Download App

Cheliyaa Review

గ‌త ఏడాది ఒకే బంగారం అనే సినిమాతో స‌క్సెస్ అందుకున్న ఏస్ డైరెక్ట‌ర్ మ‌ణి ర‌త్నం ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన మ‌రో ఇన్‌టెన్స్ ల‌వ్ స్టోరీ `చెలియా`. అస‌లు మ‌ణిర‌త్నం ల‌వ్ స్టోరీస్ అన‌గానే మ‌న‌కు గుర్తుకు వ‌చ్చేవి రోజా, బొంబాయి, గీతాంజ‌లి వంటి చిత్రాలే. ప్రేమ క‌థా చిత్రాల‌ను డిఫ‌రెంట్ స్ట‌యిల్లో ప్రొజెక్ట్ చేయ‌డంలో మ‌ణిర‌త్నం త‌న ప్ర‌త్యేక‌త‌ను ఎప్పుడూ చాటుకుంటూ ఉంటారు. మ‌రి అలాంటి డైరెక్ట‌ర్ నుండి వ‌చ్చిన ఎమోష‌న‌ల్ ల‌వ్ స్టోరీ చెలియా. మ‌ణిరత్నం ద‌గ్గ‌ర అసిస్టెంట్ డైరెక్ట‌ర్‌గా వ‌ర్క్ చేసిన కార్తీ హీరోగా మారిన త‌ర్వాత మణిర‌త్నం ద‌ర్శ‌క‌త్వంలో న‌టించిన సినిమా ఇది. గీతాంజ‌లి ఓ ప్రేమ క‌థ‌, స‌ఖిలో స్ట‌యిల్లో ఉండే ప్రేమ‌క‌థ ఇలా ఎప్ప‌టి క‌ప్పుడు కొత్త ప్రేమ‌క‌థ‌ల‌ను తెర‌కెక్కించే మ‌ణిరత్నం `చెలియా`లో ఎలాంటి ప్రేమ‌క‌థ‌ను చూపించాడో తెలియాలంటే ముందు క‌థ‌ను తెలుసుకుందాం...

ఇండియ‌న్ సినిమాల్లో ఎన్న‌ద‌గ్గ ద‌ర్శ‌కుల్లో ఒక‌రు మ‌ణిర‌త్నం. ఆయ‌న పేరు చెబితే గీతాంజ‌లి, రోజా వంటి ల‌వ్ స్టోరీస్ ఒక‌వైపు ఘ‌ర్ష‌ణ‌, ద‌ళ‌ప‌తి, యువ వంటి యాక్ష‌న్ సినిమాలు గుర్తుకు వ‌స్తాయి. ముఖ్యంగా ప్రేమ‌క‌థ‌ల‌ను తెర‌కెక్కించ‌డంలో మ‌ణిర‌త్నం త‌న ప్ర‌త్యేకత‌ను క‌న‌ప‌రుస్తుంటారు. అలాంటి ఓ ద‌ర్శ‌క దిగ్గ‌జం నుండి వ‌చ్చిన ఎమోష‌న‌ల్ ల‌వ్ జ‌ర్నీ `చెలియా`. ఓ ఫైట‌ర్ ఫైల‌ట్‌కు, డాక్ట‌ర్‌కు మ‌ధ్య జ‌రిగే ప్రేమ క‌థే ఈ చిత్రం. ఇంత‌కు వారి క‌ల‌యిక ఎలా జ‌రిగింది. వారి మ‌న‌స్త‌త్వాల‌ను మ‌ణిర‌త్నం తెర‌పై ఎలా ఆవిష్క‌రించారో తెలుసుకోవాలంటే క‌థ తెలుసుకుందాం..

క‌థ:

సినిమా ముందు కార్గిల్ వార్ నేప‌థ్యంలో ప్రారంభం అవుతుంది. కార్గిల్ యుద్ధంలో పాల్గొన్న ఫైటర్ ఫైల‌ట్ వ‌రుణ్ అలియాస్ వి.సి(కార్తీ) అనుకోకుండా పాకిస్థాన్ సైన్యానికి చిక్కుతాడు. వరుణ్‌ను రావుల్ఫిండి జైలులో బంధించి చిత్ర హింస‌లు పెడుతుంటారు. ఈ క్ర‌మంలో వ‌రుణ్ త‌న ప్రేయ‌సి లీలా గురించి, ఆమెతో ఉన్న ప్రేమ గ‌తం గురించి నెమ‌రువేసుకోవ‌డంతో సినిమా ప్రారంభం అవుతుంది. వ‌రుణ్‌ దూకుడు స్వ‌భావం. త‌నను తాను ఇష్ట‌ప‌డే వ్య‌క్తి. ఓ యాక్సిడెంట్‌లో గాయ‌ప‌డ్డ వరుణ్‌ని అప్పుడే డ్యూటీలో జాయిన్ అయిన లీలా అబ్ర‌హం(అదితిరావు హైద‌రీ) వైద్యంచేసి కాపాడుతుంది. అలా ప్రారంభ‌మైన వ‌రుణ్‌, లీలా ప‌రిచ‌యం రోజు రోజుకూ పెరుగుతూ పోయి ప్రేమ‌గా మారుతుంది. అఇయ‌తే వ‌రుణ్ త‌న దురుసుత‌నంతో లీలా కొన్ని సంద‌ర్భాల్లో బాధ‌పెడతాడు. చివ‌ర‌కు త‌న త‌ప్పును తెలుసుకుని ఆమెకు క్ష‌మాప‌ణ చెబుతాడు. వ‌రుణ్ కార‌ణంగా లీలా గ‌ర్భ‌వ‌తి అవుతుంది. వరుణ్‌, లీలాలు పెళ్ళి చేసుకోవాల‌నుకుంటారు కానీ వ‌రుణ్ త‌న ప్ర‌వ‌ర్త‌న‌తో లీలాను బాధ‌పెడ‌తాడు. లీలా గ‌ర్భ‌వ‌తి అని తెలిసినా తాను మంచి తండ్రి కాలేడ‌ని ఆమెతో చెబుతాడే త‌ప్ప‌, ఆమెను పెళ్ళి చేసుకోవాల‌నుకోడు. అయితే జ‌రిగే ప‌రిణామాల‌తో వ‌రుణ్ త‌న త‌ప్పును తెలుసుకుని లీలా ద‌గ్గ‌ర‌కు వెళ‌తాడు. లీలా త‌ల్లిదండ్రుల‌కు వ‌రుణ్ న‌చ్చ‌డు. వ‌రుణ్‌, లీలా మ‌ధ్య గొడ‌వ పెద్ద‌ద‌వుతుంది. ఇద్ద‌రూ విడిపోయే క్ర‌మంలో ఏమ‌వుతుంది? అస‌లు వ‌రుణ్ పాకిస్థాన్ నుండి ఎలా బ‌య‌ట‌ప‌డ్డాడు?  చివ‌ర‌కు వ‌రుణ్‌, లీలా క‌లుసుకున్నారా? అనే విష‌యాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే...

ప్ల‌స్ పాయింట్స్:

- కార్తీ, అదితిరావు న‌ట‌న‌
- బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌
- సినిమాటోగ్ర‌ఫీ

మైన‌స్ పాయింట్స్:

- స్లో నేరేష‌న్‌
- సినిమా అన్నీ వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌కు న‌చ్చ‌దు
- కామెడి లేక‌పోవ‌డం

విశ్లేషణ:

మ‌ణిర‌త్నం చెలియాలో ఎలాంటి ప్రేమ‌క‌థ‌ను చూపించాడ‌నే విష‌యంలోకి ముందుగా వ‌స్తే..రెండు బ‌ల‌మైన పాత్ర‌ల మ‌ధ్య ప్రేమ ప్ర‌యాణం ఎలా సాగుతుంద‌నేదే ముఖ్య‌మైన క‌థ‌. దాన్ని ఎమోష‌న‌ల్‌గా తెర‌పై చూపించే ప్ర‌య‌త్నం చేశాడు. ఈ ప్రేమ‌క‌థ‌కు కార్గిల్ యుద్ధ నేప‌థ్యాన్ని జోడించి ఆస‌క్తిక‌రంగా తెరకెక్కించే ప్ర‌య‌త్నం చేశాడు కానీ. జైలు నుండి కార్తీ, అత‌ని మిత్రులు త‌ప్పించుకునే సీన్స్‌ను ఆస‌క్తిక‌రంగా తెర‌కెక్కించ‌లేదు. చెలియాలో కొన్ని స‌న్నివేశాలు మ‌ణిర‌త్నం గ‌త చిత్రాలైన బొంబాయి, రోజా, స‌ఖిల్లో  కొన్ని స‌న్నివేశాల‌ను అటు ఇటు మార్చి తీర్చిన‌ట్టు ఉంది. ముఖ్యంగా క్లైమాక్స్‌లో హీరో, హీరోయిన్ క‌లుసుకునే సీన్ స‌ఖిలో మాధ‌వ‌న్ త‌న ప్రేయ‌సి షాలినిని క‌లుసుకునే స్ట‌యిల్లో తెరెక్కించారు. అలాగే మొరెత్తుకొచ్చిందే పాట స‌ఖిలో సాంగ్‌ను పోలి ఉన్న‌ట్టుగా అనిపించింది. రెహ‌మాన్ సంగీతాన్ని విమ‌ర్శించ‌లేం కానీ..ట్యూన్స్ ప్రేక్ష‌కుల బుర్ర‌ల్లోకి ఎక్క‌వు. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ బావుంది. ర‌వివ‌ర్మ‌న్ సినిమాటోగ్ర‌ఫీ ఎక్స‌లెంట్ ప్రతి స‌న్నివేశాన్ని ఓ పెయింటింగ్‌లా త‌న కెమెరాలో బంధించాడు. ముఖ్యంగా లేహ ప్రాంతం, కాశ్మీర్ అందాల‌ను స‌రికొత్త‌గా చూపించారు. అలాగే హీరోయిన్ ఇంట‌డ్ర‌క్ష‌న్ సీన్ కూడా చాలా బావుంది. హంస‌రో సాంగ్.., మై మ‌రుపా సాంగ్స్ పిక్చ‌రైజేష‌న్ బావున్నాయి. సీతారామ‌శాస్త్రి అనువాద సినిమాకు కాకుండా త‌న‌దైన శైళిలో సాహిత్యాన్ని అందించారు. రేపు అనేది లేకుండా పోతే..నిన్న అనేది ఉంటుంది..అందులో నువ్వే ఉంటావు..

చాప‌ర్‌లో కార్తీతో ఎగురుతున్న హీరోయిన్ త‌న అన్న చ‌నిపోయిన విష‌యాన్ని గుర్తుకు తెచ్చుకున్న‌ప్పుడు ఇద్ద‌రం పైకెళ్ళి వెతుకుదామా అనే డైలాగ్‌...ఇలా కిర‌ణ్ సంద‌ర్భానుసారం త‌న పెన్‌కు ప‌నిచెప్పారు. ఇక పాత్ర ప‌రంగా చూస్తే...హీరో కార్తీ పాత్ర కోసం చేసిన హార్డ్ వ‌ర్క్ అంతా తెర‌పై క‌న‌ప‌డింది. కార్తీ వ‌ర్క‌వుట్ చేసి బ‌రువు త‌గ్గి స్లిమ్‌గా క‌న‌ప‌డ్డాడు. అయితే కొన్ని చోట్ల కార్తీ లుక్ ప‌రంగా బాగున్న‌ట్లు క‌న‌ప‌డ‌లేదు. అలాగే మొరెత్తుకొచ్చింది..సాంగ్ లో హైద‌రీ లుక్ కూడా బాలేదు. అయితే న‌ట‌న ప‌రంగా కార్తీ, అదితిరావు హైద‌రీలు చ‌క్క‌గా న‌టించారు. త‌ను మంచి తండ్రిని కాలేన‌ని కార్తీ చెప్పే సంద‌ర్భం..అలాగే అదితిరావుకి కార్తీ సారీ చెప్పే సంద‌ర్బాల్లో ఇద్ద‌రూ మంచి న‌ట‌న‌ను క‌న‌ప‌రిచారు. అలాగే అదితిరావు స్నేహితురాలి పాత్రలో నటించిన రుక్మిణి విజయ్ కుమార్, మిలటరీ డాక్టర్ గా నటించిన ఆర్.జె.బాలాజీ, కల్నల్ పాత్రలో నటించి ఢిల్లీ గణేష్ వారి సహా మిగిలిన అందరూ వారి వారి పాత్రలకు న్యాయం చేశారు. మొత్తం మీద సినిమాలో  కామెడి కనపడదు. కామెడి కోరుకునే ప్రేక్షకులు సినిమాను ఆసాంతం చూడలేరు. అలాగే కమర్షియల్ ఎలిమెంట్స్ లేవు. కాబ‌ట్టి సినిమా అన్నీ వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకోదు.

బోటమ్ లైన్: కొంత మందికి మాత్రమే నచ్చే 'చెలియా'

Cheliyaa English Version Review

Rating : 2.5 / 5.0