Harirama Jogaiah:పవన్‌ను సీఎం చేయాలి, బాబు ఢిల్లీకి పోవాలి.. అలా అయితేనే : జనసేన-టీడీపీ పొత్తుపై హరిరామజోగయ్య వ్యాఖ్యలు
Send us your feedback to audioarticles@vaarta.com
వచ్చే ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు సంబంధించి జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు మరోసారి మద్ధతు ప్రకటించారు కాపు సంక్షేమ సేన నేత , మాజీ మంత్రి చేగొండి హరిరామజోగయ్య. ఆదివారం మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయంలో కాపు సంక్షేమ నేతలతో పవన్ సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హరిరామజోగయ్య హాజరై ప్రసంగించారు. జగన్ పోవాలి...పవన్ రావాలి అనేదే కాపు సంక్షేమ సేన లక్ష్యమన్నారు. కాపు సేన ఏ ఇతర కులాలకు వ్యతిరేకం కాదని.. అయితే జనసేనతో కలిసి పనిచేయాలనేదే తమ అభిమతమని హరిరామజోగయ్య పేర్కొన్నారు. రాష్ట్రాన్ని జగన్ సర్కార్ దోచుకుంటోందని.. నిరంకుశ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని ఆయన పిలుపునిచ్చారు.
లోకేష్‌ను పవన్ ప్రభుత్వంలో భాగస్వామిని చేయాలి :
జగన్‌ను గద్దె దింపాలంటే , పవన్‌ను సీఎం చేయాలంటే చంద్రబాబు ముందుకు రాకతప్పదని హరిరామజోగయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాలని.. లోకేష్‌ను ఏపీలోని సంకీర్ణ ప్రభుత్వంలో భాగస్వామిని చేయాలని ఆయన సూచించారు. టీడీపీ, జనసేన మధ్య సయోధ్య సాధ్యమేనని పెద్దాయన వ్యాఖ్యానించారు. వైసీపీ మాదిరే టీడీపీ వ్యూహాలు పన్నుతోందని.. జనసేనను బలహీనం చేసేందుకు తెలుగుదేశం పార్టీ ప్రయత్నిస్తోందని హరిరామజోగయ్య ఆరోపించారు. కన్నా లక్ష్మీనారాయణ, మహాసేన రాజేశ్ లాంటి వారు జనసేనలో చేరకుండా టీడీపీ అడ్డుకుందన్నారు. చంద్రబాబుకు సీఎం పదవి, జనసేనకు 20 సీట్లు అంటూ తెలుగుదేశం శ్రేణులు సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నాయని హరిరామజోగయ్య ఆరోపించారు. పోరాటం చేయాలని చెబుతూనే.. రాజ్యాధికారం తమ చేతుల్లో వుండాలని అన్నట్లుగా చంద్రబాబు వైఖరి వుందన్నారు. వైసీపీ, టీడీపీలపై పవన్ కల్యాణ్ యుద్ధం ప్రకటించాలని హరిరామజోగయ్య పిలుపునిచ్చారు.
హంగ్ తప్పదంటూ చేగొండి సర్వే:
ఇకపోతే.. కొద్దిరోజుల క్రితం ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయన్న దానిపై హరిరామజోగయ్య సర్వే విడుదల చేశారు. అందులో హంగ్ వస్తుందని ఆయన పేర్కొన్నారు. పవన్ బస్సు యాత్ర మొదలుపెడితే ఒక మాదిరిగా, యాత్ర చేయకుంటే మరోలా ఫలితాలు వుంటాయని జోగయ్య పేర్కొన్నారు. పవన్ జనంలోనే వుండాలని పరోక్షంగా హరిరామజోగయ్య వ్యాఖ్యానించినట్లుగా ఈ సర్వే వుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments