Chandrababu, Pawan:వచ్చేది తమ ప్రభుత్వమే.. జగన్‌కు వడ్డీతో సహా చెల్లిస్తాం: చంద్రబాబు, పవన్
- IndiaGlitz, [Thursday,December 21 2023]
టీడీపీ-జనసేన ప్రభుత్వం వచ్చాక ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయం కల్పిస్తామని టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు తెలిపారు. విజయనగరంలో జరిగిన యువగళం నవశకం బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో 18 ఏళ్లు దాటిన ప్రతి ఆడబిడ్డకు నెలకు రూ.1500, తల్లికి వందనం కింద రూ.15,000 ఇవ్వనున్నట్లు వెల్లడించారు. అలాగే పేదవారికి ఏడాదికి ఉచితంగా 3 సిలిండర్లు.. రైతుకు ఏడాదికి రూ.20,000 సాయం చేస్తామని.. నిరుద్యోగులకు నెలకు రూ.3వేల చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఏపీలో అధికారంలోకి వచ్చేది టీడీపీ, జనసేన ప్రభుత్వమేనన్నారు. త్వరలోనే అమరావతి, తిరుపతిలో సభలు పెడతామని.. అందులో రెండు పార్టీల ఉమ్మడి మేనిఫెస్టో ప్రకటిస్తామని పేర్కొన్నారు.
రాజకీయాల్లో పార్టీలు పెట్టే స్వేచ్ఛ అందరికీ ఉంది కానీ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసే అధికారం ఎవరికీ లేదని మండిపడ్డారు. హైదరాబాద్‌ను తన తర్వాత వచ్చిన ముఖ్యమంత్రులు కూడా జగన్ లాగా విధ్వంసం చేసి ఉంటే ఇంత అభివృద్ధి చెందేదా అని ప్రశ్నించారు. అమరావతి రాజధానిగా.. విశాఖ ఆర్థిక రాజధాని, ఐటి హబ్‌గా ఉంటుందని తాను చెప్పానన్నారు. కానీ ఈ సైకో జగన్ వచ్చాక అమరావతిని సర్వనాశనం చేసి మూడు ముక్కల ఆటాడాడని ఆగ్రహం వ్యక్తంచేశారు. రుషికొండకు బోడు గుండు కొట్టి విలాసం కోసం రూ.500 కోట్లు ఖర్చు పెట్టే హక్కు ఈ ముఖ్యమంత్రికీ ఎవరిచ్చారు? అని ధ్వజమెత్తారు. అందుకే రాష్ట్రాన్ని కాపాడుకోవాలనే ఉద్దేశంతో వైసీపీ వ్యతిరేక ఓటు చీలకూడదని భేషరతుగా ముందుకు వచ్చిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ని అభనందిస్తున్నానని చెప్పారు. తాము అధికారంలోకి జగన్‌కు వడ్డీతో సహా చెల్లిస్తామని హెచ్చరించారు.
అంతకుముందు పవన్ కల్యాణ్ మాట్లాడుతూ టీడీపీ, జనసేన మైత్రిని చాలా కాలం పాటు కాపాడుకోవాల్సి ఉందని అన్నారు. యువగళం సభకు తనను ఆహ్వానించాలని ప్రతిపాదన వచ్చినప్పుడు .. 220రోజులు, 97 నియోజకవర్గాల్లో 3వేల కిలోమీటర్లకు పైగా చేసిన పాదయాత్రలో ప్రజల కష్టాలు లోకేష్ తెలుసుకున్నారని.. ఇది లోకేష్ రోజు.. అటువంటి సభలో తాను ఉండటం సబబా అనిపించిందన్నారు. అయితే లోకేష్, చంద్రబాబు ఆహ్వానం మేరకు తాను మనస్పూర్తిగా ఇక్కడకు వచ్చాననని తెలిపారు. ఈ పాదయాత్ర జగన్ చేసిన లాంటి పాదయాత్ర కాదన్నారు. కష్టాలు తెలుసుకున్న పాదయాత్ర.. మాటలతో చెప్పే పాదయాత్ర కాదు.. చేతలతో చూపించిన పాదయాత్ర అని ప్రశంసించారు.
తాను నడుద్దాం అంటే తనను నడవనిచ్చే పరిస్థితి ఉండదన్నారు. పాదయాత్ర ద్వారా చాలా మంది సాధకబాధకాలు తెలుసుకునే అవకాశం ఉంటుందని.. తనకు అటువంటి అవకాశం లేకపోవడం కొంత బాధగా కూడా ఉందన్నారు. చంద్రబాబును అన్యాయంగా జైల్లో పెట్టినప్పుడు తనకు చాలా బాధ కలిగిందన్నారు. చంద్రబాబు కుటుంబ సభ్యుల ఆవేదన, భువనేశ్వరి బాధ చూశానని పేర్కొన్నారు. అందుకే తాను ఏదీ ఆశించి టీడీపీకి మద్దతు ఇవ్వలేదని స్పష్టంచేశారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం, జాతీయ స్థాయిలో రాజకీయాలు నడిపిన వ్యక్తిని అన్యాయంగా జైలుకు పంపడం బాధ కలిగించిందని పవన్ వెల్లడించారు.
వైసీపీ ఎమ్మెల్యేలను మారుస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.. 80 మందిని మారుస్తారంట.. అసలు మార్చాల్సింది ఎమ్మెల్యేలను కాదు.. జగన్‌నే ముందు మార్చాలని ఎద్దేవా చేశారు. ఇది లోకేష్ సభ కాబట్టి పరిమితంగానే మాట్లాడుతున్నానని టీడీపీ-జనసేన మైత్రి చాలా సంవత్సరాల పాటు కాపాడుకోవాలని ఆశిస్తున్నానని పేర్కొన్నారు. హలో ఏపీ... బైబై వైసీపీ .. అనేది ప్రజలంతా గుర్తు పెట్టుకోవాలన్నారు. అయితే చివరలో టీడీపీ, జనసేన పొత్తుకు బీజేపీ అధినాయకత్వం కూడా సంపూర్ణ మద్దతు ఇస్తుందని ఆశిస్తున్నానని పవన్ వెల్లడించడం గమనార్హం.