జనసేనకు దారుణంగా సీట్లు తగ్గించిన చంద్రబాబు.. రగిలిపోతున్న జనసైనికులు..

  • IndiaGlitz, [Monday,February 05 2024]

అధికారంలోకి రావాలంటే ప్రభుత్వం వ్యతిరేక ఓటు చీలకుండా చూడాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ తన కార్యకర్తలకు చెబుతూ వచ్చారు. ఇందులో భాగంగా తెలుగుదేశం పార్టీతో పొత్తు చారిత్రక అవసరమని ఊదరగొట్టారు. ఓవైపు ఎన్డీయేలో బీజేపీలో పొత్తులో ఉంటూనే.. మరోవైపు చంద్రబాబుతో కాపురం చేస్తున్నారు. దీనికి రకరకాల కారణాలు చెప్పుకుంటూ వచ్చారు. స్కిల్ డెవలెప్‌మెంట్ అవినీతి కేసులో తన బాస్ అరెస్ట్ అయితే ఆగమేఘాల మీద హైదరాబాద్ నుంచి రాజమండ్రికి బయలుదేరారు. శాంతిభద్రతల సమస్య తలెత్తే ప్రమాదం ఉందని పోలీసులు ఏపీ సరిహద్దులో అడ్డుకుని సహకరించాలని కోరారు. అంతే పూనకాలు వచ్చినట్లు రోడ్డు మీద పడుకుని నిరసనకు దిగారు. పోలీసులు సహకరించడంతో రాజమండ్రి సెంట్రల్ జైలు వెళ్లి మరీ బాబుతో ములాఖత్ అయ్యారు. నేనున్నాంటూ భరోసా ఇచ్చారు. వెంటనే టీడీపీతో పొత్తు పెట్టుకుంటున్నట్లు ప్రకటించారు. దీంతో జనసేన క్యాడర్ బిత్తరపోయింది.

ఏడు సార్లు చంద్రబాబుతో భేటీ..

అయితే క్యాడర్‌ను ఉత్సాహపరిచేలా కొన్ని మాయ మాటలతో నమ్మించే ప్రయత్నం చేశారు. ఆత్మగౌరం నిలబడేలా పొత్తులో సీట్లు ఉంటాయంటూ నమ్మబలికారు. దీంతో క్యాడర్ కూడా గౌరవప్రదమైన సీట్లు వస్తాయో ఏమో అని ఆశలు పెట్టుకున్నారు. సీట్ల పంపిణీపై చంద్రబాబుతో పవన్ పలుమార్లు భేటీ అయ్యారు. రాజమండ్రి జైల్లో ములాఖత్, యువగళం ముగింపు సభలో మీటింగ్ కలుపుకుంటే ఇప్పటివరకు మొత్తం ఏడు సార్లు తన దత్తతండ్రితో సమావేశమయ్యారు. సెప్టెంబర్ 4న రాజమండ్రి జైల్లో, నవంబర్ 4న హైదరాబాద్‌లో బాబు నివాసంలో, డిసెంబర్ 17న హైదరాబాద్‌లోని పవన్ కల్యాణ్ నివాసంలో, డిసెంబర్ 20న యువగళం ముగింపు సభలో, జనవరి 9న విజయవాడలో కేంద్ర ఎన్నికల బృందంతో కలిసి ఓట్ల అవకతవకలపై ఫిర్యాదు చేశారు. జవనరి 14న భోగి పండుగ సందర్భంగా ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో, తాజాగా ఫిబ్రవరి 4న ఉండవల్లిలో చంద్రబాబు నివాసంలో ఇలా ఏడు సార్లు సమావేశమయ్యారు.

సీట్లను తగ్గించుకుంటూ వస్తున్న బాబు..

ప్రతి సమావేశం సందర్భంగా జనసేనకు సీట్లను తగ్గించుకుంటూ చంద్రబాబు వస్తున్నారు. ఎన్ని సీట్లు ఇస్తున్నారో తేలకముందే రా..కదిలి రా సభల్లో మండపేట, అరకు అభ్యర్థులను బాబు ప్రకటించారు. మోసపోతున్నామని జనసైనికులు గగ్గోలు పెడితే.. చంద్రబాబు పొత్తు ధర్మం పాటించలేదంటూ రాజోలు, రాజానగరం సీట్లను ప్రకటించారు. తాను కూడా తగ్గే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. దీంతో క్యాడర్‌లో జోష్ నింపారు. ఆ జోష్ ముచ్చటగా మూడు రోజులు కూడా లేదు. ఆదివారం చంద్రబాబుతో భేటీ సందర్భంగా జనసేనకు ఇచ్చే సీట్లపై క్లారిటీ వచ్చినట్లు తెలుస్తోంది.

25 సీట్లు మాత్రమే ఇస్తామని స్పష్టం..!

ఈ భేటీలో జనసేనకు 30కు పైగా సీట్లు అడగ్గా.. కేవలం 25 సీట్లు మాత్రమే ఇస్తామని బాబు తేల్చిచెప్పినట్లు సమాచారం. దీంతో సరే మహాప్రభో అంటూ పవన్ ఒప్పుకున్నట్లు టీడీపీ నేతలు చెబుతున్నారు. మొత్తానికి జనసేనకు సీట్లను గణనీయంగా తగ్గించడం పట్ల ఆ పార్టీ కార్యకర్తలు తీవ్ర ఆగ్రహంతో రగిలిపోతున్నారు. కనీసం 60కు పైగా సీట్లు కూడా ఇవ్వకపోతే పొత్తు ఎందుకని పవన్‌ కల్యాణ్‌ను ప్రశ్నిస్తున్నారు. అటు టీడీపీ ఇచ్చే అరకొర సీట్లను కూడా టీడీపీ త్యాగం చేసినట్లు చూపించాలని ఇప్పటికే ఎల్లో మీడియాకు ఆదేశాలు వెళ్లాయి. ఇందుకు అనుగుణంగా పచ్చ మీడియా వార్తలను ఊదరగొడుతోంది. చివరకు పవన్ కల్యాణ్‌ను నమ్ముకున్న క్యాడర్ మాత్రం తీవ్ర నిరాశకు లోనవుతున్నారు.