కేసీఆర్ మాకు మిత్రుడే.. చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు!
Send us your feedback to audioarticles@vaarta.com
బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు వ్యతిరేకంగా ఫెడరల్ ఫ్రంట్‌ను ఏర్పాటుకై టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ ప్రయత్నాలు మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. ఇప్పటికే దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాలకు వెళ్లిన ఆయన.. పలు ప్రాంతీయ పార్టీల అధినేతలు, ముఖ్యమంత్రులను కలిశారు. ఇక అసలు విషయానికొస్తే... శుక్రవారం సాయంత్రం కేంద్ర ఎన్నికల సంఘాన్ని టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు నాయుడు కలిశారు.
చంద్రగిరి రీపోలింగ్ అంశంపై ఫిర్యాదు చేశారు. ఆరోరాతో భేటీ అనంతరం చంద్రబాబు మీడియాతో మాట్లాడిన ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ వచ్చినా ఆహ్వానిస్తారా..? అని మీడియా మిత్రులు చంద్రబాబును ప్రశ్నించగా.. బీజేపీని వ్యతిరేకించే వారంతా మా మిత్రులేనని.. ఎవరు కలిసొచ్చినా కలుపుకుని వెళతామని చంద్రబాబు తేల్చిచెప్పారు. కేంద్రంలో బీజేపీయేతర ప్రభుత్వ ఏర్పాటుకు చేయాల్సినవన్నీ చేస్తామని చెప్పుకొచ్చారు. సో.. కేసీఆర్ మాకు మిత్రుడేనని పరోక్షంగా చంద్రబాబు చెప్పుకొచ్చారన్న మాట.
రీ పోలింగ్ గురించి...!
ఏపీలో ఎన్నికలు జరిగిన 34 రోజుల తర్వాత రీపోలింగ్‌కు ఆదేశాలు ఎలా జారీచేస్తారని ఈసీని నిలదీశామన్నారు. పోలింగ్ జరిగిన తర్వాత రోజు రిటర్నింగ్ అధికారి ఇచ్చే నివేదిక ఆధారంగా రీపోలింగ్ ప్రకటన చేస్తారని.. కానీ, నెలరోజుల తర్వాత ప్రతిపక్ష పార్టీ ఫిర్యాదు చేస్తే ఏపీలో ఐదు చోట్ల రీపోలింగ్‌కు ప్రకటన చేయడం దారుణమని బాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మేం కొన్ని చోట్ల రీపోలింగ్ జరపాలని విజ్ఞప్తి చేసినా పట్టించుకోలేదంటూ ముఖ్యమంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఎన్నో రాజకీయాలను చూశాను కానీ ఇలాంటి ఎన్నికల సంఘాన్ని ఎప్పుడూ చూడలేదన్నారు. ప్రధాని మోదీ, అమిత్ షాల కనుసన్నల్లోనే ఈసీ నడుచుకుంటోందని.. ఈసీ పనితీరుకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేయాల్సిరావడం విచారించాల్సిన విషయమన్నారు.
ద్వివేదికి కళ్ళు కనిపించడం లేదా..?
"టీడీపీ ఫిర్యాదులను ఈసీ పట్టించుకోలేదు. ద్వివేదికి కళ్ళు కనిపించడం లేదా..? టీడీపీ ఫిర్యాదులను పట్టించుకోరా?. వైసీపీ ఫిర్యాదులపై ఈసీ వెంటనే స్పందిస్తోంది. ఎన్నికలు జరిగిన 25 రోజుల తర్వాత రీపోలింగ్‌కు ఆదేశించడమేంటి?. ఈసీ నిర్ణయాలు వివాదాస్పదంగా ఉంటున్నాయి. టీడీపీ డిమాండ్ చేసిన చోట్ల రీపోలింగ్ జరపడం లేదు. నా పోరాటం ఈసీపై కాదు..ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం నా పోరాటం. బీజేపీకి వ్యతిరేకంగా ఎవరు కలిసివచ్చినా కలుపుకొని వెళ్తాం. గాంధీని ప్రజ్ఞాసింగ్ అవమానించినా ఈసీ చర్యలు తీసుకోలేదు. ప్రధాని తీరు ఆయన బలహీనతను సూచిస్తోంది" అని చంద్రబాబు చెప్పుకొచ్చారు.
మొత్తానికి చూస్తే.. చంద్రబాబు, కేసీఆర్ ఒక్కటయ్యే అవకాశాలు మెండుగానే ఉన్నాయన్న మాట. అయితే చంద్రబాబు మాత్రం కాంగ్రెస్‌తో కలిసి వెళ్తుండగా.. కేసీఆర్ మాత్రం కాంగ్రెస్ అంటే దూరం.. దూరం అంటున్నారు. ఈ తరుణంలో చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అయితే ఈ వ్యాఖ్యలపై టీఆర్ఎస్ నేతలు ఎలా రియాక్ట్ అవుతారో వేచి చూడాల్సిందే మరి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments