ఈ భారీ ప్లాన్స్‌తోనే చంద్రబాబు మళ్లీ గెలుస్తారా!

  • IndiaGlitz, [Saturday,January 12 2019]

ఆంధ్రప్రదేశ్‌‌కు మరోసారి సీఎం అవ్వడానికి సీఎం చంద్రబాబు నాయుడు భారీ ప్లాన్ వేస్తున్నారు.! అందుకే ఎన్నికలు ఇంకా మూడునెలలు ఉండగానే తిన్నగా ప్రజలను ప్రసన్నం చేసుకుని పడ్డ ఆయన కనీవినీ ఎరుగని వరాల వర్షం కురిపిస్తున్నారు. 2014 ఎన్నికల్లో బాబొస్తే.. జాబోస్తుంది.. అమరావతి కట్టడానికి అనుభవజ్ఞుడు కావాలి.!.. డ్వాక్రా, రైతుల రుణమాఫీ చేస్తానని ఇలా ఎన్నో పెద్ద పెద్ద హామీలిచ్చిన ఆయన ఎంత మేరకు అమలు చేశారన్నది ఆ పెరుమాళ్లకు, తెలుగు తమ్ముళ్లకే ఎరుక. కాగా తాజాగా బాబు వేస్తున్న ఎత్తులు, వ్యూహాలు, ఉచిత హామీలేంటనే విషయాలపై ఇప్పుడు చూద్దాం.

సంక్రాంతి తర్వాత రుణమాఫీ..!
ఇప్పటికే చాలా మంది రైతులకు దశలవారీగా రుణమాఫీ చేశాను.. ఇచ్చిన హామీలతో పాటు ఇవ్వని హామీలను కూడా అమలు చేశానని చంద్రబాబు చెప్పుకుంటున్నారు. అయితే ఇప్పటి వరకూ రూ. 24వేల కోట్లు రుణమాఫీ చేశామని చెప్పిన ఆయన.. మిగిలినది సంక్రాంతి తర్వాత మాఫీ చేస్తామని ఇటీవల శ్రీకాకుళంలో జరిగిన జన్మభూమి కార్యక్రమంలో హామీ ఇచ్చారు. తన గెలుపుకు కారణమైన ఉభయ గోదావరి జిల్లాలు మొదలుకుని గుంటూరు, విజయవాడ రైతన్నలు సైతం చంద్రబాబు తీవ్ర ఆగ్రహంతో రగిలిపోతున్నారు. గోదావరి జిల్లాల్లో ఆక్వా, పోలవరం కొరకు భూసేకరణ చేపట్టడంతో మూడు పంటలు పండించే భూమిని కోల్పోయామన్న బాధతో వారు ఉన్నారు. ఇక గుంటూరు, విజయవాడ విషయానికొస్తే అమరావతి నిర్మాణం కోసం వందలు పక్కనపెట్టి లక్షల ఎకరాలు భూసేకరణతో లాక్కున్నారని రైతులు ఆగ్రహంతో రగిలిపోతున్నారు.! అయితే ఈ క్రమంలో ఎక్కడ మొదటికి మోసం వస్తుందో అని చంద్రబాబు రుణమాఫీ డ్రామా మరోసారి కొడుతున్నారని వైసీపీ పార్టీ నేతలు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతున్నారు. కాగా ఇంత వరకూ డ్వాక్రా రుణమాఫీ గురించి చంద్రబాబు మాట్లాడిన.. ఆ రంగాన్ని పట్టించుకున్న దాఖాల్లేవనే చెప్పుకోవాలి. అయితే సంక్రాంతి తర్వాత బాబు ఏ మేరకు మాఫీ చేస్తారో చూడాలి.

ప్రతీ పేదోడికీ ఇళ్లు..!
రాష్ట్రంలో రూ.83వేల కోట్లతో పేదలకు 30 లక్షల ఇళ్లు నిర్మించి ఇస్తున్నామని.. త్వరలో మళ్లీ ఇంకా ఏర్పాటు చేస్తామని ప్రజలకు బాబు హామీ ఇచ్చారు. అంతటితో ఆగని ఆయన.. సొంత ఇల్లులేని ప్రతీ ఉద్యోగికి గృహవసతి కల్పిస్తామని ఎంప్లాయిస్‌కు బాబు భరోసా ఇచ్చారు. అయితే బాబు చెబుతున్నట్లుగానే.. 2014 ఎన్నికల నుంచి ఇప్పటి వరకూ ఎందుకు పేదోడికి పూర్తి స్థాయిలో ఇళ్లు నిర్మించివ్వలేదు..? మీరు ఇళ్లు నిర్మిస్తామంటే జగన్, పవన్ వద్దన్నారా..? ఇంకెవరైనా వద్దన్నారా..? అనేది ఆ చంద్రబాబుకు తెలియాలి. మరి ఎన్నికలు సమీపిస్తున్న వేళ పేదలు, ఉద్యోగులకు ఏ మాత్రం ఇళ్లు నిర్మించి సీఎం సొంతింటి కల నెరువేస్తారో వేచి చూడాల్సిందే.

ప్రతి ఇంటికీ స్మార్ట్ ఫోన్..!
ఇటీవల శ్రీకాకుళం సభలో చంద్రబాబు మాట్లాడుతూ.. త్వరలో ప్రతి ఇంటికి స్మార్ట్ ఫోన్ ఇచ్చే పథకానికి శ్రీకారం చుడతామన్నారు. అప్పుల్లో రైతులు, ఉద్యోగాల్లేక నిరుద్యోగులు, ఆరోగ్య శ్రీ లేక రోగులు, ఇలా ఏ వర్గానికి ఆ వర్గం ఏం చేయాలో దిక్కతోచక తలలు పట్టుకుంటున్నారు. చంద్రబాబు మాత్రం ప్రత్యామ్నాయ మార్గాలు చూపకుండా.. అది ఇస్తాం.. ఇది ఇస్తాం.. అన్నీ మేమే ఇచ్చేస్తామంటూ కొత్త కొత్త మాటలు మాట్లాడుతున్నారు. పోనీ మీరిచ్చే స్మార్ట్ ఫోన్ ఒక్కొక్కటి ఏ నాలుగో, ఐదు వేలు అనుకున్నా.. అదే డబ్బులు తెలంగాణలో మాదిరిగా ‘రైతుబంధు’గా రైతన్నలుకు ఇస్తే బాగుపడతారు కదా..? పోనీ అదే డబ్బును పేదవాడి ఖాతాలో వేయొచ్చు. తద్వారా పంట పండించే రైతుకిస్తే ఎరువులు, దున్నకాలు లాంటి చిన్న పన్నులు చేసుకుంటారు కదా.. ఇవన్నీ బేరీజు చేసుకున్న తర్వాత స్మార్ట్ ఫోనే ముఖ్యమంటే ఆ తర్వాత మీ ఇష్టం ప్రకారం చేస్కోండని నెజిన్లు, యువకులు సలహా ఇస్తున్నారు.

ఈ లెక్కలు ఎంత మాత్రం నమ్మొచ్చు..!
వ్యవసాయంలో 11 శాతం వృద్ధి చెందామని.. రూ. 1.30 కోట్ల మందికి భూ ఆరోగ్య కార్డులు ఇప్పటి వరకూ పంపిణీచేసినట్టు చేసినట్లు స్వయాన చంద్రబాబు చెప్పారు. ఆదరణ పథకంపై 64% మందికి.. పింఛన్లపై 72%, తాగునీటిపై 49%, ఉపాధి హామీ పథకంపై 43%, రుణమాఫీపై 57% మంది ప్రజలు సంతృప్తి వ్యక్తంచేస్తున్నారని చంద్రబాబు చెప్పుకొచ్చారు. అయితే ఇవి ఏ లెక్కన చెప్పారో చంద్రబాబుకే చెల్లుతుందని నెటిజన్లు, క్రిటిక్స్ విమర్శల వర్షం కురిపిస్తున్నారు.

ఇక ఇవన్నీ అటుంచితే చంద్రబాబుకు సపోర్టు చేసే మీడియా మాధ్యమాలు ఎలాగూ ఉన్నాయి. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఒకట్రెండు సార్లు సర్వేలు చేయించిన బాబు ఈ ఎన్నికల్లో ఎలాగైనా సరే ఈ సారి మళ్లీ సీఎం పీఠం కైవసం చేసుకోవాలని తహతహలాడుతున్నారు. ఇందుకోసం ఇప్పటికే కొన్ని భారీ ప్లాన్స్ చెప్పకనే చెప్పిన చంద్రబాబు.. మేనిఫెస్టోలు ఇంకా ఎన్ని బాంబులు పేలుస్తారో..! ఇవన్నీ అటుంచితే 2014 ఎన్నికల్లో ఫలితాలు 2019 ఎన్నికల్లో వైసీపీకి రాబోతున్నాయా..? టీడీపీకి రాబోతున్నాయా..? జనసేనకు రాబోతున్నాయా..? అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే మరి. అయితే ఎవరి వ్యూహాల్లో వాళ్లుగా ఉంటూ ఎన్నికలనే యుద్ధక్షేత్రంలో తలపడుతున్నారు. మొత్తానికి చూస్తే ఈ సారి ఎన్నికలు ప్రతి ఒక్కరికీ ప్రతిష్టాత్మకంగా తీసుకునే అధికార, ప్రతిపక్ష పార్టీల నేతలు రంగంలోకి దిగారు. అయితే 2019 చంద్రబాబుదా..? జగన్‌‌దా..? లేకుంటే పవన్‌‌దా అనేది తెలియాలంటే ఎన్నికల కౌంటింగ్ వరకు వేచి చూడాల్సిందే.

More News

జనసేనలో చేరికపై భూమా అఖిల స్పందన

తెలుగుదేశం పార్టీపై తిరుగుబాటు చేస్తున్న భూమా కుటుంబం త్వరలోనే జనసేనలో చేరుతుందని పెద్ద ఎత్తున వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.

రాజ్ కందుకూరి చేతుల మీదుగా 'రావే నా చెలియా' లోగో లాంచ్

సూర్య చంద్ర ప్రొడక్షన్ లో నెమలి సురేశ్ సమర్పణలో నెమలి అనీల్, నెమలి శ్రవణ్ నిర్మాతలు గా నెమలి అనిల్, సుబాంగి పంథ్ హీరో హీరోయిన్లుగా

చంద్రబాబుపై కొడాలి నాని వివాదాస్పద వ్యాఖ్యలు

టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబుపై వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని  వివాదాస్పద  వ్యాఖ్యలు చేశారు.

వైసీపీ సీక్రెట్స్‌ పై బాంబు పేల్చిన జనసేనాని!

వైఎస్ జగన్- పవన్‌ను ఒక్కటి చేయడానికి కొందరు నేతలు భగీరథ ప్రయత్నాలు చేస్తున్నారా..?. 2014 ఎన్నికల్లో టీడీపీని గెలిపించడానికి కారణమైన పవన్‌‌తో ఈ ఎన్నికల్లో జగన్‌‌‌కు పనిపడిందా..?

ఇప్పుడు వ‌ర్మ మొద‌లెట్టాడుగా!

మొన్న‌టి వ‌ర‌కు య‌న్‌.టి.ఆర్ బ‌యోపిక్‌లో తొలి భాగం `య‌న్.టి.ఆర్ క‌థానాయ‌కుడు`కి సంబంధించిన ప్ర‌మోష‌న్స్‌, ఫ‌స్ట్ లుక్స్‌, టీజ‌ర్స్‌తో తెలుగు ప్రేక్ష‌కులు నిండా మునిగిపోయారు.