వినూత్నంగా వివాహం.. ముక్కున వేలేసుకుంటున్న నెటిజనం..

  • IndiaGlitz, [Tuesday,February 02 2021]

వివాహం అనేది జీవితంలో ఒక కీలకాంశం. దీనిని చాలా ప్రత్యేకంగా జరుపుకోవాలని ఎవరికుండదు? డెస్టినేషన్ మ్యారేజ్ అని.. అదని.. ఇదని చాలానే వచ్చాయి. ఎవరి స్థాయిని బట్టి వారు తమ వివాహాన్ని జరుపుకుంటూ వస్తున్నారు. అలాగే ఒక జంట కూడా తమ వివాహాన్ని వినూత్నంగా జరుపుకోవాలని భావించింది. అనుకున్నదే తడవుగా దానిని అమల్లో కూడా పెట్టేసింది. ఈ జంట పెళ్లి ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే మరీ ఇంత వినూత్నంగానా? అని నెటిజన్లు ముక్కున వేలేసుకుంటున్నారు.

తమళనాడులోని తిరువణ్ణామలైకి చెందిన చిన్నదురై చెన్నైలో ఉద్యోగం చేస్తున్నాడు. అతనికి కోయంబత్తూరుకు చెందిన శ్వేతకు పెద్దలు వివాహం నిశ్చయించారు. అయితే ఈ జంట తమ పెళ్లిని చాలా వినూత్నంగా జరుపుకోవాలని నిర్ణయించింది. అనుకున్నదే తడవుగా తమ వివాహ వేదికను సెట్ చేసుకుంది. ఆ వివాహ వేదిక చెన్నై శివారు ప్రాంతం నీలాంగరై సముద్ర తీరం కావడం విశేషం. అనుకున్న ప్రకారం సోమవారం ఉదయం వధూవరులిద్దరూ పెళ్లి దుస్తులతో పడవలో సముద్రంపైకి వెళ్లారు.

ఆక్సిజన్ సహా సముద్రంలోకి వెళ్లేందుకు అవసరమైన జాగ్రత్తలన్నీ తీసుకున్నారు. అనంతరం సముద్రంలో 60 అడుగుల లోతుకు చేరుకుని పెళ్లి చేసుకున్నారు. సాగరంలో 60 అడుగుల లోతులో జరచరాల సాక్షిగా వరుడు చిన్నదురై.. వధువు శ్వేత మెడలో తాళి కట్టాడు. నీటిలోనే వధూవరులిద్దరూ పూల దండలు మార్చుకున్నారు. అయితే తామెందుకు అలా వివాహం చేసుకోవాల్సి వచ్చిందో చిన్నదురై వివరించాడు. ఈ సందర్భంగా చిన్నదురై మాట్లాడుతూ.. సముద్రగర్భంలో పేరుకుపోతున్న చెత్త గురించి ప్రజల్లో అవగాహన కల్పించేందుకే తామీ సాహసం చేశామని పేర్కొన్నాడు.