జో బైడెన్ గురించి ఆసక్తికర విషయం చెప్పిన చంద్రశేఖర శర్మ
- IndiaGlitz, [Friday,November 06 2020]
అమెరికాలో ఎన్నికల ఫలితాలపై కొనసాగుతున్న ఉత్కంఠకు మరికొద్ది గంటల్లో తెరపడే అవకాశముంది. ఎలక్టోరల్ ఓట్ల లెక్కింపు దాదాపు 45 రాష్ట్రాల్లో పూర్తయింది. అమెరికా అధ్యక్ష పీఠాన్ని అధిరోహించే అవకాశం డెమొక్రాట్ పార్టీ అభ్యర్థి జో బిడెన్‌కే ఎక్కువగా కనిపిస్తోంది. మ్యాజిక్ ఫిగర్‌కు బిడెన్ ఆరు అడుగుల దూరంలో నిలిచారు. బిడెన్‌కు అనుకూలంగా 264 ఎలక్టోరల్ ఓట్లు పోలయ్యాయి. అయితే మ్యాజిక్ ఫిగర్ 270 కావడంతో బిడెన్ విజయానికి కేవలం ఆరు అడుగుల దూరంలో నిలిచారు. 16 ఎలక్టోరల్ ఓట్లు ఉన్న జార్జియా రాష్ట్రంలో బిడెన్ ఆధిక్యంలో కొనసాగుతుండటం ఆయనకు మరింత కలిసొచ్చే అంశం. ఈ రాష్ట్రంలో కౌంటింగ్ ప్రక్రియ దాదాపు పూర్తి కావొస్తోంది.
ఈ సమయంలో బిడెన్ గురించి ఒక ఆసక్తికర విషయం తెలిసింది. ఆ విషయాన్ని చెప్పింది ఎవరో కాదు.. జగిత్యాల జిల్లా ధర్మపురికి చెందిన చంద్రశేఖర శర్మ. ఆయన కాలిఫోర్నియాలోని హనుమాన్ ఆలయ చైర్మన్‌గా ఉన్నారు. తాజాగా చంద్రశేఖర శర్మ.. జో బైడెన్‌తో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. జో బైడెన్ గురించి శర్మ మాట్లాడుతూ.. హిందూ సంప్రదాయాలపై బైడెన్‌కు ఎంతో గౌరవం ఉందని వెల్లడించారు.
2001లో అమెరికా వెళ్లటంలో తనకు చాలా సమస్యలు ఎదురయ్యాయని, వీసా రావటంలో జాప్యం జరిగిందని చంద్రశేఖర శర్మ వెల్లడించారు. ఆ సమయంలో జో బైడెన్ తనకు ఎంతగానో సహకరించారని తెలిపారు. 2003లో విల్మింగ్టన్ మహాలక్ష్మి ఆలయంలో కుంభాభిషేకం నిర్వహించామని.. ఆ కార్యక్రమానికి కూడా బైడెన్ హాజరయ్యారని తెలిపారు. ఆ సమయంలోనే బైడెన్ హిందూ సంప్రదాయాల గురించి తెలుసుకోవడంతో పాటు తిలకం కూడా పెట్టుకున్నారని చంద్రశేఖర శర్మ వెల్లడించారు.