Chandrababu: టీడీపీ-జనసేన కూటమి సూపర్ హిట్.. వైపీపీ పాలన అట్టర్ ఫ్లాప్: చంద్రబాబు
Send us your feedback to audioarticles@vaarta.com
టీడీపీ-జనసేన కూటమి సూపర్ హిట్ అని.. వైపీపీ పాలన అట్టర్ ఫ్లాప్ అంటూ టీడీపీ అధినేత చంద్రబాబు తెలిపారు. తాడేపల్లిగూడెంలో నిర్వహించిన ‘తెలుగుజన విజయ కేతనం’ జెండా భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభకు జనసేన అధినేత పవన్ కల్యాణ్‌తో పాటు ఇరు పార్టీలకు చెందిన కీలక నేతలు, కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఈ సభలో చంద్రబాబు మాట్లాడుతూ వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ కోసమే టీడీపీ, జనసేన పార్టీలు కలిశాయని తెలిపారు. కూటమిలో ఎవరు ఎక్కువ.. తక్కువ కాదని స్పష్టం చేశారు.
టీడీపీ-జనసేన దెబ్బకు ఫ్యాన్ ముక్కలై పోవాలని... పొత్తు గెలవాలి.. రాష్ట్రం నిలవాలని పిలుపునిచ్చారు. కూటమి విన్నింగ్ టీమ్.. వైసీపీది చీటింగ్ టీమ్ అన్నారు. తెలుగుదేశం పార్టీ అనే అగ్నికి పవన్ కల్యాణ్ వాయువులా తోడయ్యారని పేర్కొన్నారు. ఈ సభ చూశాక తమ గెలుపు ఎవరూ ఆపలేరని అర్థమైందని ధీమా వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ ఇక అన్‌స్టాపబుల్.. రాష్ట్రంలో విధ్వంసానికి ఫుల్స్టాప్ పడుతుందన్నారు.
హైదరాబాద్ కంటే మిన్నగా ఉండాలని అమరావతి రాజధానికి ప్రణాళిక సిద్ధం చేశామని.. కానీ జగన్ సీఎం అయ్యాక అరాచకపాలనతో నాశనం చేశారని మండిపడ్డారు. జగన్ ఎంత అహంకారి అంటే మహానటుడు చిరంజీవి, మహాదర్శకుడు రాజమౌళిని సైతం అవమానించారని మండిపడ్డారు. వైసీపీ వేధింపులు తట్టుకోలేక క్రికెటర్ హనుమ విహారి రాష్ట్రం నుంచి పారిపోయే పరిస్థితి వచ్చిందని మండిపడ్డారు. అలాగే మాస్క్ అడిగినందుకు దళితుడైన డాక్టర్ సుధాకర్‌ను పిచ్చోడు అని ముద్రవేసి మానసికంగా చంపేశారని ఫైర్ అయ్యారు. సొంత బాబాయ్‌ని చంపేశారని.. సొంత చెల్లెలు షర్మిలను సైతం తరిమేశారని చంద్రబాబు విమర్శించారు.
కుప్పం ప్రాంతానికి వెళ్లి నీళ్ల పేరిట జగన్ నాటకాలు వేశారని.. ఒక్క రోజులోనే అంతా సర్దుకొని పోయారని ఎద్దేవా చేశారు. వచ్చే ఎన్నికల్లో కుప్పం నియోజకవర్గంలో తనకు లక్ష ఓట్ల మెజార్టీ వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. జగన్ పాలన ఒక అట్టర్‌ఫ్లాప్ సినిమా అని అలాంటి సినిమాకి సీక్వెల్ ఉంటుందా?అని ప్రశ్నించారు. వైసీపీ గూండాలకు సినిమా చూపిస్తామని.. వైనాట్ 175 కాదు.. వైనాట్ పులివెందుల? అన్నారు. రాష్ట్రాన్ని ఎలా నాశనం చేయాలో జగన్ వద్ద స్కెచ్ ఉంటే.. రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేయాలో తమ వద్ద బ్లూప్రింట్ ఉందని తెలిపారు. కూటమి వల్ల కొందరు నేతలు ఇబ్బంది పడి ఉండొచ్చు.. కానీ పార్టీ కోసం పనిచేసిన అందరికీ న్యాయం చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు.
ఏ సీఎం అయినా అభివృద్ధి పనులతో పాలన సాగిస్తారని.. కానీ జగన్ సీఎం అయ్యాక అరాచకలతో పాలన సాగిస్తున్నారని ధ్వజమెత్తారు. వచ్చే ఎన్నికలు రాష్ట్ర భవిష్యత్‌కు ఎంతో కీలకమని.. వైసీపీ దొంగలపై టీడీపీ-జనసేన కార్యకర్తలు కలిసి పోరాడాలని సూచించారు. రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం కుదిర్చిన పొత్తు తమదని.. రాష్ట్ర పునర్నిర్మాణం కోసం ప్రజలు తమతో చేతులు కలపాలన్నారు. రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్న వైసీపీని వచ్చే ఎన్నికల్లో చిత్తుగా ఓడించి సైకో జగన్ నుంచి రాష్ట్రానికి విముక్తి కల్పించాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments