Chandrababu:రెండెకరాలతో రాజకీయాల్లోకి వచ్చి.. రూ. 6లక్షల కోట్లకు చేరిన చంద్రబాబు ఆస్తి
- IndiaGlitz, [Thursday,October 05 2023]
కొంతమంది అంతే... స్వీయ ఆరాధనాభావనతో బతుకుతుంటారు. తాను అందగాడిని.. తాను తెలివైనవాడిని.. తాను బుద్ధిమంతుడిని.. అనే భ్రమల్లో బతుకుతూ జనాన్ని సైతం నమ్మిస్తూ ఉంటారు. టీడీపీ అధినేత చంద్రబాబు సైతం అచ్చం అదే సమస్యతో బాధపడుతూ ఉంటారు. కేవలం రెండే ఎకరాలతో రాజకీయాల్లోకి వచ్చిన చంద్రబాబు సంపద ఇప్పుడు రూ.లక్షల కోట్లకు చేరింది. అదంతా రాజకీయాల్లో చేరాక పోగేసిన ప్రజల సొమ్ములే. ఏదైనా పథకంలో అవినీతి జరిగిందని వింటూ ఉంటాం. కానీ చంద్రబాబు అయితే అసలు ముందే అవినీతి చేసేసి.. రూ.వేలకోట్లు కొట్టేసి తరువాత పథకాన్ని అమలు చేస్తారు. ఈనాడు అమరావతి ఇన్ సైడర్ ట్రేడింగ్ దగ్గరి నుంచి, అమరావతి ఇన్నర్ రింగురోడ్డు వరకు.. ఆనాడు ఏలేరు కుంభకోణం నుంచి హైదరాబాద్ సైబర్ టవర్స్ నిర్మాణానికి ముందు అక్కడ భూముల కొనుగోళ్ల వరకు.. ఇదే ఫార్ములా ఫాలో అయ్యారు. పథకం అమలుకు ముందే కోట్లు మింగేసి తరువాత మెల్లగా ఆ పథకాన్ని దారిలో పెడతారు. ఇదీ అయన అవినీతి స్టయిల్. ఇంతా చేసాక కూడా తాను మహాత్మాగాంధీని అని ప్రగల్భాలు పలుకుతారు. తాను వాచీ, ఉంగరం కూడా లేకుండా బతికేస్తాను అంటారు. అందరూ శ్రీ వైష్ణవులే కానీ ఉట్టి మీద వట్టి చేపలు మాత్రం కరిగిపోయాయని అన్న చందంగా చంద్రబాబుకు వాచీ లేదు కానీ లక్షల కోట్ల ఆస్తులు మాత్రం ఉన్నాయి.
2014-19 మధ్య ప్రతి పథకంలో అవినీతి చేసిన చంద్రబాబు..
దివంగత మహానేత వైయస్ రాజశేఖర రెడ్డి దెబ్బతో పదేళ్లు(2004-14) మధ్య అధికారానికి దూరమై అవినీతికి, అక్రమ సంపాదనకు ముఖం వాచిన చంద్రబాబు 2014లో దాదాపు 600 హామీలుతో పాటు పవన్, మోదీల సహకారంతో అధికారంలోకి వచ్చారు. వచ్చి రాగానే స్కిల్ డెవలప్మెంట్ పథకంలో రూ. 241 కోట్ల స్కాంతో బోణీ కొట్టిన అయన ఇక ఐదేళ్లు వెనుదిరిగి చూడలేదు. ప్రతి పథకాన్ని అయన తనకు బంగారు బాతుగుడ్లు ఇచ్చే పథకంలా మార్చేశారు. ఇక అప్పటికే సిద్ధంగా ఉన్న పోలవరం ప్రాజెక్టు మీద కన్నేశారు. రూ.16,000 కోట్లు ఖర్చయ్యే ప్రాజెక్టును రూ. 57, 950 కోట్లకు పెంచేశారు. ఒకే డీల్‌లో దాదాపు రూ. 25వేల కోట్లు కొట్టేశారు. ఇది కాకుండా జలవనరుల శాఖలో పనులన్నీ నామినేషన్ మీద సీఎం రమేష్‌కు చెందిన కంపెనీకి కట్టబెట్టి అక్కడ మరో రూ. 4,834 కోట్లు నొక్కేశారు. ఆ తర్వాత బాబు కళ్లు గోదావరి- పెన్నా నదుల అనుసంధానం మీదకు వెళ్లింది. ఇక్కడ రూ. 6,020 కోట్ల పనులకు టెండర్లు పిలిచి అందులో 50 శాతం మింగేశారు. పోలవరం మట్టికట్ట పనుల్లో మరో రూ.1590 కోట్లు మాయం చేశారు. చింతలపూడి ఎత్తిపోతల పథకంలో రూ. 573 కోట్లు అమాంతం అయన ఖాతాలోకి వెళ్ళిపోయాయి.
పత్రాలు హుదూద్ తుఫాన్ మింగితే.. భూములు టీడీపీ నేతలు వాళ్లు మింగేశారు..
అడిగేవాళ్లు లేకపోతె చెప్పేవాడిదే రాజ్యం. చంద్రబాబు అదృష్టమో.. ప్రజల దురదృష్టమో తెలియదు కానీ అయన పాలనలో ఉంటే కరువు కాటకాలు, తుఫానులూ, వరదలు వెల్లువెత్తుతాయి. ఈ ఉత్పాతాలన్నీ ప్రజలకు కన్నీళ్లు మిగులుస్తాయి. చంద్రబాబుకు మాత్రం ఆస్తులు పెంచుతాయి. సరిగ్గా ఈసారి ఆయనకు హుదూద్ రూపంలో బంపర్ ఆఫర్ తగిలింది. విశాఖలో హుదూద్ దెబ్బకు రెవెన్యూ పత్రాలన్నీ గల్లంతు అయ్యాయట. ఇక అడ్డు ఏముంది.. అడిగేవాళ్లు ఎవరున్నారు..? దీంతో వేలాది ఎకరాల ప్రభుత్వ, అసైన్డ్ భూములన్నీ తన బినామీల పేర్ల మీదకు మారిపోయాయి. పెందుర్తి, భీమిలి, యలమంచిలి, అనకాపల్లి ఇలా కుదిరిన చోటల్లా భూములను కబ్జా చేశారు టీడీపీ నేతలు. రాత్రికి రాత్రి పత్రాలు సృష్టించేశారు. ఈ కుంభకోణం విలువ లక్ష కోట్లు ఉంటుందని అంచనా. ఇక 24, 514 ఎకరాల ఇనాం భూములను కబ్జా చేసిన తెలుగుదేశం నాయకులు దాదాపు రూ. 5,097 కోట్ల విలువైన ఆస్తులు కాజేశారు. నీరు, చెట్టు, ఇసుక ఇలా ప్రతిదాన్నీ దోచేశారు. వీటి విలువ రూ. 34, 399 కోట్లు పైనే. ఉంటుంది. ఇలా చెప్పుకుంటూ పోతే లంకాదహనానికి యేతెంచిన రామదూత వాలమును మించిన పొడవైన చిట్టా బయటపడుతుంది. వివిధ మార్గాల ద్వార మొత్తం చంద్రబాబు దోచిన సంపద విలువ అక్షరాలా రూ. 6లక్షల కోట్ల వరకూ ఉంటుందని అంచనా. కానీ చంద్రబాబు మాత్రం తాను మహాత్మా గాంధీకి సరిసాటి అంటూ ఉంటారు. అందుకే వినేవాళ్లు ఉంటే చెప్పేవాడు చంద్రబాబు అనే సామెత పుట్టుకొచ్చింది.