చంద్రిక మూవీ రివ్యూ
Send us your feedback to audioarticles@vaarta.com
హారర్ సినిమాలకు ప్రేక్షకాదరణ దక్కుతున్న సమయమిది. కాంచన సీరీస్, ప్రేమకథా చిత్రమ్ వంటి సినిమాలన్నీ హిట్ అయిన నేపథ్యంలో ఈ మధ్య తక్కువ బడ్జెట్‌లో ఎక్కువగా హారర్ సినిమాలు వస్తున్నాయి. ఆ కోవలో కన్నడ, తెలుగులో రూపొందిన సినిమా చంద్రిక. కామ్నజెఠ్మలాని టైటిల్ పాత్రలో నటించిన సినిమా ఇది. ఈ సినిమా ఎలా ఉంది? నిజంగా భయపెట్టిందా? లేదా చూద్దాం.
కథ
అర్జున్ (కార్తీక్ జయరామ్) ఆర్టిస్ట్. తన చిత్రలేఖనలను డబ్బులు చేసుకోవడానికి కాకుండా కేవలం ఆత్మసంతృప్తి కోసం అమ్ముకుంటుంటాడు. ఆయన భార్య శిల్ప (శ్రీముఖి). శిల్ప గృహిణి. తన భార్యకు పుట్టినరోజు కానుకగా ఓ హవేలిని కొనిస్తాడు అర్జున్. అందులో కాపురం పెట్టిన తర్వాత అతని జీవితంలోకి అనుకోని సమస్యలు రాసాగుతాయి. ఇంతకీ అతను కొన్న ఆ ఇంటి వల్ల ఏం జరిగింది? ఆ ఇంట్లో ఏం ఉంది? చంద్రిక ఎవరు? చంద్రికకు అర్జున్‌కు ఎలాంటి సంబంధం ఉంది? ఈ ప్రశ్నలతో సెకండాఫ్ సాగుతుంది.
ప్లస్ పాయింట్లు
ఈ సినిమాకు కె.రాజేంద్రబాబు కెమెరా, గుణ్వంత్ సేన్ రీరికార్డింగ్ ప్లస్ పాయింట్లు. శ్రీముఖి తన పాత్రలో వేరియేషన్ బాగా చూపించింది. హీరో మేన్లీగా ఉన్నాడు. తన పాత్రలో చక్కగా ఒదిగిపోయాడు. గిరీష్ కర్నాడ్ యథావిధిగా చక్కగా నటించారు. ఎల్బీ శ్రీరామ్‌ను ఈ సినిమాలో వాడుకోలేదు. సత్యం రాజేష్ తనకిచ్చిన పాత్రలో బాగా చేశాడు. ఆర్ట్ వర్క్ బావుంది. రిచ్‌గా సినిమాను తీయడానికి చేసిన ప్రయత్నం కనిపిస్తుంది.
మైనస్
స్ట్రాంగ్ పాయింట్ లేదు. కథ అల్లుకున్న విధానాన్ని గమనిస్తే చంద్రముఖి సినిమా అట్టే కళ్ళ ముందు కదులుతుంది. పాటలు అసలు బాగోలేవు. పాటలను బాగా తీయడానికి ప్రయత్నించారు. కానీ లిరిక్స్ వింటుంటే నవ్వొస్తుంది. ఎక్కడా మన తెలుగు పాటలను వింటున్నట్టు ఉండదు. కామ్న జఠ్మలాని అందంగా కనిపించడానికి చేసిన ప్రయత్నం నటనలో చేయలేదు. నడిరేయికి రాజతడు.. అనే పదాలు ఎందుకొస్తాయో తెలియదు. ఆ పాటను పాడిన గొంతు వినడానికి బాగోలేదు. శ్రీముఖిలో దెయ్యాన్ని చూపించే సన్నివేశాలు కూడా ఇంపాక్ట్ ని కలిగించవు. ప్రేమకథా చిత్రమ్ లో నందితను చూసినట్టే అనిపిస్తుంది. దర్శకుడు ఇంకాస్త బాగా చేసి ఉండాల్సింది. ఇలాంటి సినిమాలు మలయాళ ప్రేక్షకులను ఆకట్టకుంటాయి. తెలుగులో కష్టమే.
విశ్లేషణ
చంద్రముఖిని చూసిన వారు ఈ సినిమాను చూడక్కర్లేదు. చంద్రముఖి సినిమాను చూసి ఎక్కడా మేం ఆ సినిమా ఛాయలు లేకుండా ఈ సినిమాను జాగ్రత్తగా తెరకెక్కించాం అని ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో శ్రీముఖి చెప్పిన మాటలను నమ్మకూడదు. ఎదురుగా ఉన్న చంద్రిక ఫోటో, చంద్రిక ముందు నిలుచుని చంద్రికలా శిల్ప మారడం, క్లైమాక్స్ సన్నివేశంలో చంద్రిక చనిపోవడానికి ముందు ఆగిన పెళ్ళిని మరలా కంటిన్యూ చేయడం... ఇలాంటివన్నీ అడుగడుగునా చంద్రముఖిని తలపిస్తాయి. కాకపోతే ఆ చిత్రంలో ప్రభు స్నేహితుడుగా రజనీకాంత్ ఆ సమస్యను పోగొడితే, ఇక్కడ హీరో స్నేహితుడిగా సత్యం రాజేష్ పారిపోతాడు. అంతే తేడా. ఎక్కడా కామెడీ లేదు. ఇంటిమసీ సీన్స్ మాత్రం హీరోకి ఇద్దరు హీరోయిన్లతోనూ కనిపిస్తాయి. లిప్ లాక్ అనవసరం. అవన్నీ కమర్షియాలిటీని కొని తెచ్చిపెట్టవన్నది నిజం.
బాటమ్ లైన్: చంద్రిక కేరాఫ్ చంద్రముఖి
రేటింగ్: 2.5/5
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments