Chandrababu:అసంతృప్తులకు చెక్.. 5 స్థానాల్లో అభ్యర్థులను మార్చిన చంద్రబాబు
- IndiaGlitz, [Monday,April 22 2024]
టీడీపీ తరపున అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు ఆ పార్టీ అధినేత చంద్రబాబు బీ ఫారాలు అందజేశారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమానికి పోటీ చేసే అభ్యర్థులందరూ పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ రాష్ట్ర పునర్నిర్మాణం కోసం అంతా కృషి చేయాలని అభ్యర్థులతో ప్రమాణం చేయించారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై దిశానిర్దేశం చేసిన ఆయన.. పార్టీ గెలుపు కోసం శ్రమించాలని సూచించారు. బీఫారాలు అందుకున్న ప్రతి ఒక్కరూ ఎన్నికల్లో గెలిచి రావాలని పిలుపునిచ్చారు.
మరోవైపు పొత్తుల్లో బాగంగా టీడీపీ 144 అసెంబ్లీ స్థానాలు, 17 ఎంపీ స్థానాలకు గానూ అభ్యర్ధులను ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే టికెట్లు దక్కని నాయకులు చాలా చోట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేశారు. దీంతో 5 చోట్ల అభ్యర్థులను చంద్రబాబు మార్చారు. ఉండి, పాడేరు, మాడుగుల, మడకశిర, వెంకటగిరి స్థానాల్లో మార్పులు చేశారు. ఉండి ఎమ్మెల్యే అభ్యర్థిగా నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజుకు అవకాశం కల్పించగా.. మాడుగుల స్థానం నుంచి బండారు సత్యనారాయణమూర్తిని ఖరారుచేశారు. ఇక పాడేరు నుంచి గిడ్డి ఈశ్వరి, మడకశిర నుంచి ఎంఎస్ రాజు, వెంకటగిరి నుంచి కురుగొండ్ల రామకృష్ణలకు టికెట్లు కేటాయించారు.
ఇక ఉండి నుంచి రఘురామకు ఎమ్మెల్యేగా అవకాశం కల్పించడంతో.. అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న మంతెన రామరాజును నర్సాపురం పార్లమెంట్ టీడీపీ అధ్యక్షుడిగా నియమించారు. మాడుగుల నుంచి పైలా గోవిందరావు స్థానంలో మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తికి టికెట్ కేటాయించారు. పాడేరు టికెట్‌ను గతంలో వెంకట రమేశ్ నాయుడుకు కేటాయించగా తాజాగా మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరికి కేటాయించారు. అలాగే మడకశిర నుంచి సునీల్ కుమార్ స్థానంలో ఎంఎస్ రాజుకు టికెట్ ఇచ్చారు. వెంకటగిరి స్థానాన్ని తొలుత మాజీ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ కుమార్తె లక్ష్మీప్రియకు ఖరారుచేయగా.. తాజాగా రామకృష్ణనే అభ్యర్థిగా బరిలో నిలిపారు.
ఇదిలా ఉంటే అనపర్తి, దెందులూరు స్థానాల్లో అభ్యర్థుల మార్పు విషయంలో ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. అనపర్తి స్థానాన్ని బీజేపీకి కేటాయించడంతో అక్కడ టీడీపీ టికెట్ ఆశించిన మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. అయితే ఆయను బీజేపీ నుంచి పోటీ చేయాలని చంద్రబాబు సూచించారు. ఒకవేళ నల్లమిల్లి బీజేపీ నుంచి పోటీ చేయడానికి సుముఖత వ్యక్తం చేస్తే దెందులూరు నుంచి టీడీపీ తరపున చింతమనేని ప్రభాకర్ పోటీకి ఎలాంటి ఆటంకాలు ఉండవు. ఈ క్రమంలోనే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి బీజేపీ తరఫున పోటీలో ఉంటారని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి స్పష్టంచేశారు.