Chandrababu:తెలంగాణ ఎన్నికల ఫలితాలపై చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
- IndiaGlitz, [Friday,December 08 2023]
టీడీపీ అధినేత చంద్రబాబు తెలంగాణ ఎన్నికల ఫలితాలపై పరోక్షంగా స్పందించారు. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్న ఆయన వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో ప్రభుత్వం అహంకారంగా వ్యవహరిస్తుందని.. అహంకారంతో ప్రవర్తిస్తే ఏం జరుగుతుందో తెలంగాణలో చూశామని వ్యాఖ్యానించారు. 40 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్న తాను ఎక్కడా ఒక్క తప్పు కూడా చేయలేదన్నారు. అలాంటిది ఏ తప్పు చేయకపోయినా అరెస్ట్ చేశారని.. చేయని తప్పుకు ఎంతో క్షోభ అనుభవించానని వాపోయారు. తాను కూడా మనిషినేనని.. తనకు కూడా ఓ మనస్సు ఉంటుందని తెలిపారు. ప్రజాస్వామ్యంలో ఒక్క తప్పు జరిగినప్పుడు ఎవరికైనా ప్రశ్నించే హక్కు ఉంటుందని.. అలా చేయకూడదని విర్రవీగితే ఏం జరుగుతుంతో తెలంగాణలో చూశామన్నారు. మరో మూడు నెలల్లో ఏపీలో కూడా చూస్తామని బాబు పేర్కొన్నారు.
ఉమ్మడి గుంటూరు జిల్లా తెనాలి, వేమూరు, బాపట్ల నియోజకవర్గాల్లో ప్రస్తుతం ఆయన పర్యటన సాగుతోంది. ఈ సందర్భంగా తెనాలి వెళ్తూ మార్గమధ్యంలో రేవేంద్రపాడు వద్ద రైతులతో మాట్లాడారు. తుఫాన్ సాయం విషయంలో సీఎం జగన్ హడావుడి తప్ప ఏం లేదని విమర్శించారు. తాను రైతులను పరామర్శించడానికి వెళ్తున్నానని తెలిసి, సీఎం హడావుడిగా తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్నారని ఎద్దేవా చేశారు. రైతుల కష్టాలను దగ్గరుండి తెలుసుకోవాల్సిన మంత్రులు ఎక్కడ ఉన్నారని ప్రశ్నించారు. తాను పంట నష్ట పరిహారం పెంచుకుంటూ వెళ్తుంటే జగన్ తగ్గించుకుంటూ వస్తున్నారని మండిపడ్డారు. కనీసం పంట బీమా కూడా చెల్లించలేని దుస్థితిలో ప్రభుత్వం ఉందన్నారు.
వరి పంట నష్టపోయిన రైతులకు హెక్టారుకు రూ.30,000, ఆక్వా రైతులకు రూ.50,000, అరటికి రూ.40,000, చెరకు పంటకు రూ.30,000, పత్తి, వేరుశనగకు రూ.25,000, జొన్న, మొక్కజొన్న, అపరాలు, పొద్దు తిరుగుడుకు రూ.15 వేలు, జీడి పంటకు రూ.50 వేల చొప్పున ప్రభుత్వం పరిహారం ఇవ్వాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. కాగా స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్టైన చంద్రబాబుకు హైకోర్టు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. దీంతో దాదాపు మూడు నెలల అనంతరం చంద్రబాబు పూర్తి స్థాయి రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.