Mallareddy:మాజీ మంత్రి మల్లారెడ్డిపై చీటింగ్ కేసు నమోదు

  • IndiaGlitz, [Wednesday,December 13 2023]

మాజీ మంత్రి, ప్రస్తుత బీఆర్ఎస్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డిపై పోలీస్ కేసు నమోదైంది. గిరిజనుల భూములు కబ్జా చేశారని ఫిర్యాదు మేరకు 420 చీటింగ్ కేసుతో పాటు ఎస్సీ, ఎస్టీ, అట్రాసిటీ కేసు నమోదు చేశారు పోలీసులు. మేడ్చల్ మల్కాజిరి జిల్లా చింతలపల్లి మండలంలోని కేశవరం గ్రామంలోని సర్వే నెంబర్ 33, 34, 35లో గల 47 ఎకరాల 18 గుటల ఎస్టీల వారసత్వ భూమిని కబ్జా చేశారని భిక్షపతి అనే వ్యక్తి శామీర్‌పేట పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఎన్నికల సమయంలో రాత్రికి రాత్రే భూమి రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని ఆరోపించాడు.

మల్లారెడ్డితో పాటు శామీర్‌పేట ఎమ్మార్వో, ఆయన అనుచరులు శ్రీనివాస్ రెడ్డి, కేశవాపూర్ గ్రామ మాజీ సర్పంచ్ భర్త గోనె హరి మోహన్ రెడ్డి, శామీర్‌పేట్ మండల వ్యవసాయ సహకార సేవా సంఘం చైర్మన్ రామిడి మధుకర్ రెడ్డి, స్నేహ రామిరెడ్డి, రామిడి లక్ష్మమ్మ, రామిడి నేహారెడ్డిలపైనా కేసు నమోదుచేశారు. మరోవైపు ఎమ్మార్వో పాత్రపైనా ఆరా తీస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.

కాగా 2014లో రాజకీయాల్లోకి వచ్చిన మల్లారెడ్డి.. మల్కాజ్‌గిరి నుంచి టీడీపీ ఎంపీగా పోటీ చేసి గెలుపొందారు. అనంతరం బీఆర్ఎస్ పార్టీలో చేరారు. 2018 ఎన్నికల్లో మేడ్చల్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి అయ్యారు. ప్రస్తుతం జరిగిన ఎన్నికల్లోనూ మేడ్చల్ నుంచి మరోసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఈ ఏడాది మొదట్లో పాలమ్మినా, పూలమ్మినా అనే డైలాగ్‌తో మల్లారెడ్డి ఒక్కసారిగా పాపులర్ అయ్యారు. అప్పటి నుంచి ఆయన ఏం మాట్లాడినా, ఏం చేసినా వైరల్ అవుతూనే ఉంది. అయితే ఆయన మంత్రిగా ఉన్నప్పటి నుంచే భూకబ్జా ఆరోపణలు వచ్చాయి. చెరువులను ఆక్రమించి కాలేజీలు కట్టారని ప్రతిపక్ష నేతలు ఆరోపణలు చేసేవారు. ఆ ఆరోపణలు మల్లన్న తీవ్రంగా ఖండించారు. ఇప్పుడు ఏకంగా తమ భూమి కబ్జా చేశారని గిరిజనులు పోలీసులకు ఫిర్యాదుచేయడం తీవ్ర చర్చనీయాంశమైంది.