Check Review
కలలో నిజం గొంతెత్తి అరిచినా వినపడదు... అనే పాయింట్‌ను ఆధారంగా చేసుకుని రూపొందించిన సస్పెన్స్ థ్రిల్లర్ 'చెక్'. వైవిధ్యమైన చిత్రాలను తెరకెక్కించే డైరెక్టర్ చంద్రశేఖర్ యేలేటి ఈ సినిమాను డైరెక్ట్ చేశాడు. భీష్మ వంటి కమర్షియల్ హిట్ తర్వాత నితిన్ కొత్త పాయింట్‌తో సినిమా చేయాలని 'చెక్' సినిమాకు ఓకే చేసినట్లు అనిపిస్తుంది. జైలులో తీవ్రవాదిగా ఉరిశిక్షను అనుభవించే ఓ ఖైది అనుకోకుండా చెస్ ఛాంపియన్‌గా ఎదుగుతాడు. అనే పాయింట్‌తో చెక్ సినిమాను తెరకెక్కించినట్లు ట్రైలర్ చూసిన ప్రేక్షకులకు తెలుస్తుంది. అసలు టెర్రరిస్ట్‌కి, చెస్ ఆటకు సంబంధం ఏంటి? అనే క్యూరియాసిటీ ప్రేక్షకుల్లో క్రియేట్ అయ్యింది. మరి ప్రేక్షకుల్ని 'చెక్' సినిమా ఎలా మెప్పించింది? అనే విషయం తెలుసుకోవాలంటే ముందు కథలోకి వెళదాం...
కథ:
ఆదిత్య(నితిన్) ఓ అనాథ. పేర్లు మార్చి చిన్న చిన్న వైట్ కాలర్ మోసాలు చేసి బతుకుతుంటాడు. ఓసారి అనుకోకుండా యాత్ర(ప్రియా ప్రకాశ్ వారియర్)తో పరిచయం ఏర్పడుతుంది. పరిచయం కాస్త ప్రేమగా మారుతుంది. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్న సమయంలో యాత్ర కనిపించకుండా పోతుంది. అదే సమయంలో దేశంలో ఉగ్రదాడి జరుగుతుంది. ఆ దాడిలో నలబై మంది అమాయకులు ప్రాణాలు కోల్పోతారు. ఆ ఉగ్రదాడికి, ఆదిత్యకు సంబంధం ఉందనే ఆధారాలు దొరకడంతో పోలీసులు అరెస్ట్ చేస్తారు. దాడితోసంబంధం ఉన్న మిగతా నలుగురు ఉగ్రవాదులకు వేసిన ఉరిశిక్షనే ఆదిత్యకు కూడా వేస్తారు. అయితే తాను ఏ నేరం చేయలేదని.. కోర్టుకు అప్పీల్ చేస్తాడు ఆదిత్య. జైలు సూపర్‌డెంట్ ఆఫ్ పోలీస్(మురళీశర్మ) మంచి వ్యక్తి కావడంతో ఆయన సహాయంతో లాయర్(రకుల్ ప్రీత్ సింగ్)ను కలుసుకుంటాడు ఆదిత్య. అయితే ముందుగా లాయర్ కూడా ఆదిత్యను ఉగ్రవాదిగానే భావిస్తుంది. అదే సమయంలో అదే జైలులోని ఓ ముసలి ఖైదీ శ్రీమన్నారాయణ(సాయిచంద్) సపోర్ట్‌తో చెస్ నేర్చుకుంటాడు ఆదిత్య. క్రమంలో ఆటపై చాలా పట్టు సాధిస్తాడు. చెస్‌లో స్టార్ ఆటగాళ్లను ఓడించే ఆటగాడిగా మారడమే కాదు.. నేషనల్, కామన్ వెల్త్ ఛాంపియన్‌గా కూడా మారతాడు ఆదిత్య. అదే సమయంలో తాను నిరపరాధినని, తనకు ఉరి శిక్షను రద్దు చేయాలని రాష్ట్రపతికి క్షమాబిక్ష పిటిషన్ పెట్టుకుంటాడు. చెస్‌లో ఆదిత్యకు మంచి పేరు ప్రఖ్యాతులు రావడంతో రాష్ట్రపతి కూడా ఆదిత్యకు క్షమాబిక్ష పెడతాడని అందరూ అనుకుంటారు. ఆ సమయంలో జరిగే ఓ దుర్ఘటనతో మరోసారి ఆదిత్య జీవితం తలకిందులవుతుంది. ప్రభుత్వం ఆదిత్యకు ఉరిశిక్ష వేయాలనుకుంటుంది. అప్పుడు ఆదిత్య ఏం చేస్తాడు? అసలు ఆదిత్యను ఉగ్రదాడిలో ఇరికించిందెవరు? అనే విషయాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.
సమీక్ష:
ప్రారంభం నుంచి వైవిధ్యమైన సినిమాలు చేస్తూ వస్తున్న చంద్రశేఖర్ యేలేటి మరోసారి మరో భిన్నమైన ప్రయత్నాన్ని 'చెక్' సినిమాతో చేసే ప్రయత్నం చేశాడు. జైలులో ఉరిశిక్ష పడ్డ ఖైదీ.. చెస్‌లో ఛాంపియన్‌గా ఎదగడం అనేది కాస్త డిఫరెంట్ పాయింటే. చంద్రశేఖర్ యేలేటి ఈ రెండింటి మధ్య చక్కటి సన్నివేశాలను రాసుకుని సినిమాగా తెరకెక్కించాడు. హీరో ఛాంపియన్‌గా ఎదిగే క్రమంలో అతనిపై కొందరు దాడి చేయడం.. హీరో వారిని కొట్టడం వంటి సన్నివేశాలను, అలాగే చెస్‌లో పోటీ చేస్తూ ఇతరులు ఓడిస్తూ నేషనల్ చెస్ ఛాంపియర్, కామన్‌వెల్త్ చెస్ ఛాంపియన్‌గా ఎదిగే క్రమాన్ని డైరెక్టర్ చక్కగా ఎలివేట్ చేశాడు. అయితే హీరోను ఎవరు? ఎందుకు ఉగ్రదాడిలో ఇరికిస్తారు? అలా చేయడం వల్ల వారికి వచ్చే లాభమేంటి? అనే విషయాలపై క్లారిటీ ఇవ్వలేదు. పాత్రల్లోని డెప్త్‌ను డైలాగ్స్‌తో పూరించే ప్రయత్నమైతే చక్కగానే జరిగింది. కల్యాణి మాలిక్ నేపథ్యం సంగీతం రాహుల్ శ్రీవాత్సవ్ సినిమాటోగ్రఫీ బావున్నాయి. సందర్భానుసారం వచ్చే సంభాషణలు ఆకట్టుకుంటాయి. ఇక నటీనటుల విషయానికి వస్తే పక్కా కమర్షియల్ సినిమాలే చేయాలని కాకుండా నితిన్ డిఫరెంట్ మూవీస్ చేయడానికి మొగ్గు చూపుతాడనడానికి ఇదొక ఉదాహరణగా చెప్పుకోవచ్చు. నితిన్ పాత్రను క్యారీ చేసిన తీరు చక్కగా ఉంది. యాక్షన్ ఎలిమెంట్స్‌లో నితిన్ చక్కగా చేశాడు. ఇక లాయర్ పాత్రలో రకుల్ ప్రీత్ సింగ్, హనీ ట్రాపర్ పాత్రలో ప్రియా ప్రకాశ్ వారియర్ చక్కగా చేశారు. ఇక నితిన్ గురువు పాత్రలో సాయిచంద్ నటన ఆకట్టుకుంటుంది. ఇక మురళీశర్మ, సంపత్ తదితరులు వారి వారి పాత్రలకు న్యాయం చేశారు. ఫస్టాఫ్ ఉన్నంత ఎఫెక్టివ్‌గా సెకండాఫ్ లేదు. సినిమా ఎక్కువ భాగం జైలు, చెస్ ఆట చుట్టూనే తిప్పడంతో కొన్ని సీన్స్ నచ్చకపోవచ్చు. దర్శకుడు ఉన్నట్లుండి సినిమాను పూర్తి చేసి ప్రేక్షకుడికి దర్శకుడు షాకిచ్చాడు. సినిమా ఆరంభంలో ప్రేక్షకుడికి కథలో, పాత్రల్లో ఉన్న సందేహాలను అలాగే వదిలేశారు. అవి తెలియాంటే సీక్వెల్ చూడాల్సిందే అన్నట్లు సినిమాను ముగించారు. మరి సీక్వెల్ ఉంటుందో లేదో చెప్పలేదు.
చివరగా.. చెక్.. ఆట సశేషం
- Read in English