.. 2016లో ఆర్కే సెల్వమణి, తమిళనాడులో కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే అరుళ్ అన్బరసు కలిసి ఓ టీవీ ఛానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా ప్రముఖ ఫైనాన్షియర్ ముకుంద్‌చంద్ బోద్రా అనే వ్యక్తి గురించి పలు అభిప్రాయాలు పంచుకున్నారు.
అయితే ఈ వ్యాఖ్యలు తన ప్రతిష్ఠకు భంగం కలిగించాయనే ఉద్దేశంతో బోద్రా వారిద్దరిపై చెన్నై జార్జిటౌన్ కోర్టులో పరువునష్టం దావా వేశారు. ఈ కేసు విచారణ దశలో వుండగానే ముకుంద్ చంద్ర బోద్రా మృతిచెందారు. అయితే ఆయన తదనంతరం ఆ కేసును అతని కుమారుడు గగన్ బోద్రా కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలోనే మంగళవారం చెన్నై జార్జి టౌన్ కోర్టులో విచారణకు వచ్చింది. ఈ సందర్భంగా సెల్వమణి, అరుళ్‌లు ప్రత్యక్షంగా హాజరు కావాలని గతంలోనే కోర్టు ఆదేశించింది.
అయితే విచారణ సందర్భంగా సెల్వమణి, అరుళ్ అన్బరసులు ఇద్దరూ కోర్టుకు హాజరు కాలేదు. వారి తరఫున న్యాయవాదులు కూడా కోర్టుకు గైర్హజరయ్యారు. దీనిపై న్యాయమూర్తి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వీరిద్దరిపై బెయిలబుల్ అరెస్టు వారెంట్ జారీచేస్తూ విచారణను ఈ నెల 23కు వాయిదా వేశారు. సెల్వమణి ప్రస్తుతం దక్షిణ భారత చలనచిత్ర కార్మిక సంఘాల సమ్మేళనం అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments