Chandrababu:ఢిల్లీకి చంద్రబాబు.. బీజేపీతో పొత్తుపై చర్చించేందుకేనా..?
Send us your feedback to audioarticles@vaarta.com
ఏపీలో రాజకీయాలు రోజురోజుకు కీలక మలుపులు తిరుగుతున్నాయి. ఇప్పటికే టీడీపీ-జనసేన పొత్తులో ఉన్న సంగతి తెలిసిందే. అయితే తమతో బీజేపీ కూడా కలిసి వస్తుందని చంద్రబాబు, పవన్ కల్యాణ్ భావించారు. కానీ బీజేపీ పెద్దల నుంచి గ్రీన్ సిగ్నల్ రాలేదు. దీంతో ఇరు పార్టీలు కలిసి ఎన్నికలకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే సీట్ల సర్దుబాటుపై ఓ అంచనాకు కూడా వచ్చాయి. అయితే ఇప్పుడు ఉన్నట్లుండి టీడీపీ చీఫ్ చంద్రబాబు ఢిల్లీకి వెళ్లనున్నారు. బుధవారం రాత్రి హస్తినకు వెళ్లి కేంద్ర పెద్దలతో సమావేశం కానున్నారు. అనంతరం పవన్ కల్యాణ్ కూడా ఢిల్లీ వెళ్లి పొత్తులపై చర్చించనున్నారు.
ఈ సమావేశాల తర్వాత పొత్తులపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. పొత్తుకు అంగీకారం తెలిపితే మాత్రం రాష్ట్రంలో 2014 ఎన్నికలు మళ్లీ రిపీట్ కానున్నాయి. అప్పుడు కూడా మూడు పార్టీలు కలిసి ఎన్నికలకు వెళ్లాయి. ఆ ఎన్నికల్లో ఘన విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. ఈసారి కూడా అదే విధంగా ఎన్నికల్లో గెలవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. జనసేనాని తొలి నుంచి బీజేపీ తమతో కలిసిరావాలని కోరుతున్నారు. అయితే పొత్తు పెట్టుకోవాలంటే టీడీపీ తమను సంప్రదించాలని బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ వ్యాఖ్యానించారు.
అనంతరం పొత్తులపై బీజేపీ నేతలు తమ అభిప్రాయాలను అధిష్టానానికి పంపారు. 90 శాతం మంది నేతలు పొత్తులకు అనుకూలంగా ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో టీడీపీతో పొత్తు పెట్టుకోవడమే మంచిదని బీజేపీ ముఖ్య నేతలు భావిస్తున్నారట. దీంతో హైకమాండ్ కూడా పొత్తుకే మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. అందుకే చంద్రబాబుకు ఢిల్లీ రావాలని పిలుపు వచ్చినట్లు చెబుతున్నారు. అటు ఎన్డీఏ కూటమిలో మళ్లీ చేరాలని చంద్రబాబు కూడా కొంతకాలంగా ప్రయత్నిస్తూనే ఉన్నారు.
జగన్‌కు చెక్ పెట్టాలంటే కేంద్ర పెద్దల మద్దతు అవసరమని భావిస్తున్నారు. ప్రజల్లో ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఉందనే విషయాన్ని వారి దృష్టికి తీసుకెళ్లనున్నారట. మరి ఢిల్లీ పర్యటన తర్వాత పొత్తులపై క్లారిటీ రానున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కాగా 175 అసెంబ్లీ స్థానాల్లో జనసేనకు 25-30 సీట్లు, బీజేపీకి 10 సీట్లు ఇచ్చే ఛాన్స్‌లు ఉన్నాయంటున్నారు. అలాగే 25 ఎంపీ స్థానాల్లో జనసేనకు 3, కమలం పార్టీకి 2 ఎంపీ స్థానాలు కేటాయిస్తారని టాక్. పొత్తులపై స్పష్టత రాగానే సీట్లను ప్రకటించే అవకాశం ఉంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout