CM Jagan:చంద్రబాబు భార్య కుప్పంలో బైబై అంటున్నారు.. ఒంగోలులో సీఎం జగన్ సెటైర్లు..

  • IndiaGlitz, [Friday,February 23 2024]

ఎన్నికలకు మనం సిద్ధం అంటుంటే.. మరోవైపు చంద్రబాబు భార్య మా ఆయన సిద్ధంగా లేడు అంటున్నారని సీఎం జగన్ సెటైర్లు వేశారు. ఏకంగా సొంత నియోజకవర్గం కుప్పంలోనే ఆమె అర్ధాంగి నోటే పంచ్ డైలాగ్‌లు వస్తున్నాయని తెలిపారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేసే కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ చివరకు చంద్రబాబును కుప్పంలో ఉన్న ప్రజలు కూడా సమర్థించని పరిస్థితి నెలకొందన్నారు. చంద్రబాబును సమర్ధించేవారు ఎవరంటే.. ఏనాడూ ఏపీకి రానివారు.. ఏనాడూ ఏపీలో లేనివారు.. రాష్ట్రంలో ఓటు లేనివారు.. రాష్ట్రంలో దోచుకోవటం.. దోచుకున్నది పంచుకోవటం.. దీనికి అలవాటు పడిన వారు మాత్రమే చంద్రబాబును సమర్థిస్తున్నాని పేర్కొన్నారు.

తనకు చంద్రబాబు మాదిరి నాన్ రెసిడెన్స్ ఆంధ్రా వాళ్ల మద్దతు లేదని.. దత్తపుత్రుడు తోడు అంతకన్నా లేదన్నారు. కానీ మీ అందరిని కోరేది ఒక్కటేనని తన ప్రభుత్వంలో మీ ఇంట్లో మీకు మంచి జరిగి ఉంటే మీరే నాకు తోడుగా నిలవాలని ప్రజలను కోరారు. పైన దేవుడిని నమ్ముకున్నాను.. కింద మిమ్మల్ని నమ్ముకున్నాను.. మధ్యలో బ్రోకర్లు, దళారులను నమ్ముకోలేదని జగన్ చెప్పుకొచ్చారు. 100 మంది సినిమా విలన్ల దుర్మార్గం కంటే, పురాణాల్లో రాక్షసుల దుర్మార్గం కంటే చంద్రబాబు దుర్మార్గమే ఎక్కువ అంటూ జగన్ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.

తమ ప్రభుత్వంలో ఎన్నో మంచి కార్యక్రమాలు అమలు చేశామన్నారు. ఇందులో భాగంగా దేశ చరిత్రలో ఇంత పెద్ద మొత్తంలో పట్టాలు ఇవ్వడం ఇదే తొలిసారి అన్నారు. గత ప్రభుత్వానికి, మన ప్రభుత్వానికి తేడాను చూడాలన్నారు. పేదలకు ఒక నిబంధన, పెద్దలకు మరో నిబంధన ఉండటం సరికాదన్నారు. గత ప్రభుత్వంలో ఎప్పుడైనా పేదల గురించి ఆలోచించారా..? చంద్రబాబు పేదలకు ఒక్క ఇంటి స్థలం కూడా ఇవ్వలేదని మండిపడ్డారు. మంచి కోసం యజ్ఞం చేస్తుంటే రాక్షసులు అడ్డుకున్నట్లు.. పేదలకు ఇంటి స్థలం ఇస్తుంటే అడ్డుకుంటూ కేసులు వేస్తున్నారని జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇళ్ల స్థలాల పంపిణీని అడ్డుకునేందుకు కోర్టులో కేసులు వేశారని.. వారు ఎంతకు తెగించినా, ఎంతగా దిగజారినా, ఎలాగైనా నిరుపేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలన్న సంకల్పంతో రైతులు దగ్గర భూమి సేకరించి పేదలకు ఇస్తున్నామన్నారు.

వైసీపీ అధికారంలోకి రాకముందు పేదలకు ప్రభత్వ బడులు.. డబ్బున్న వారికి ప్రైవేట్ స్కూల్స్ లో ఇంగ్లీష్ మీడియా చదువులు ఉండేవని, ఇప్పుడు పేద పిల్లలకు ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియంలో బోధన అందిస్తున్నామని చెప్పారు. పేద విద్యార్థులకు ప్రభుత్వ స్కూళ్లలో నాణ్యమైన విద్యను అందించేందుకు బైజూస్ కంటెంట్ తీసుకొచ్చామని, 8వ తరగతి పిల్లలకు ట్యాబ్‌లు, డిజిటల్ బోధన అందిస్తున్నామని, విద్యార్థులకు ఫీజు రీయింబర్స్ మెంట్ ఇస్తున్నామని వెల్లడించారు. వైద్య, ఆరోగ్య రంగంలోనూ విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చామని.. గతంలో ధనికులకు మాత్రమే కార్పొరేట్ వైద్యం అందేదన్నారు. ఇప్పుడు ఆరోగ్య శ్రీ ద్వారా రూ. 25లక్షల వరకు వైద్య సేవలు ఉచితంగా అందిస్తున్నామని తెలిపారు. పేద మహిళల సాధికారత కోసం వైఎస్ఆర్ ఆసరా, సున్నా వడ్డీ, చేయూత, అమ్మఒడి పథకాలు తీసుకొచ్చామని పేర్కొన్నారు. మీ ఇంట్లో మంచి జరిగితేనే ప్రభుత్వానికి మరోసారి అండగా నిలవాలని జగన్ విజ్ఞప్తి చేశారు.